తప్పిన అంచనాలు

Us Midterm Elections 2022 Results Joe Biden Democratic Party - Sakshi

‘డెమోక్రసీకి ఇది శుభదినం!’ అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల సరళిని చూసి, ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన తాజా వ్యాఖ్య ఇది. అమెరికాలోని డెమోక్రసీ మాటెలా ఉన్నా, బైడెన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాటిక్‌ పార్టీకి మాత్రం దాదాపు సార్వత్రిక ఎన్నికల లాంటి ఈ పోల్స్‌ కొంత శుభప్రదంగా పరిణమించాయి. భారీ ద్రవ్యోల్బణం, ప్రజల్లో బైడెన్‌పై పెరిగిన అసంతృప్తి ఆసరాగా రిపబ్లికన్ల జెండా రంగైన ‘ఎర్ర గాలి’ దేశమంతటా వీస్తుందన్న అంచనా తప్పింది. అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఇటు ప్రతినిధుల సభలోనూ, అటు ఎగువ సభ సెనేట్‌లోనూ తిరుగులేని ఆధిక్యం తమదే అవుతుందన్న రిపబ్లికన్‌ పార్టీ అంచనాలను మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలు నీరుగార్చాయి. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 218 స్థానాల మెజారిటీకి రిపబ్లికన్లు మెల్లగా దగ్గరవుతున్నారు. సెనేట్‌లో నువ్వానేనా పోటీ నడుస్తోంది. అయితే, నేవడా, అరిజోనా రాష్ట్రాల ఫలితాల్లో తప్పని జాప్యం – డిసెంబర్‌ 6న జరిగే జార్జియా ఎన్నిక వల్ల పార్లమెంట్‌లో అంతిమ బలాబలాలు తెలియడానికి మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. 

సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే మధ్యంతర ఎన్నికలపై అంతర్జాతీయంగా ఏమంత ఆసక్తి వ్యక్తం కాదు. ఏ రాష్ట్రానికి ఎవరు గవర్నర్‌ అయ్యారు, ఎవరు సెనేటర్‌ అయ్యారనేది ప్రపంచానికి పెద్దగా పట్టని వ్యవహారం. కానీ, ట్రంప్‌ హయాం నుంచి పరిస్థితి మారింది. అయితే, మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలంతగా అందరి దృష్టినీ ఆకర్షించినవి చాలాకాలంగా మరేవీ లేవనే చెప్పాలి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికలివే. ఆ ఎన్నికల ఫలితాలను మసిపూసి మారేడుకాయ చేశారన్న అప్పటి ట్రంప్‌ తప్పుడు వాదననే ఇప్పుడీ నవంబర్‌ 8 నాటి మధ్యంతర ఎన్నికల్లోనూ రిపబ్లికన్లు తెగ ఊదరగొట్టడం గమనార్హం. అలా చివరకు ఈ ఎన్నికలు ట్రంప్‌వాదపు దీర్ఘకాల మన్నికకు అగ్నిపరీక్షగా, అమెరికన్‌ ప్రజాస్వామ్యం ఏ మేరకు ఒత్తిడిని తట్టుకుంటుందో పరీక్షించే గీటురాయిగా మారాయి. ప్రపంచం ఆసక్తిగా చూసేలా చేశాయి. 

అభ్యర్థుల ఎంపికలో దూకుడు చూపిన ఎర్రరంగు రిపబ్లికన్లకూ, అధికార పీఠంపై అస్తుబిస్తు అవుతున్న నీలిరంగు డెమోక్రాట్లకూ ఈ ఎన్నికలు పాఠాలు నేర్పాయి. నిజానికి, అమెరికాలో అధ్యక్షుడి నాలుగేళ్ళ పదవీకాలంలో దాదాపు మధ్యలో జరిగే మధ్యంతర ఎన్నికలు అధికార పార్టీ, దేశాధ్యక్షుల పనితీరుపై రిఫరెండమ్‌ లాంటివి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ప్రతి మిడ్‌టర్మ్‌ పోల్స్‌లోనూ అధికార పార్టీ సగటున 26 స్థానాలు సర్వప్రతినిధి సభలో, 4 సీట్లు సెనేట్‌లో కోల్పోతుందని లెక్క. ఆ లెక్కన అధికార డెమోక్రాట్‌ పార్టీకీ ఎదురు దెబ్బలు అనూహ్యమేమీ కాదు. కానీ, దిగువసభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తున్నా అంచనాలకు తగ్గట్టు భారీ సంఖ్యలో విజయాలు రాలేదు. భయపడినంత గట్టిదెబ్బ డెమోక్రాట్లకు తగలలేదు. ఇది సర్వేలు సైతం అంచనా వేయని ఆశ్చర్యకర పరిణామం. పెన్సిల్వేనియా లాంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్ల గెలుపుతో, ఫలితాలు తాము అనుకున్నదాని కన్నా మెరుగ్గా ఉన్నాయని బైడెనే ఒప్పుకున్నారు. ఇక, ట్రంప్‌ గట్టిగా బలపరిచిన పలువురు మితవాదులు వివిధ రాష్ట్రాల్లో ఓటమి పాలవడం విడ్డూరం.

మిగిలిన బైడెన్‌ పదవీకాలం ఎలా గడుస్తుంది, అమెరికా రాజకీయాలపై ట్రంప్‌ నీడ ఏ మేరకు పరుచుకుంటుంది లాంటివన్నీ ఇక ఆసక్తికరం. మునుపెన్నడూ లేని విధంగా దేశం నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో, దిగువసభలో రిపబ్లికన్ల ఆధిక్యం బైడెన్‌కు కష్టాలు తేనుంది. ఒకప్పుడు ఎరుపు, నీలం పార్టీలు రెంటికీ సమాన బలాబలాలుండి, అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా నిలిచిన ఫ్లోరిడా రాష్టంలో ఇప్పుడు దాదాపు 20 శాతం పాయింట్ల పైగా భారీ తేడాతో రిపబ్లికన్‌ అభ్యర్థి డీశాంటిస్‌ గెలవడం గమనార్హం. ఆ రాష్ట్రం అంతకంతకూ ఎరుపుమయం అవుతోందనడానికి ఇది నిదర్శనం. వచ్చే అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వంలో ట్రంప్‌కు గట్టి సవాలు ఆయన నుంచే ఎదురుకావచ్చు. ఏమైనా, ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలను బట్టి ఒకటి స్పష్టమవుతోంది. అమెరికా రాజకీయాల్లో ట్రంప్‌ శకం అస్వాభావికమేమీ కాదు. ఆ సంగతి గ్రహించిన అమెరికా మిత్రపక్షాలు రానున్న రోజుల్లో నాటో, ఉక్రెయిన్‌లకు మద్దతు లాంటి వాటిపై ఎలా వ్యవహరిస్తాయన్నదీ ఆసక్తికరమే. 

ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పలువురి నేపథ్యాలు వైవిధ్యానికి ప్రతీకగా నిలవడం చెప్పుకోదగ్గ అంశం. భారత అమెరికన్లు అయిదుగురు ప్రతినిధుల సభకు ఎన్నికైతే, మేరీల్యాండ్‌కు గవర్నర్‌గా నల్లజాతీయుడు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలుగు మహిళ అరుణా మిల్లర్, ఇతర రాష్ట్రాల్లో ఒక స్వలింగ సంపర్క మహిళ, ఒక ట్రాన్స్‌జెండర్‌ గవర్నర్లుగా గెలవడం విశేషం. వీరందరూ డెమో క్రాట్‌ అభ్యర్థులే కావడం గమనార్హం. ఇలాంటి పరిణామాలు బాగున్నా, అమెరికా రాజకీయాలు అంతకంతకూ రెండు విరుద్ధ వర్గాల విద్వేషంగా మారుతున్నాయనే బెంగ పుట్టిస్తోంది. ఇప్పటి దాకా దిగువ, ఎగువ సభలు రెంటిలోనూ ఆధిక్యం డెమోక్రాట్లదే. ఎన్నికల తుది ఫలితాలతో రేపు బలాబలాల్లో తేడా వస్తే బైడెన్‌ అజెండా భవితవ్యం ప్రశ్నార్థకమే. ప్రతినిధుల సభ పూర్తిగా రిపబ్లికన్ల చేతిలోకి వెళితే, మిగిలినవన్నీ పక్కకు పోయి బైడెన్, ఆయన కుటుంబంపై దర్యాప్తుల పరంపర మొదలవుతుంది. సెనేట్‌ గనక గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కైవసమైతే న్యాయ నియామకాల్లోనూ అధ్యక్షుడు బైడెన్‌ సత్తా కుంటుపడుతుంది. వెరసి, అమెరికన్‌ రాజకీయాల్లో మరిన్ని మలుపులు ఖాయం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top