
ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం
ఏలూరు రూరల్: ఏలూరు ఇండోర్ స్టేడియం గత వైభవాన్ని కోల్పోతోంది. ప్రభుత్వం ఉదాసీనత, నిధుల కొరతతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి నిలువటద్దంగా మారుతోంది. గతంలో అభివృద్ధి చేసిన మౌలిక వసతులు నేడు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. దీనికి తోడు చినుకు పడితే స్టేడియం చిత్తడిగా మారిపోతోంది. డ్రెయినేజీ వ్యవస్థ పని చేయడం లేదు. ఫలితంగా సాధన చేసే క్రీడాకారుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది.
నిరుపయోగంగా ఫ్లడ్‌లైట్లు
గతంలో అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి స్టేడియం చుట్టూ ఆరు చోట్ల భారీ స్తంభాలతో ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లు నేడు నిరుపయోగంగా మారాయి. అవసరానికి అనుగుణంగా దిశ మార్చుకునేందుకు, ఎత్తు సైతం పెంచుకుని స్టేడియం మొత్తం వెలుగులు విరజిమ్మేలా లైట్లు ఏర్పాటుచేశారు. ఇందుకోసం స్తంభాల కింద ఒక మోటార్ సైతం బిగించారు. ప్రత్యేక ఫీజ్ బాక్సులు సిద్ధం చేశారు. నేడు ఈ ఫీజు బాక్సులు కానరావడం లేదు. మోటార్లు మరమ్మతు పాలయ్యాయి. వైరింగ్ ప్రమాదకరంగా మారింది. ఈ మొత్తం వ్యవస్థను మరమ్మతులు చేయకుండా వదిలేశారు. స్టేడియం అంతటా చీకట్లు కమ్ముకుంటున్నాయంటూ వాకర్స్, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. ఫ్లడ్‌లైట్లు గురించి పట్టించుకోలేదు.
మూతబడిన జిమ్
స్టేడియంలో ఇండోర్ కూలిపోవడంతో క్రీడాకారులు సాధన చేసే జిమ్ సైతం మూతపడింది. ఈ జిమ్‌లో ఏర్పాటుచేసిన తాగునీటి సరఫరా ప్లాంట్ సైతం నిరుపయోగంగా మారింది. దీంతో క్రీడాకారులు జిమ్ కోసం స్టేడియం వదిలి, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
కంపు కొడుతున్న మరుగుదొడ్డి
క్రీడాకారులు, వాకర్స్ సౌలభ్యం కోసం గతంలో స్టేడియం పరిసరాల్లో నిర్మించిన మరుగుదొడ్డి సైతం కంపుకొడుతోంది. ఆకతాయిలు దొడ్డి తలుపులు విరగ్గొట్టడంతో బాలికలు ఉపయోగించేందుకు భయపడుతున్నారు. కొన్నిసార్లు వాటర్, కరెంట్ సరఫరా లేకపోవడంతో మరుగుదొడ్డి ఉపయోగించుకోలేక పోతున్నామని క్రీడాకారులు వాపోతున్నారు.
చిందరవందరగా స్టేజీ
ఆటల పోటీల సమయంలో క్రీడాకారులకు బహుమతులు అందించేందుకు నిర్మించిన స్టేజీ సైతం మరమ్మతులకు నోచుకోలేదు. గతంలో స్టేజీపై విద్యుత్ లైట్లతో పాటు సౌండ్ సిస్టమ్ ఏర్పాటుచేశారు. కొంతకాలంగా స్టేజీ నిర్వహణపై పర్యవేక్షణ కొరవవడంతో సౌండ్ సిస్టమ్, లైట్లు పనికి రాకుండాపోయాయి. ఎక్కడపడితే అక్కడ వైర్లు వేలాడుతూ పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
పిల్లలు లేక వెలవెలబోతున్న ఇండోర్‌స్టేడియం
అక్కరకు రాని ఫ్లడ్‌లైట్లు
నిరుపయోగంగా మరుగుదొడ్లు
తెరుచుకోని జిమ్, వాటర్ ప్లాంట్
పర్యవేక్షణ కొరవడింది
సాయంత్రమైతే స్టేడియం అంతటా చీకట్లు కమ్ముకునేవి. చీకట్లో వాకింగ్ చేసి వెళ్లిపోవడమే. ఇప్పుడు తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేశారు. కానీ గతంలో మాదిరిగా ఆట స్థలాలు అభివృద్ధి చేయడం లేదు. గతంలో ఉదయం, సాయంత్రం ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటెన్ ఆడుకునేవారు. కూలిపోయిన ఇండోర్ స్థానంలో కొత్తది నిర్మించాలి. మరుగుదొడ్డి, తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేయాలి.
– ఎస్ సత్యనారాయణ
ప్రత్యామ్నాయాలు చేస్తున్నాం
గతంలో నిర్మించిన ఫ్లడ్‌లైట్ల మెయింటెనెన్స్ కష్టంగా మారింది. పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. అందుకోసం వాటిస్థానంలో అవసరం మేరకు లైట్లు ఏర్పాటుచేశాం. ఇండోర్ కూలిపోవడంతో వాటర్‌ప్లాంట్, జిమ్ మూసేశాం. త్వరలో ఎస్‌బీఐ సౌజన్యంతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. వెయిట్‌లిఫ్టింగ్ హాల్‌లో మంచినీరు ఏర్పాటుచేశాం. మరుగుదొడ్డి మెయింటెనెన్స్ ప్రైవేటు సంస్థకు అప్పగించేలా చూస్తున్నాం.
– బి శ్రీనివాసరావు, డీఎస్‌డీఓ

ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం

ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం

ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం

ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం

ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం