ఏలూరు (టూటౌన్): జిల్లాలో మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం కోరారు. ఎస్‌ఎస్‌సీ/ఓఎస్‌ఎస్‌సీ/ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు ఎస్‌ఎస్‌సీ/ఇంటర్మీడియేట్ (ఓపెన్ స్కూల్స్) సంబంధించిన పరీక్షా కేంద్రాల్లో నియమించబడిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, అడిషనల్ డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్లకు స్థానిక సీఆర్‌ఆర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణ, నియమ నిబంధనలను విపులంగా తెలియజేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఏలూరు జిల్లా పరీక్షల పరిశీలకులు ఆర్.నరసింహారావు, సంచాలకులు ఏపీఆర్‌ఈఐ సొసైటీ, గుంటూరు, డీఈఓ ఎస్.అబ్రహం పరీక్షలకు సంబంధించి పలు సూచనలు జారీ చేశారు. సమగ్రశిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ బి.సోమశేఖరరావు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎల్.శ్రీకాంత్, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.