సీబీఎస్‌ఈ వివాదం.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం | CBSE Chairman Secretary Transferred | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ వివాదం.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం

Jun 2 2026 7:26 PM | Updated on Jun 2 2026 9:03 PM

CBSE Chairman Secretary Transferred

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కొత్త ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) వ్యవస్థపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం వేగంగా చర్యలు చేపట్టి సీబీఎస్‌ఈలోని ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. సీబీఎస్‌ఈ చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తా బదిలీ అయ్యారు. సీబీఎస్‌ఈ కొత్త ఛైర్మన్‌గా లోఖండే ప్రశాంత్‌ సీతారామ్‌ను ప్రభుత్వం నియమించింది. 

అలాగే, ఓఎస్‌ఎం ఫెసిలిటీ కొనుగోలుపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) చైర్‌పర్సన్ ఎస్ రాధా చౌహాన్ విచారణ కమిటీ ఏకైక సభ్యురాలిగా నియమితులయ్యారు. అవసరమైతే ఇతర అధికారుల సాయం తీసుకోవచ్చు. “చైర్‌పర్సన్‌కు అవసరమైన సందర్భాల్లో ఇతర కార్యాలయాల అధికారుల నుంచి సాయం పొందే అధికారం ఉంది. కమిటీకి సీబీసీ కార్యదర్శి సహకారం అందిస్తుంది. కమిటీ తన నివేదికను ఒక నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు సమర్పిస్తుంది” అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థుల మార్కుల పునఃపరిశీలన పోర్టల్‌ను మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ ప్లాట్‌ఫాంపై సైబర్ దాడులయత్నం జరిగినట్లు బోర్డు వెల్లడించింది.

సీబీఎస్‌ఈ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక దశలో కేవలం 2 నిమిషాల్లోనే దాదాపు 15 లక్షల హిట్లు నమోదయ్యాయి. విద్యార్థులు ప్లాట్‌ఫాంను ఉపయోగించకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగిందని బోర్డు ఆరోపించింది.

అనధికారికంగా ఫైళ్లలోకి ప్రవేశించేందుకు జరిగిన లక్షకు పైగా ప్రయత్నాలను గుర్తించామని, సేవలకు అంతరాయం కలిగించాలనే దురుద్దేశంతో పనిచేసే వ్యక్తులే ఇందుకు కారణమని కూడా తెలిపింది. పోర్టల్ నిర్ణయించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి “సాంకేతిక సమస్యలు” కారణమని అధికారులు తెలిపారు.

ఈ ఆలస్యం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో జవాబు పత్రాల ప్రాప్తి ప్రక్రియలో లోపాలు తలెత్తినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆందోళనలు పెరిగాయి. మార్కుల ధ్రువీకరణ, జవాబు పత్రాల పునర్మూల్యాంకనం కోసం విద్యార్థులకు పారదర్శకమైన, అంతరాయంలేని వ్యవస్థను అందించేందుకే ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తామని సీబీఎస్‌ఈ ఇంతకుముందు తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement