ఏలూరు (టూటౌన్): ఏలూరు త్రీ టౌన్‌లో నమోదైన కేసులో ఆరేళ్ల నుంచి పరారీలో ఉన్న ముద్దాయిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 2019లో నమోదైన చీటింగ్ కేసులో మూడో పట్టణ పోలీసులు పురోగతి సాధించారు. ఏ2 ముద్దాయిని అరెస్టు చేశారు. మూడో పట్టణ పరిధిలో 2019లో 140/2019 క్రైమ్ నెంబర్‌పై చీటింగ్ కేసు నమోదైంది. అమలాపురానికి చెందిన చిలుకూరి దీపక్ వర్మ విజయవాడకు చెందిన పొన్నం సైదేశ్వర చౌదరి, పొన్నం లక్ష్మీ కుమారితో కలిసి మలేషియాలో మ్యాన్ పవర్ కంపెనీ నిర్వహిస్తున్నట్లు దానికి సంబంధించి కొంతమంది ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. ఏలూరుకు చెందిన గుడిపూడి చక్రవర్తి 22 మంది నిరుద్యోగులతో వారిని కలిశాడు. ఈ 22 మంది రూ.17.50 లక్షలు విమాన టికెట్లు, దారిఖర్చుల కోసం ఇచ్చారు. ఐదుగురికి విమాన టికెట్లు పంపారు. ఆ టికెట్లు తీసుకుని చైన్నె ఎయిర్‌పోర్టుకు వెళ్ళగా అవి నకిలీవని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు గత ఆరేళ్లుగా పరారీలో ఉండగా మూడో పట్టణ సీఐ కోటేశ్వరరావు వారిలో సైదేశ్వర చౌదరని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.