
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆంజనేయస్వామి వారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు 108 ప్రదక్షణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,94,262 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. సుమారు 1500 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు.
సబ్సిడీ విత్తనాల సీజ్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు బైపాస్ రోడ్డులో మంగళవారం విజిలెన్సు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఎటువంటి బిల్లులు లేకుండా వ్యాన్‌లో తరలిస్తున్న 43.60 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను గుర్తించి వ్యాన్‌తో సహ సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ పీ శివరామకృష్ణ తెలిపారు. సబ్సిడీ విత్తనాలు బాపట్ల నుంచి కిర్లంపూడి రవాణా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వీటి విలువ రు.4,80,280 ఉంటుందన్నారు. ఈ కేసుకు సంబంధించి కల్లపురెడ్డి వీరరాఘవ అలియాస్ నాని, కల్లపురెడ్డి జయీశ్వర రావులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ తనిఖీలో విజిలెన్సు ఏఓ జీ. మీరయ్య, పెదవేగి మండల వ్యవసాయ శాఖాధికారి ప్రియాంక, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారని తెలిపారు.
యువతిని మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: నమ్మించి మోసగించిన యువకుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి విద్యాభ్యాసం నిమిత్తం జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో తల్లితో కలిసి ఓ యువతి అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో స్థానిక బాలాజీనగర్‌కు చెందిన ఊసా ప్రశాంత్‌కుమార్ పరిచయం అయ్యాడు. 2023 నవంబర్ 16న యువతి పుట్టిన రోజు సందర్భంగా ఆమెను స్థానిక శేషాద్రి నగర్‌లోని ఓ బిల్డింగ్ వద్దకు తీసుకువెళ్లి యువతి మెడలో పసుపుతాడు కట్టి, లైంగిక దాడి చేశాడు. కొన్ని రోజుల తరువాత వివిధ కారణాలు చెప్పి ఆమె నుంచి ఒకసారి 3 ఉంగరాలు, 1 బ్రాస్‌లెట్, మరోసారి 2 గాజులు, చెవి జాలార్లు తీసుకున్నాడని యువతి ఫిర్యాదుతో పేర్కొంది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోకపోతే చంపుతానని ప్రశాంత్‌కుమార్ బెదిరిస్తున్నాడని, దీనికి మరికొందరు సహకరిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు