కాపు ఐక్యవేదికలో ధ్వజమెత్తిన నేతలు
తణుకు అర్బన్: కాపుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కాపులపై కుల వివక్ష, సవతితల్లి ప్రేమను చూపిస్తోందని కాపు ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జె.నాగబాబు, ఉత్తరాంధ్ర తెలగ సంఘం చైర్మన్ పి.వెంకట రామారావు విమర్శించారు. ఆదివారం పైడిపర్రు కాపు కల్యాణమండపంలో కాపు ఐక్య వేదిక చైర్మన్ రాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2024 ఎన్నికల ముందు ఏదోరకంగా అందలమెక్కాలనే ఉద్దేశంతో పవన్‌కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కాపుల భావోద్వేగాలను రెచ్చగొట్టి 95 శాతం కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నా రు. అయితే నేడు కాపుల ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసి కుల వివక్షను చూపిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం కాపుల ప్రయోజనాలకు సంబంధించి ఏ ఒక్క నిర్ణయం తీసుకోకుండా కుల వివక్ష చూపిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇటీవల బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమన్నారు. హై కోర్టు కాపుల విషయంలో సమర్థించిన జీఓ 30 అ మలు చేయాలని, మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల కు కేటాయించిట్టుగా 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లను బ్రాహ్మణ, క్ష త్రి య, ఆర్యవైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి కులాల్లో పేదల కు కొనసాగిస్తే సమన్యాయం జరుగు తుందన్నా రు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాల ప్రయోజనాలను, ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పే ర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులపై అవలంబిస్తున్న వైఖరిని వీడాలని కోరారు.