అభినవ దానకర్ణుడు అనంత కోటిరాజు
గణపవరం: ఎంత సంపాదించినా లభించని తృప్తి, ఇతరులకు సాయం పడటం, సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావడం ద్వారా లభిస్తుందని కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శుక్రవారం గణపవరంలో రాజు వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.36 కోట్ల సాయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షత వహించారు. శ్రీనివాసవర్మ మాట్లాడుతూ సేవ చేయడానికి, ఇతరులకు సహాయ పడటానికి కూడా ఒక హద్దు ఉంటుందని, వేగేశ్న అనంత కోటిరాజుకు ఈ హద్దులేమీ లేవని, ఇప్పటివరకూ తన సేవా సంస్థ ద్వారా సుమారు రూ.300 కోట్ల సేవా కార్యక్రమాలను పూర్తిచేయడం ఆయనలోని మానవత్వానికి, గొప్పదనానికి నిదర్శనమన్నారు. అనంత కోటిరాజు అభినవ దానకర్ణుడని అభినందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, గణపవరం ఎంపీపీ అర్ధవరం రాము, జెడ్పీటిసి దేవారపు సోమలక్ష్మి, గణపవరం సర్పంచ్ మూర అలంకారం, స్థానిక నాయకులు కాకర్ల శ్రీను, కె.జగపతిరాజు, దండు రాము, నడింపల్లి సోమరాజు, కొనిశెట్టి రమేష్, ఇందుకూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. గణపవరంలో వేగేశ్న ఫౌండేషన్ రూ.35 కోట్లతో నిర్మించిన ఎనిమిదెకరాల మంచినీటి చెరువు, జగన్నాథపురంలో మంచినీటి చెరువు అభివృద్ది, చెరువు చుట్టూ ప్రహరీ, మైక్రోఫిల్టర్స్, జగన్నాథపురం ప్రాధమిక పాఠశాలలో రూ.15 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతకోటిరాజు దంపతులను పంచాయతీ తరపున సన్మానించారు. అనంతకోటిరాజు మాట్లాడుతూ రాజు వేగేశ్న ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొన సాగుతాయని ప్రకటించారు.


