ఎర్ర గ్రావెల్‌ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే | - | Sakshi
Sakshi News home page

ఎర్ర గ్రావెల్‌ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే

May 28 2025 12:40 AM | Updated on May 28 2025 11:46 AM

ఎర్ర

ఎర్ర గ్రావెల్‌ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే

ద్వారకాతిరుమల: అవినీతి అధికారులు ఉన్నంత వరకు అక్రమార్కులకు అడ్డేలేదు అనడానికి పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్‌ తవ్వకాలే నిదర్శనం. నామమాత్రపు అనమతులను అడ్డం పెట్టుకుని ఏకంగా క్వారీలు ఏర్పాటు చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా భూమిని తవ్వేస్తూ.. ఎంతో విలువైన ఎర్ర గ్రావెల్‌ను అమ్మేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని తరలించేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల వద్ద గోతులు తవ్వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకునే నాధుడు లేడు. ముడుపుల మత్తులో జిల్లా అధికార యంత్రాంగం నిద్ర నటించడమే ఇందుకు కారణమని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ఇంతటి అరాచక పాలనను, లెక్కలేని అధికారుల తీరును ముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు.

మళ్లీ పూడ్చేస్తాములే..

కాలువ తవ్విన సమయంలో గట్టుపై వేసిన మట్టిని బయటకు తోలుకునేందుకు మూడు కంపెనీలకు ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అయితే గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, భూమిని తవ్వి ఎంతో విలువైన ఎర్ర గ్రావెల్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దాంతో తవ్వకాలు జరిగిన ప్రాంతాలు క్వారీలను తలపిస్తున్నాయి. తమ పొలాలకు వెళ్లే మార్గాల్లో గుంతలు తవ్వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరుపుతున్న వారిని ప్రశ్నిస్తే.. మళ్లీ పూడ్చేస్తాములే అని సమాధానం చెబుతున్నారట. వర్షాలకు గోతులు నిండిపోయి అందులో రైతులు గాని, పశువులు గాని పడి మృత్యువాత పడితే దానికి ఎవరు బాధ్యులు. తవ్వకాలు జరుపుతున్న వారా.. లేక అధికారులా.. అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.

మొక్కుబడిగా పూడిక..

గట్టుపై మట్టి తవ్వకాలు ముసుగులో జరుగుతున్న అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై ఇటీవల సాక్షిలో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. దాంతో ఉలిక్కిపడ్డ అక్రమార్కులు తమ తప్పులను అధికారుల సూచనలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పంగిడిగూడెం వద్ద గ్రావెల్‌ తవ్వగా ఏర్పడిన గోతులను, గట్టుపై ఉన్న మట్టితో మొక్కుబడిగా పూడ్చుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే గోతులు పూడ్చుతున్నామని చెబుతున్నారు. అసలు గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఎవరిచ్చారు, ఇప్పటి వరకు తవ్విన గోతుల సంగతి ఏమిటన్న ప్రశ్నలకు వారి వద్ద సమాదానం లేదు.

ముసుగులతో రవాణా..

కూటమి నేతలు ఎంతో విలువైన గ్రావెల్‌ను అక్రమంగా అమ్మేస్తున్నారని, అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని జిల్లా వ్యాప్తంగా తెలిసిపోయింది. దాంతో టిప్పర్లలోని గ్రావెల్‌ బయటకు కనబడకుండా గ్రీన్‌ క్లాత్‌లు కట్టి మరీ రవాణా చేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు తరలిపోతోంది.

పోలవరం కుడి కాలువగట్టుపై ఏకంగా గ్రావెల్‌ క్వారీలు

మట్టి ముసుగులో యథేచ్ఛగా ఎర్ర గ్రావెల్‌ తవ్వకాలు

నిద్ర నటిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం

ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు

పంగిడిగూడెం వద్ద నాకు ఉన్న పొలానికి వెళ్లే దారిలో గోతులు తవ్వేస్తున్నారని ఇరిగేషన్‌ అధికారులకు పలుమార్లు ఫోన్‌లో ఫిర్యాదులు చేశాను. అయినా వారు పట్టించుకోలేదు. కూటమి నేతలకు ఎదురు తిరిగి నిలబడలేను. ఎందుకంటే వారి వెనుక ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. నా కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మిగిలిన రైతుల పరిస్థితి కూడా ఇదే.

– భీమడోలుకు చెందిన ఓ రైతు

ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు

కాలువ గట్టుపై ఉన్న మట్టిని విడిచిపెట్టి, క్వారీలు తవ్వుతూ కూటమి నేతలు కోట్లు గడిస్తున్నారు. ఆ డబ్బుతో అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు. అందుకే అధికారులు సైతం అక్రమార్కులకు తొత్తుల్లా మారారు. ఇంత దారుణాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎం.నాగులపల్లి, పంగిడిగూడెం వద్ద పచ్చ నేతలు, జనసేన నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి.

– ఎం.నాగులపల్లికి చెందిన ఓ రైతు

ఎర్ర గ్రావెల్‌ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే 1
1/2

ఎర్ర గ్రావెల్‌ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే

ఎర్ర గ్రావెల్‌ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే 2
2/2

ఎర్ర గ్రావెల్‌ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement