
తప్పిపోయిన పిల్లల సమాచారంపై ఆరా
ఏలూరు (టూటౌన్): ఆదివారం అంతర్జాతీయ ‘తప్పిపోయిన పిల్లల దినోత్సవం’ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లు పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. సంబంధిత అధికారులతో ఎవరైనా బాలబాలికలు ఒంటరిగా, అనుమానాస్పదంగా లేదా ఎలాంటి ఆదరణ లేకుండా కనిపించారా? అని ఆరాతీశారు. అలాంటి సమాచారం తెలిస్తే వారు గాని తారసపడిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ప్రత్యక్షంగా లేదా 08812 22455, 15100 నెంబర్లకు లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో లాయర్లు జి.వి.భాస్కర్, బి.సంగీతరావు, ఏ.గంగాభవాని, పారా లీగల్ వలంటీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
రిలే నిరాహార దీక్షలు
బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం 9వ రోజు పలు వురు జేఏసీ నాయకులు దీక్షలో కుర్చున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సోదెం ముక్కయ్య మాట్లాడుతూ తమ డిమాండ్లు నెర వేర్చే వరకూ దీక్షలు కొనసాగిస్తామని చెప్పారు.
కొల్లేరులో అక్రమ తవ్వకాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఏలూరు రూరల్ మండలం మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం వద్ద కొల్లేరులో ఆదివారం ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొందరు తవ్వకాలు చేపట్టారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం మేరకు పక్షుల ఆవాస కేంద్రాలు, జంతువుల ఆవాస కేంద్రాల వద్ద యంత్రాలతో తవ్వడం నిషేధం. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకానికి ఎటువంటి అనుమతులు లేవని యంత్రాలను, పొక్లెయిన్‌ను అడ్డుకున్నారు. అయినా పనులు ఆపకపోవడంతో ఫారెస్ట్ అధికారులు తవ్వుతున్న వారి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తవ్వకాలను నిలుపుదల చేశారు. అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ మూర్తి (రాజమండ్రి), ఏలూరు ఫారెస్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.
కిటకిటలాడిన రాట్నాలమ్మ దేవస్థానం
పెదవేగి: రాట్నా లమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి, విశేష రీతిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కుబడులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వారం అమ్మవారికి మొత్తం రూ.1,01,960 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.
మహిళల క్రికెట్ జట్ల ఎంపికకు సన్నాహాలు
ఏలూరు రూరల్: మే 31, జూన్ 1న భీమవరం డీఎన్నార్ కళాశాల గ్రౌండ్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలికల క్రికెట్ జట్ల ఎంపిక చేపట్టనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడహక్ కమిటీ సభ్యులు ఆర్‌ఎస్‌ఆర్ మూర్తి, ఈ.అశోక్‌కుమార్, ఎస్‌కె సాఖీర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–15 విభాగంలో బాలికలు సెప్టెంబర్ 1, 2010 తర్వాత పుట్టి ఉండాలన్నారు. అండర్–19 విభాగంలో మహిళలు సెప్టెంబర్ 1, 2006 తర్వాత, అండర్–23 విభాగంలో సెప్టెంబర్ 1 2002 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారిణులు తమ వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్‌తో పాటు సొంత క్రికెట్ కిట్‌తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. జట్లకు ఎంపికై న వారు ఏసీఓ పర్యవేక్షణ జరిగే అంతర జిల్లా క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. మరింత సమాచారం కోసం 70136–33143 నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.