ప్రమోషన్‌ వర్క్‌ పేరుతో భారీగా మోసం | Sakshi
Sakshi News home page

ప్రమోషన్‌ వర్క్‌ పేరుతో భారీగా మోసం

Published Tue, Nov 21 2023 1:22 AM

-

ఏలూరు టౌన్‌: ఏలూరు శనివారపుపేటకు చెందిన ఒక మహిళను సైబర్‌ నేరగాళ్లు మోసం చేసి భారీగా సొమ్మును కాజేశారు. ప్రమోషన్‌ వర్క్‌ పేరుతో రూ.వెయ్యి నుంచి మొదలు పెట్టి ఏకంగా రూ.10 లక్షలు కాజేయటంతో మహిళ తీవ్ర మానసిక వేదనకు గురై ఏలూరు సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు సైబర్‌ క్రైమ్‌ ఎసైస రాజా ఆధ్వర్యంలో బాధితురాలికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కేసును త్రీటౌన్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు శనివారపుపేట ప్రాంతానికి చెందిన జాహ్నవికి వాట్సాప్‌లో అపరిచిత నంబర్‌ నుంచి పలు మెస్సేజ్‌లు వచ్చాయి. ప్రమోషన్‌ వర్క్‌ చేయాలని, లాభాలు భారీగా వస్తాయంటూ ఆశ చూపించారు. ఆమె తన ల్యాప్‌టాప్‌ నుంచి వారితో వాట్సాప్‌లో మెస్సేజ్‌లతో సంభాషించారు. తొలుత వెల్‌కం టాస్క్‌ పేరుతో రూ.వెయ్యి చెల్లించగా ఆమెకు రూ.1300 ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖాతాలో జమ చేశారు. అనంతరం రూ.2 వేలు, రూ.3 వేలు చొప్పున కట్టించుకున్నారు. రెండో రౌండ్‌ అంటూ రూ.21వేల 800 కట్టాలని చెప్పారు. అలాగే 3వ రౌండ్‌ అంటూ రూ.70 వేలు కడితేనే మీకు ఇప్పటివరకు రావాల్సిన సొమ్ములు మొత్తం వస్తాయని షరతు విధించారు. జాహ్నవి ఇలా దఫదఫాలుగా స్నేహితుల వద్ద అప్పులు చేయటం, ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టిమరీ సుమారుగా రూ.10 లక్షల వరకు చెల్లించింది. రోజుల గడుస్తున్నా తనకు రావాల్సిన డబ్బులు రాకపోవటంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఏలూరు త్రీటౌన్‌ సీఐ శివాజీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దశలవారీగా రూ.10 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. కేసు నమోదు

Advertisement
 
Advertisement