
జీలుగ సాగుతో పంటలు బాగు
ముసునూరు: నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువుల సాయంతో భూమిని సారవంతంగా మార్చుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువు పంటల్లో జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో రైతులు జీలుగ సాగుకే మొగ్గు చూపుతున్నారు. నత్రజని, భాస్వరం, పొటాష్, మాంగనీస్ వంటి పోషకాలను పంటలకు విరివిగా అందించే జీలుగను సాగు చేసి లాభాలు పొందాలని ముసునూరు మండల వ్యవసాయాధికారి.కె.చిన సూరిబాబు సూచిస్తున్నారు. మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో జీలుగ విత్తనాల పంపిణీ చేస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రయోజనాలు
● పొలంలో జీలుగను కలియ దున్నితే నేలకు సారం, తదుపరి వేసే పంటలకు లాభాలనిస్తుంది.
● నేలలో ఉండే చౌడును నివారిస్తుంది.
● మొక్కలకు రెండు శాతం నత్రజని, సూపర్ ఫాస్ఫేట్ అదనంగా అందుతుంది.
● జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మ ధాతువులను పంటకు అందిస్తుంది.
● నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తుంది.
● నేలలో భౌతిక స్థితి మెరుగుపడి, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే గుణాన్ని పెంచుతుంది.
● పంట పొలంలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది.
● పంట పొలంలో వానపాముల అధిక ఉత్పత్తికి తోడ్పడుతుంది.
● లెగ్యూం జాతికి చెందిన మొక్క కావడంతో వేర్లలో నత్రజని స్థిరంగా ఉంటుంది.
● పొలంలో తుంగ, గరిక వంటి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది.
● నేలలో ఉండే ప్రయోజనకర సూక్ష్మజీవుల సంఖ్యను మెరుగుపరుస్తుంది.
● వేసవిలో సంభవించే భారీ గాలులు, వర్షాల వల్ల జరిగే నేల కోతను నివారిస్తుంది.
● రసాయనిక ఎరువుల వాడకాన్ని 15 నుంచి 25 శాతం వరకు తగ్గిస్తుంది.
● పంటలపై ఖర్చు ఆదా అవుతుంది.
జీలుగ సాగుకు అనువైన సమయాలు
● ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపర్చుకునే విధంగా జీలుగ విత్తనాలు చల్లుకోవాలి.
● తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలోనే దుక్కి దున్ని, తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి.
● నీటి వసతులు గల ప్రాంతాల్లో వేసవిలోనే సాగు చేయడం లాభదాయకం.
● రెండు పంటల మధ్య కాల వ్యవధిలో కూడా విత్తుకొని కలియ దున్నవచ్చు.
● ఏప్రిల్, మే నెలల్లో ఖరీఫ్ పంటలు వేసే ముందు, తొలకరి వర్షాలు కురవగానే జీలుగ విత్తనాలు విత్తుకోవాలి.
● విత్తిన తర్వాత ఏపుగా పెంచి, పంట జీవ పదార్థాన్ని కలపడానికి, కుళ్లిపోవడానికి నేలలో కలియ దున్నాలి.
చినబాబు, మండల వ్యవసాయాధికారి (ఫైల్)

జీలుగ సాగుతో పంటలు బాగు

జీలుగ సాగుతో పంటలు బాగు