
అంజన్నకు అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆంజనేయస్వామికి శనివారం అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామి ఉత్సవ మూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మద్యాహ్నం వరకు వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,41,401 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. స్వామి నిత్యాన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
భక్తులతో పోటెత్తిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. ఆలయ అనివేటి మండపంలో ఒడుగు వేడుకలు అధిక సంఖ్యలో జరిగాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తెలపండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను పాఠశాల విద్యా శాఖ ఆర్‌జేడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, దీనిపై ఎవరికై నా అభ్యంతరాలున్నా తెలపాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జీ.నాగమణి ఒక ప్రకటనలో కోరారు. ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించి గత ఏప్రిల్ 22వ తేదీ వరకూ అభ్యంతరాలకు గడువు ఇచ్చామని, అనంతరం తమకు అందిన అభ్యంతరాల ప్రకారం జాబితాను తయారు చేసి ఆర్‌జేడీ కాకినాడ వెబ్‌సైట్‌లో, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణ జిల్లా విద్యాశాఖల వెబ్‌సైట్‌లో, నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు.

అంజన్నకు అభిషేక సేవ