
పాఠశాల విలీనానికి నిరసనగా ఆమరణ దీక్ష
పెనుమంట్ర: పెనుమంట్ర దళితవాడలోని ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక గురువారం విలేకరులకు తెలిపారు. 80 ఏళ్ల నాటి పాఠశాలను గత ప్రభుత్వంలో నాడు– నేడు నిధులతో అభివృద్ధి చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా గత హెచ్‌ఎం, ఎంఈఓ కలిసి విద్యాకమిటీ సభ్యులను పక్కదారి పట్టించి ఇష్టానుసారం పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాను దీక్షకు దిగనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తహసీల్దార్, పోలీస్ అధికారులు కూడా వినతి పత్రాల అందించానన్నారు. ఈ పాఠశాలలో 32 మంది విద్యార్థులు చదువుకునే వారన్నారు. అలాగే గురువారం వైఎస్సార్ నగర్‌లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగ్గా తాము వెళ్లేలోపు ప్రజాప్రతినిధులు కానివారితో కొబ్బరికాయలు కొట్టించి అధికారులు తమను అవమానపరిచారని ప్రియాంక వాపోయారు. సమావేశంలో పెనుమంట్ర–1 ఎంపీటీసీ చింతపల్లి మంగాదేవి, ఉప సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు పాల్గొన్నారు.