ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఏలూరులోని రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాట్లను, పరీక్షల నిర్వహణ తీరును పరీశీలించారు. జిల్లాలో ఈనెల 30 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తంగా 17,584 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. అభ్యర్థుల సౌకర్యార్థం 9030723444, 9505644555 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామన్నారు.
తొలిరోజు 685 మంది హాజరు..
ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 685 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్‌లో ఉదయం 181 మందికి 165 మంది, మధ్యాహ్నం 180 మందికి 159 మంది, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్‌లో ఉదయం 200 మందికి 181 మంది, మధ్యాహ్నం 200 మందికి 180 మంది హాజరైనట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం


