సినిమా పరివార్‌!

Vardhelli Murali Editorial Article On Tollywood Movie Industry Crisis - Sakshi

జనతంత్రం

‘ఇండస్ట్రీ’ అంతా మా కుటుంబమే అని చెబుతుంటారు సినిమా వాళ్లు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఉద్ఘాటన చేస్తూనే ఉంటారు. అదొక సంఘీభావం. మంచిదే. ఈ సినిమా కుటుం బంలో సభ్యులెవరు? దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు వగైరా వగైరా. వీళ్లు గాక సినీ నిర్మాణం కోసం ‘లైట్లెత్తే’ బాయ్స్‌ సహా చాలామంది శ్రమజీవులుంటారు. వీళ్లందర్నీ 24 క్రాఫ్టుల ‘బంగారం’గా గుర్తించి కుటుంబ సభ్యత్వం కల్పించిన వ్యక్తి దాసరి నారాయణరావు.

సినిమా పరివారం ఎల్లలు ఇంతవరకేనా? ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన మైలురాళ్లను దాటి విస్తరించిన కుటుంబం ఇది. తెలుగు రాష్ట్రాలకు సంబంధిం చినంతవరకైతే తెలుగు ప్రేక్షకులందరూ సినిమా కుటుంబ సభ్యులే. ఎదుగుతున్న నాటక రంగాన్ని బలిపెట్టి మరీ సినిమా రంగాన్ని పోషించింది తెలుగు సమాజం. ఈ రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఉత్తర భారత దేశమంతటా కలిపి ఎన్ని థియేటర్లున్నాయో ఈ రెండు రాష్ట్రా ల్లోనే అన్ని ఉన్నాయట. సినిమా అభిమానం బాగా ఎక్కువ నుకునే తమిళనాడుతో పోల్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు వెయ్యి సినిమా హాళ్లు ఎక్కువుండేవి. ఇతర రాష్ట్రాల్లో నాటక రంగం ఇంకా తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడో ఒకసారి చిన్న మూలుగు వినిపి స్తుంది, అంతే. తెలుగు ప్రజలకున్న అపార సినిమా అభిమానం అందుకు కారణం. కుటుంబ సభ్యులంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే కాదు గదా! పెంచి పోషించిన తల్లి దండ్రులు కూడా కుటుంబ సభ్యులే. అలాగే ప్రత్యేక శ్రద్ధతో తెలుగు సినిమాను పెంచి పోషించిన ప్రేక్షకులంతా సినిమా పరివారమే.

మన సినిమా ఒక విస్తారమైన కుటుంబమని గుర్తిస్తే, సభ్యులైన ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు గణించుకోవాలి. కొన్ని వేలమందికి అన్నం పెట్టే ‘పరిశ్రమ’ కనుక, సినిమాను ఒక వ్యాపారం అనుకుందామా? అయితే ఈ వ్యాపారంలో మేజర్‌ స్టేక్‌హోల్డర్లు ప్రేక్షకులు. వారిపై ఏకపక్షంగా రుద్దజూసే నిర్ణయాలు చెల్లవు. సినిమాను ఒక కళగా మాత్రమే భావిద్దామా? కళ కళ కోసమే తప్ప కాసుకోసం కాదని చాలామంది కళాస్రష్టలు భావిస్తారు. జగత్‌ ప్రసిద్ధ ఫిలిమ్‌ మేకర్‌ వాల్డ్‌డిస్నీ ఒక మాటన్నారు. ‘నేను డబ్బులు సంపాదించడం కోసం సినిమా తీయను. సినిమా తీయడం కోసం డబ్బులు సంపాదిస్తా’. సినిమాను కళగా భావించే వారికి ఇదొక సందేశం. సినిమాపై డిస్నీ సంతకం ఇంకెన్నాళ్లకయినా చెరిగి పోతుందా?

కాసుల పొడ సోకనీయని శుద్ధ సృజనాత్మక ఆలోచనలు మన వాళ్లలోనూ ఉండేవి. కటిక దరిద్రాన్ని అనుభవిస్తూనే బమ్మెర పోతన కవి ‘ఆంధ్ర మహాభాగవత’ కావ్యాన్ని పూర్తి చేశారు. రాజులకు అంకితం ఇస్తే దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చని సన్నిహితులు సలహా ఇస్తారు. కానీ, పోతన ససేమిరా అంటాడు. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్‌ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజిం చుట కంటె సత్కవుల్‌ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల కౌ / ద్దాలికులైననేమి? నిజ దార సుతోదర పోషణా ర్థమై’ అని ఈసడించుకుంటాడు. కోమలమైన మహాభాగవత కావ్యాన్ని దుర్మార్గులైన రాజులకు అంకితం చేయడం కంటే వ్యవసాయం చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించడం మేలంటాడు పోతన. ఇదీ విశుద్ధ కళా ప్రకటన, భక్తి భావన.

ఆనాటికి తెలుగు ప్రాంతాల్లో ఉన్న నాటక సమాజాలన్నీ వరసకట్టి మరీ నటీనటులనూ, రచయితలనూ, దర్శకులనూ, గాయకులను సినీరంగ ప్రవేశం చేయించాయి. వాటిలో ప్రముఖ మైనది ‘ప్రజానాట్యమండలి’. ‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనేది ఈ సంస్థ సిద్ధాంతం. ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు స్వీయ దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ సినిమా నిర్మించి జమునను వెండితెరకు పరిచయం చేశారు. ఎన్టీరామారావు కూడా సినిమాల్లోకి రాకముందు ‘నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌’ అనే పేరుతో నాటకాలు వేసేవారు. సంస్థ పేరులోనే జాతీయ భావం ఇమిడి వున్నది. సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన ఇదే పేరుతో ప్రారంభించారు. అభ్యుదయ భావాలతో నాటకాలు వేసి, సినీరంగంలో ప్రవేశించిన వారి ప్రభావం ఫలితంగా తొలి రోజుల్లో అనేక సందేశాత్మక, కళాత్మక విలువలున్న తెలుగు సినిమాలు తయారయ్యాయి. ఇవి వాణిజ్యపరంగా కూడా ఘన విజయాలను నమోదు చేశాయి.

1950వ, 60వ దశకాలను తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా చాలామంది భావిస్తుంటారు. ఆర్థికంగా నష్టపోయే సినిమాల శాతం ఇప్పటికంటే చాలా తక్కువ. నిర్మాణ వ్యయం అదుపులో ఉండేది. సినిమా తారాగణం, కథాబలం, దర్శకుడు, బ్యానర్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు వసూలు చేయగలదో అంచనా వేసుకునేవారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ వ్యయం ఉండేది. అప్పట్లో సూపర్‌స్టార్స్‌గా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ల పారితోషికాలు కూడా నిర్మాణ వ్యయంలో ఐదు నుంచి పది శాతంలోపే ఉండేవని చెబుతారు. ఈ తరహా పొదుపు బడ్జె ట్‌లతోనే నాటి సినిమాలు అఖండ విజయాలు సాధించాయి.

ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద కమర్షియల్‌ హిట్‌ తెలుగు సినిమా ఏది? అప్పటికీ, ఇప్పటికీ మార్కెట్‌నూ, డబ్బు విలు వనూ బేరీజు వేసుకొని చూస్తే ‘లవకుశ’ను మించిన పెద్ద హిట్‌ లేదట. ఆ సినిమా విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల జనాభా ఇప్పటి జనాభాలో సుమారు 40 శాతం లోపే. రవాణా సౌకర్యాలు లేవు. రహదారులు చాలా తక్కువ. దూరంగా ఉండే టౌన్‌లకే సినిమా హాళ్లు పరిమితం. అయినా కూడా అప్పటి జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఈ సినిమాను చూశారని అంచనాలున్నాయి. పావలా నేల టికెట్‌ దగ్గర్నుంచి రూపాయి సోఫా టికెట్‌ దాకా అన్ని తరగతుల చిల్లర శ్రీమహాలక్ష్మి కనకవర్షం కురిపించింది. ఎక్కువ శాతం సినిమాలు ఘనవిజయం సాధించడం ఈ స్వర్ణయుగం ప్రత్యేకత. 1963లో ఒకే క్యాలెండర్‌ సంవత్సరంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 13 సినిమాలు విడుదలైతే అందులో 7 శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. శతదినోత్సవం జరుపుకోవడం అంటే సినిమా సూపర్‌ హిట్‌ అయినట్టు! ఇదే ట్రెండ్‌ కొన్నేళ్ళు కొనసాగింది.

ఎంత పెద్ద హీరోలైనా, ఎంత దిగ్గజ దర్శకులైనా, వారు ఎంత గొప్ప విజయాలను సాధించినా కూడా అడ్డగోలు పారి తోషికాలను డిమాండ్‌ చేయలేదు. ఫలితంగా నిర్మాణ వ్యయం అదుపులో ఉండి లాభాలు గడించిన కారణంగా తెలుగు సినిమా వేలాదిమందికి ఆశ్రయం కల్పించి ‘ఇండస్ట్రీగా’ గుర్తింపు పొందింది. ఇక్కడొక ఉదాహరణ చెప్పుకోవాలి. టాప్‌ ఫైవ్‌ తెలుగు సినిమాల పేర్లు చెప్పమని ఏ తెలుగువాణ్ణి అడిగినా అందులో కచ్చితంగా చెప్పే పేరు – ‘మాయాబజార్‌’. ఆ జనరంజక చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి తెలుగు సినిమా స్వర్ణయుగ వైతాళికుల్లో ఒకరు. ఈ సినిమా కంటే ముందే అతిపెద్ద కమర్షియల్‌ హిట్‌గా ‘పాతాళభైరవి’ని ఆయన మలిచారు. దాదాపు ఒక డజన్‌ అపురూప దృశ్యకావ్యాలు ఆయన అందిం చారు. సినిమాలు తీయడం ఆపేసిన తర్వాత తన కొడుకును ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించవలసిన సందర్భం వచ్చింది. అందుకయ్యే ఖర్చు కోసం ఆయన ఇబ్బంది పడ్డారట. విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు తాను సర్దుబాటు చేయడానికి ముందుకొచ్చారు. ‘నీకు తెలుసు కదా రామారావ్, నేను ఎవరి దగ్గరా ఊరికే తీసుకోను’ అని కేవీ రెడ్డి తిరస్క రించారు. ‘ఊరికే వద్దు నాకో సినిమా తీసిపెట్టండ’ని ఎన్టీఆర్‌ ఆఫర్‌ ఇచ్చారు. అలా వచ్చింది ‘శ్రీకృష్ణ సత్య’.

దర్శకుడిగా కేవీ రెడ్డి కమిట్‌మెంట్‌నూ, ఫోకస్‌ను చెప్ప డానికి, సినిమా బడ్జెట్‌ బ్యాలెన్స్‌ తప్పకుండా ఉండే ఆనాటి పారితోషికాలను గురించి చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. నటులైనా, దర్శకులైనా డబ్బులు సంపాదించకుండా ఇబ్బం దులు పడాలని కాదు. అయితే నిర్మాణ వ్యయం అదుపు తప్పని విధంగా ఏదో రకమైన బ్యాలెన్స్‌ను పాటించడం తప్పనిసరి.ఆ బ్యాలెన్స్‌ లేనప్పుడే ప్రేక్షకుల మీద అదనపు భారం మోప డమనే అవాంఛనీయ ఆలోచనలు ముందుకొస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి వంటి నటులకూ, కేవీ రెడ్డి, బీఎన్‌ రెడ్డి, కేఎస్‌ ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, ‘విక్టరీ’ మధుసూదనరావు, కె.విశ్వనాథ్,  బాపు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దర్శకులకు జనంలో ఎంతో ఇమేజ్‌ వుండేది. ఆ ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకునే ప్రయత్నాలు అప్పట్లో చేయలేదు.

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా టికెట్ల వసూళ్ళపై వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. కలెక్షన్లపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారనే అనుమానంతో ఈ పద్ధతిని తీసు కొచ్చారు. ఈ పద్ధతి సినిమా వ్యాపారాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఓపెనింగ్స్‌ బాగా వుంటేనే సినిమా బతికి బట్టకట్టే పరిస్థితి వచ్చింది. ఓపెనింగ్స్‌ లేకపోయినా కథాబలంతో నోటి మాట ద్వారా పుంజుకునే అవకాశం ఉండే సినిమాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ ‘శంకరాభరణం’ సినిమాయే శ్లాబ్‌ పద్ధతి తర్వాత విడుదలై ఉంటే ఏమయ్యేదో! శ్లాబ్‌ పద్ధతి చిరంజీవికి బాగా కలిసొచ్చింది. అప్పుడప్పుడే యువ ప్రేక్షకుల అభిమా నాన్ని చూరగొంటున్న చిరంజీవి బంపర్‌ ఓపెనింగ్స్‌తో దూసుకొని పోయాడు. ‘మెగాస్టార్‌’ అని పిలిచేంత వరకూ వెనక్కు చూడలేదు.

ఇప్పటికీ అడపాదడపా చిరంజీవి నటిస్తూనే ఉన్నప్పటికీ గడిచిన పదిహేనేళ్ల కాలాన్ని పోస్ట్‌ చిరంజీవి దశగానే పరిగ ణించాలి. ఈ దశలోనే నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. ఐదారు మంది దర్శకులు ఫిలిమ్‌ మేకింగ్‌లో కొత్త పుంతలు తొక్కారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, వినాయక్, కొరటాల శివ తదితరులకు నాగ్‌ అశ్విన్‌ లాంటి ప్రతిభావంతులు తోడవుతున్నారు. మార్కెట్‌ విస్తరణకు తెలుగు సినిమా నడుం కట్టింది. ఇంత వరకూ స్వాగతిద్దాం. కానీ నిర్మాణవ్యయం పట్టాలు తప్పింది. ఆర్థికంగా విజయాలు సాధిస్తున్న సినిమాలు ఏటా పది శాతం కూడా ఉండడం లేదు. ఇది కూడా ప్రీ–కోవిడ్‌ లెక్క. సినిమా రంగం సంక్షోభంలో కూరుకుపోవడాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఒక అరడజను మంది స్టార్‌ హీరోలున్నారు మనకు. మరో అరడజను మంది పెద్ద డైరెక్టర్లున్నారు. వీళ్ల సినిమాలన్నీ తెలుగు మార్కెట్‌ తట్టుకోలేనంత భారీ బడ్జెట్‌ సినిమాలే. ఈ బడ్జెట్‌లో యాభై శాతానికిపైగా హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషనే! మిగతా బడ్జెట్‌లో ఒక పావలా ఇతరుల రెమ్యునరేషన్‌.ఒక పావలా నిర్మాణవ్యయం.

షూటింగ్‌ జరిగే ప్రదేశంలో ఆరేడు క్యారవాన్‌ బస్సులుండటం పరిపాటి. హీరో హీరోయిన్లతో పాటు ఇతర ముఖ్యులం దరికీ ఈ సౌకర్యం ఉండాలి. ఇదొక స్టేటస్‌ సింబల్‌. షూటింగ్‌ విరామంలో స్టార్‌లు ఈ ఏసీ బస్సుల్లో విశ్రాంతి తీసుకుంటారు. షూటింగ్‌ జరిగే భవంతుల్లో ఏసీ గదులున్నాసరే ఈ క్యారవాన్‌లు ఉండి తీరాల్సిందే. పెద్ద నటీనటుల వెంట వారి బంధుమిత్ర పరివారం కూడా ఉంటుంది. వారందరికీ అతి«థి సేవలు తప్పనిసరి. ఈ పరివారానికి స్టార్‌ హోటళ్ల నుంచి క్యారియర్లు తెప్పించాలి. షూటింగ్‌ జరిగినన్నాళ్లూ ఈ తంతు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా హీరో ఇమేజ్‌ను పెంచడం కోసం, దర్శకుని ప్రతిభను చాటడం కోసం తీసే కొన్ని సీన్లుంటాయి. ఇవి లేకున్నా కథనంలో ఏ లోపం ఉండదు. కానీ ఉంటాయి. 

ఈ దుబారా ఖర్చునంతా వసూలు చేసుకోవడానికి నిర్మాతలు రెండు పద్ధతులు అనుసరిస్తారు. అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఈ సినిమాయే విడుదలవడం మొద టిది. చిన్న సినిమాలు విడుదలవడానికి అవకాశం ఉండదు. ఇక రెండవది– జనం మీద అడ్డగోలు బాదుడు! మొదటి వారం రోజులపాటు అదనపు షోలు నడిపించి ప్రేక్షకుల దగ్గర ఐదింతల నుంచి పదింతల వరకు వసూలు చేయడం! ఒకప్పుడు థియేటర్ల బైట బ్లాక్‌టికెట్లమ్మే వ్యవస్థ, పోలీసు అరెస్టులుండేవి. కానీ, ఇప్పుడు అనధికారిక అడ్డగోలు టికెట్‌ రేట్ల పెంపు అంటే, ఏకంగా థియేటర్లలో బుకింగ్‌లోనే బ్లాక్‌ టికెట్లు అమ్ముతున్నట్టు లెక్క! చూడదలుచుకున్న ప్రేక్షకులంతా వారం లోపే చూసెయ్యాలి. లేదంటే సదరు సినిమా ఎన్నాళ్లు ఆడు తుందో గ్యారంటీ లేదు. థియేటర్లన్నీ కొద్దిమంది గుత్తాధి పత్యంలో ఉన్నందువల్ల స్టార్‌ హీరోల సినిమాలకే వాటిని అంకితం చేస్తున్నారు. చిన్న సినిమాలు తీసినవారు ఆ సినిమాల విడుదల కోసం పడుతున్న బాధలు దేవుడెరుగు.

స్టార్‌ పరివారాల క్యారవాన్‌ల కోసం, భోజనం క్యారియర్‌ల కోసం, సినిమా ప్రొడక్షన్‌ దుబారా కోసం, హీరోల భారీ పారి తోషికం కోసం సామాన్య ప్రజలు చందాలివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీద ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. ఒక లాజికల్‌ ముగింపునకు చేరుకునేంత వరకు ఈ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వ నియంత్రణలో ‘ఆన్‌లైన్‌ టికెటింగ్‌’ అనే అంశం ముందుకొచ్చింది. అట్లాగే ప్రేక్షకులపై అదనపు భారం పడకుండా టికెట్‌ ధరలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. పాత విధానాల ద్వారా లబ్ధి పొందుతున్నవారికి ఈ సంస్కరణలు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. పవన్‌ కల్యాణ్‌కు కూడా అందుకే కోపం వచ్చింది. ఒక సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయనకు ఆ ప్రభుత్వంలోని మంత్రులు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. అది వేరే కథ.

స్టార్‌ అంటే నక్షత్రం. అది వెలుగునివ్వాలి. నక్షత్రకుడంటే వెంటపడేవారు, వేధించేవాడు. స్టార్స్‌ వెలుగులు వెదజల్లు తుంటే నవీన్‌ పొలిశెట్టి లాంటి నటులు పదుల సంఖ్యలో వస్తారు. ‘జాతిరత్నాలు, ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ, కేరాఫ్‌ కంచరపాలెం, పలాస, పెళ్లిచూపులు’ వంటి సినిమాలు ప్రవాహంలో వచ్చి పడి తెలుగు సినిమాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయి. ఒకవేళ స్టార్లు నక్షత్రకులుగా మారితే... ‘స్టార్స్‌’ను వెలిగించిన ప్రేక్షకులే నక్షత్రకులను వదిలించుకుంటారు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top