
ప్రాణాంతకం.. గొంతువాపు
భీమవరం: పాడి రైతులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ పాడిని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు అవకాశముంటుంది. వర్షాకాలంలో పశువులకు గొంతువాపు, గుది పెట్టు వ్యాధులు సోకే ప్రమాదమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో 1,78,137 గేదేలు, 45,539 ఆవులున్నాయి. పశువులకు సోకే వ్యాధుల పట్ల రైతులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్రత ఎక్కువై పశు మరణాలు సంభవించడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాధులపై రైతులు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే ఇంటి వద్దనే నిరోధించేందుకు వీలుంటుందని పశు వైద్యులు చెబుతున్నారు.
వర్షాకాలంలో గేదెలకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు ఒకటి. ఈ వ్యాధి పందుల్లో తరచుగా, గొర్రెలు, మేకల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాపించే అవకాశం ఉంది. ఎక్కువగా వర్షాకాలంలో దీనిని గుర్తించవచ్చు. నదీ పరివాహక ప్రాంతాలు, డెల్టాలు, వరిసాగు అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఉండే గేదెలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఇది ఒక రకమైన సూక్ష్మజీవి ద్వారా పశువులకు వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి వ్యాధి సోకిన 8 నుంచి 24 గంటల వ్యవధిలో పశువు చనిపోయే ప్రమాదముంది. వ్యాధి ప్రారంభ దశలో పశువు నీరసంగా ఉంటుంది. తరువాత నడవలేక పోవడం, అధిక జ్వరం, నోటి నుంచి సొంగ కారడం, ముక్కు నుంచి చిక్కటి ద్రవం స్రవించడం, కళ్లు ఎరబ్రడి నీరు కారుతూ ఉండటం లక్షణాలు. ముందుగా గొంతు భాగంలో వాపు ఉండి తరువాత వాపు చెంపలు, మెడ, ముందుకాళ్ల మధ్య భాగం, పొట్ట కింద భాగం వరకూ విస్తరిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీలుస్తుంది. సాధారణంగా ఈ దశలో పశువు నాలుక బయటకు తీస్తూ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ దశ తరువాత కొన్ని గంటల వ్యవధిలో పశువు చనిపోతుంది.
వ్యాధి వ్యాప్తి ఇలా..
వ్యాధి సోకిన పశువుల నుంచి కారే సొంగ, ముక్కు నుంచి స్రవించే ద్రవాల ద్వారా వ్యాధి బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. తరచుగా వ్యాధి సోకే ప్రాంతాల్లో నివసించే ఐదు శాతం పశువులు ఈ వ్యాధికి వాహకాలుగా ఉంటాయి. అలసిపోయిన, ఒత్తిడికి గురైన పశువులకు ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. సాధారణంగా కలుషితమైన మేత, గాలి ద్వారా వ్యాధి కారకం పశువుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన క్రిమి త్వరగా విభజన చెంది ఎండోక్సిన్స్ అనే విష పదార్థాలను విడుదల చేస్తుంది. ఇది రక్తంలోకి ప్రవేశించిన అనంతరం వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం
వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వర్షాకాలానికి ముందు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. పశువుల పాకలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు విధిగా వేయించాలి. పశువైద్యుడి సలహా మేరకు సల్ఫాన్‌మైడ్స్, టెట్రాసైక్లినన్స్, పెన్సులిన్, క్లోరామ్ ఫినికాల్ వంటి యాంటి బయోటిక్ మందులు ముందుగా వాడితే ఫలితం ఉంటుంది. వ్యాధి ముదిరిన తరువాత చికిత్స పెద్దగా ఫలితం ఇవ్వదు. పి.సుధీర్‌బాబు, పశుసంవర్ధశాఖ సహాయ సంచాలకుడు, భీమవరం

ప్రాణాంతకం.. గొంతువాపు

ప్రాణాంతకం.. గొంతువాపు