
కలం గళంపై కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై కక్ష సాధింపులకు తెరతీసింది. పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా నియంతృత్వ ధోరణితో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసంపై గురువారం జరిపిన పోలీసుల దాడిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు, రాజకీయపక్షాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించారు. నిరసనలు తెలిపి కూటమి తీరుపై భగ్గుమన్నారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంతో సహా ప్రధాన నియోజకవర్గాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందించారు.
ఏలూరు జిల్లాలో..
ఏలూరులో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనగా డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందించారు. సిట్ బృందం పేరుతో అక్రమ దాడులు చేయించి భయభాంత్రులకు గురిచేసేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. జిల్లా అధ్యక్షుడు కె.కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్, యూనియన్ సభ్యులు, సాక్షి పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
● చింతలపూడిలో ప్రెస్‌క్లబ్, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి సీఐ రాజశేఖర్‌కు వినతిపత్రం అందించారు.
● ఉంగుటూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులు నిరసన తెలిపి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
భీమవరంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, కక్ష సాధింపు చర్యలు ఆపాలంటూ తహసీల్దార్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు.
● నరసాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నరసాపురంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విలేకరులు నిరసన తెలిపి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓ సాయికృష్ణకు వినతిపత్రం అందజేశారు.
● ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండలో జర్నలిస్టులు నిరసన తెలిపి తహసీల్దార్ డి.అనితకుమారికి వినతిపత్రం అందించారు.
● తణుకులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహసీల్దార్ బి.అశోక్‌వర్మకు వినతిపత్రం అందజేశారు.
● తాడేపల్లిగూడెంలో ‘సాక్షి’ విలేకరులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
● ఉండి నియోజకవర్గం ఆకివీడులో పాత్రికేయులు నిరసన తెలిపి తహసీల్దార్ ఎ.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు అంబటి రమేష్ సంఘీభావం తెలిపారు.
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
‘సాక్షి’ ఎడిటర్ నివాసంపై పోలీసుల దాడి సిగ్గు సిగ్గు
విలేకరుల స్వేచ్ఛను హరిస్తే తీవ్ర పరిణామాలు
ఉమ్మడి పశ్చిమలో కదం తొక్కిన జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయులు
కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు భారీ నిరసన ప్రదర్శన
మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు
కొయ్యలగూడెం: మీడియా స్వేచ్ఛకి కూటమి ప్రభుత్వం గొడ్డలి పెట్టులా మా రిందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. ‘సాక్షి’ ఎ డిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ప్రభుత్వం పోలీసు దాడులను చేయించడాన్ని నిరసిస్తూ గురువారం బయ్యనగూడెంలోని జాతీయ ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి సేవ్ ఫోర్త్ ఎస్టేట్, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ప్రారంభమైన దాడులు ఇప్పుడు మీడియా వ్యవస్థ మీదకి పురికొల్లేలా మారాయన్నారు. కూటమిలో పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేనలు కక్ష, పగ, ప్రతీకారాలను పంచుకున్నాయని ఎద్దేవా చేశారు. చర్యకు ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుందని అది ప్రజాక్షేత్రం ద్వారానే కూటమి ప్రభుత్వానికి జగన్ 2.0 పాలనలో రుచి చూపిస్తామని బాలరాజు హెచ్చరించారు.

కలం గళంపై కక్ష సాధింపు

కలం గళంపై కక్ష సాధింపు