యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
ద్వారకాతిరుమల: మండలంలోని కోడిగూడెంలో గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొందరు అక్రమార్కులు ఎంతో విలువైన మట్టిని అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. గ్రామంలోని తూర్పు వైపున ఉన్న చెరువు దాటిన తరువాత డీ ఫారం పట్టా భూమిలో మట్టి అక్రమ తవ్వకాలు గత కొద్దిరోజులుగా సాగుతున్నాయి. జేసీబీ సహాయంతో తవ్వుతున్న మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ మట్టిని గ్రామంలోని ఒక పామాయిల్ తోటలో రోడ్డు ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారు. టిప్పర్ మట్టిని అక్రమార్కులు రూ. 5 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగంగా జరుగుతున్న ఈ మట్టి దందాను అడ్డుకోవాల్సిన అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి, ఈ తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


