రెచ్చిపోతున్న మట్టి మాఫియా
ఇరగవరం: మండలంలోని పలు గ్రామాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారులు, అధికార పార్టీ నాయకుల అండ దండలతో విర్రవీగుతూ మట్టిని తరలిస్తున్నారు. ఇరగవరం మండలంలోని కొత్తపాడు, రేలంగి, కత్తవపాడు, అయినపర్రు, పేకేరు, రేలంగి, పొదలాడ గ్రామాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వీటిని అదుపు చేయాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదు.
అనుమతుల ఊసే లేదు
అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుతున్నాయి. పూడిక పేరుతో చెరువులను లోతుగా తవ్వి అక్కడ మట్టి ని తొలగిస్తున్నారు. కంతేరు గ్రామంలో సుమారు మూడు ఎకరాల చెరువు గట్టు నుంచి సుమారు పది అడుగుల మేర లోతు మట్టిని తవ్వుతున్నారు. కొత్తపాడు సరిహద్దు ఇరగవరం గ్రామంలో సుమారు ఎకరం చెరువును పూడ్చి వేయడం జరిగింది. దాని గుట్టు మీద ఉన్న సుమారు ఇరవై కొబ్బరి చెట్లు తొలగించారు. ఎక్కడా కూడా ఫిషరిష్, రెవెన్యూ అధికారులు అనుమతులు తీసుకోలేదు. చెరువులు పూడ్చడానికి, తవ్వడానికి ఫిషరిష్ అధికారుల అనుమతులు తప్పనిసరి. కానీ అది ఎక్కడా జరగడం లేదు. ట్రాక్టర్లు, లారీతో మట్టి తరలించడం వల్ల రోడ్లు సైతం పాడైపోతుండడంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇరగవరం మండలం నుంచి మట్టిని తణుకు, పెనుగొండ, పెనుమంట్ర, ఆలయూరు, ఇరగవరం గ్రామాల్లో లేఅవుట్లు పూడ్చడానికి తరలిస్తున్నా అక్కడ లే అవుట్లు పూడ్చడానికి ఎకరాకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అర్జిస్తున్నారు. దీంతో మట్టి వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్నారు. దీని కోసం రైతులకు వేలల్లో డబ్బులు ఇస్తున్నారు. అధికారులు వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు వారికి లక్షల్లో ముడుపులు అప్పజెప్పుతున్నారు అని రెవెన్యూ అధికారులు మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వారికి రూల్స్ చెప్పి జరిమానా విధించే పోలీసులు, ఆర్‌టీవో అధికారులు లైసెన్సులు, ధ్రువపత్రాలు లేకుండా ట్రాక్టర్లు, లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి దోపిడికి అడ్డు కట్ట వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
అధికార పార్టీ అండదండలతో విర్రవీగుతున్న భూబకాసురులు
ముడుపుల మత్తులో జోగుతున్న అధికారులు
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
రెచ్చిపోతున్న మట్టి మాఫియా


