
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూ పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఫ్రికా లొకేషన్స్‌లోనే జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. దానికి కారణం ప్రియాంకా చోప్రా తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు ప్రధానంగా ఫారెస్ట్ లొకేషన్స్‌కు సంబంధించినవి కావడమే.
దీంతో ఆమె ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నారని, ఆమె అక్కడికి వెళ్లింది మహేశ్‌బాబు సినిమా కోసమే అనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు మహేశ్‌బాబు భార్య నమ్రత వినాయక చవితి పండగ జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి, మహేశ్‌బాబును మిస్ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. సో... మహేశ్‌బాబు కూడా రాజమౌళి సినిమా షూటింగ్ కోసం ఆఫ్రికా వెళ్లారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఇక ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబుపై ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట రాజమౌళి. ఇక కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామి కానుందనే ప్రచారం జరుగుతోంది.