
బోసు కుటుంబానికి అండగా ఉంటాం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతికి కారకులైన వారిని పట్టుకుని పోలీసులు కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాటాకులగూడెంలో బోస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బోసు మృతి వైఎస్సార్‌సీపీకి తీరనిలోటన్నారు. బోసు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు బోదా శ్రీనివాసరెడ్డి, బుట్టాయగూడెం మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు తదితరులు పాల్గొన్నారు.
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
కామవరపుకోట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి ట్రాక్టర్ దగ్ధమైన ఘటన తడికలపూడిలో శనివారం చోటుచేసుకుంది. ఏడీఎఫ్ వి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం మందలపర్రు గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మికి చెందిన ట్రాక్టర్ ఉదయం గడ్డి లోడుతో మందలపర్రులో బయలుదేరి తడికలపూడికి వచ్చింది. మధ్యాహ్న భోజనం చేసేందుకు పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాక్టర్ పెట్టి కూలీలు, డ్రైవరు వెళ్ళగా, పైనున్న విద్యుత్ తీగలు గడ్డికి తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు ఏలూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు.
డీఏ ఎరియర్లు చెల్లించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ ఎరియర్లు వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బకాయిలు రూ. 6200 కోట్లు చెల్లించాలని నిర్ణయించటం హర్షణీయమని.. ఉద్యోగుల నుంచి మినహాయించిన పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ డబ్బులు, సీపీఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్, సరెండర్ లీవ్ బకాయిలను మాత్రమే చెల్లించి బకాయిలు చెల్లించామంటే సరిపోదన్నారు. ఇంతవరకు నిధి పోర్టల్‌లో ఒక్క ఎరియర్ బిల్ ఎనేబుల్ చేయలేదని, ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

బోసు కుటుంబానికి అండగా ఉంటాం