ఏలూరు (టూటౌన్): ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బంగారు యశ్వంత్ (15) మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థాని క కలెక్టరేట్ వద్ద గురువారం నిరసన తెలిపి డీఆర్వో విశ్వేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏలూరులోని చేపల తూము సెంటర్‌లోని రెల్లిపేటలో ఉంటున్న యశ్వంత్‌ను ఈనెల 5న రాత్రి సీసీఎస్ పోలీసులు వచ్చి మోటారు సైకిల్ చోరీ కేసులో తీసుకువెళ్లారన్నారు. విచారణ నెపంతో కోటదిబ్బ పోలీస్‌స్టేషన్ లో చిత్రహింసలు పెట్టారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న పెదవేగి సమీపంలోని కాలువ గట్టుపై యశ్వంత్ శవమై పడి ఉన్నాడన్నారు. యశ్వంత్ మృతిని లాకప్ డెత్‌గా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఆర్వోను కలిసిన వారిలో కేవీపీఎస్ నాయకులు మంచెల్ల ఇస్సాక్, రేవుగడ్డ మనీసుందర్ సింగ్, దళిత రైట్ ప్రొటెక్షన్ స్టేట్ ప్రెసిడెంట్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్, ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్.మధు, పౌరహ క్కుల సంఘం నాయకులు కేవీ రత్నం ఉన్నారు.