వక్ఫ్ బిల్లుపై ఎగసిన నిరసన
నూజివీడు: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని రక్షించాలని, కేంద్ర ప్రభుత్వం మత వివక్షన వీడాలంటూ నూజివీడులో శుక్రవారం ముస్లింలు గళమెత్తారు. పట్టణంలోని హనుమాన్ జంక్షన్ రోడ్డులోని పెద్ద మసీదు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మార్గమధ్యలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్కచేయకుండా జాతీయ జెండాలు, నల్ల జెండాలు, ప్లకార్డులతో వేలాది మంది తరలివచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చలసాని వెంకట రామారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ, ముస్లింల మధ్య అనైక్యతను సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లింల త్యాగనిరతిని ప్రశంసించారు. సీపీఎం నాయకుడు జి.రాజు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని, బిల్లుకు వ్యతిరేకంగా పలు సవరణలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తోందని, ప్రజలంతా ఐక్యం పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ పట్టణ కార్యదర్శి చాట్ల పుల్లారావు, సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.హనుమానులు, వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ యూనస్పాషా (గబ్బర్), ఫాస్టింగ్ అబ్దుల్ హక్, ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.


