శ్రీ సూర్యనారాయణా...

Sakshi Editorial On Sun And Sankranthi Festival

బతుకులో పండుగ కాని క్షణం ఏముంటుంది! జీవితాన్ని కేవలం జీవించడం కాదు, ఉత్సవీక రించుకోమని చెబుతుంది ఒక సూక్తి. కాకపోతే ఒక షరతు; మహాకవి చెప్పినట్టు, మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మనకేనని ఆనందించే పసికూనలమైపోవాలి అందరం. జీవితం అనుక్షణ ఉత్సవభరితమే అయినా ప్రకృతిలో మారే ప్రతి ఋతువూ, కాలం వెంబడి మనిషి వేసే ప్రతి కీలకమైన అడుగూ పెద్దపండుగ అవుతుంది. ధనూరాశి నుంచి మకరరాశి లోకి సూర్యుడి సంక్రమణాన్ని సంకేతించే అలాంటి పెద్ద పండుగే సంక్రాంతి.

ఏటా నెల నెలా రాశి విడిచి రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టే ప్రతి సందర్భమూ సంక్రాంతే అయినా, మకర సంక్రాంతి మాత్రమే ఎందుకు మైలురాయి అయిందంటే; అప్పటికి మంచుపొరలు, చీకటి తెరలు క్రమంగా తొలగి వెలుగు వాకిళ్ళు తెరచుకోవడం మొదలవుతుంది. కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో పశువులు, పక్షులతో సహా ప్రకృతి సమస్తం భాగమై మనిషిలో కృతజ్ఞత ఉప్పొంగుతుంది.

అలా ప్రతి ప్రాణితోనూ, చెట్టుతోనూ, పుట్టతోనూ తన ముడిని గుర్తుచేసుకునే సందర్భమే సంక్రాంతి. ఆ మాటకొస్తే ఏ పండుగైనా అంతే. చిత్రవిచిత్రమైన రంగవల్లులను తీర్చిదిద్దేది, కొత్త బియ్యపు పిండిని చీమల వంటి సూక్ష్మజీవులకు ఆరగింపు చేసి భూతదయను చాటుకునేందుకేనని పెద్దలంటారు. ఒక్కోసారి తత్త్వం అడుగంటి తంతు మిగలడం కాలం చేసే మాయ.

మనిషి ఊహలో తొలిదైవంగా ముద్రపడిన ప్రాకృతిక అద్భుతమే సూర్యుడు. పరోక్ష దేవతలకు భిన్నంగా ఆయన ప్రత్యక్ష దైవం. అందుకే సర్వసాక్షి, కర్మసాక్షి సహా ఆయన చుట్టూ ఎన్నో కల్పనలు. దేవతల్లో పెద్దాయన ఆయనే. ప్రపంచమంతటా తొలి కొలుపులు అందు కున్నవాడిగా ఆయన వైశ్విక దైవం. దేవుడి గురించిన తొలి ఎరుక కలిగించిన ఆ మెరుపు, మైమరపు ఋగ్వేదంతో సహా ఆదిమ కృతులన్నింటిలో నిసర్గసుందరంగా వ్యక్తమవుతాయి. మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఒకప్పుడు ప్రధాన దైవమైన సూర్యుడికి మన పౌరాణిక ప్రసిద్ధుడైన నారాయణుని పేరు చేర్చిన ఫలితంగానే ఆయన సూర్యనారాయణుడయ్యాడని గుంటూరు శేషేంద్రశర్మ అంటారు.

ఒకప్పుడు పశ్చిమాసియాలో మిత్రారాధన పేరుతో వర్ధిల్లిన సూర్యారాధన ప్రభావం ఇతర మతాలపై ఎలా పడిందో అత్యంత ఆశ్చర్యకరంగా వివరిస్తాడు జి.జె.ఎం. ఫ్రేజర్‌ తన ‘గోల్డెన్‌ బౌ’ అనే బృహద్రచనలో. మన శ్రీరామచంద్రుడే కాక, ఒకనాటి పశ్చిమాసియా రాజులు, పర్షియన్‌ చక్రవర్తులు కూడా తమను సూర్యుడితో ముడిపెట్టుకున్నారు. ఆదిత్యçహృదయోపదేశం పొందిన తర్వాతే రాముడు రావణుని జయించగలిగాడని రామాయణం అంటుంది.

సంక్రాంతినీ, సూర్యునీ లోతుగా తడిమిన కొద్దీ ఇంకా ఎన్నెన్ని విశేషాలో! సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఘట్టాన్నే మనం మకర సంక్రాంతిగా జరుపుకొంటాం కానీ నిజంగా సూర్యుడికి గమనమంటూ ఉంటుందా? భూమే సూర్యుడి చుట్టూ ఒకింత వంపుతో తిరుగుతూ దూరమూ, దగ్గరా అవుతున్న క్రమంలోనే కాలాలూ ఋతువులూ ఏర్పడుతున్నాయి. మకర సంక్రాంతిని ఇప్పుడు జనవరి 15న జరుపుకొంటున్నాం కానీ, క్రీ.శ. 1000లో డిసెంబర్‌ 31న, క్రీ.శ.272లో డిసెంబర్‌ 21న జరుపుకొనేవారట.

మరో తొమ్మిదివేల సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతి జూన్‌ నెలలో వస్తుందట. జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన కాలగణనాలు ఇలాంటి విచిత్రాలను ఆవిష్కరిస్తే, శాస్త్రవిజ్ఞానం మరో రకమైన విలక్షణ దృశ్యానికి తెరతీసి ఒక్కోసారి వెన్నులో వణకు పుట్టిస్తుంది. సూర్యుడు ఎంత పెద్దాయనంటే, ఆయన వయసు 460 కోట్ల సంవత్సరాలకు పైనేనట. మరో 500 కోట్ల సంవత్సరాలు గతిస్తే, తన చుట్టూ తిరిగే భూమితో సహా అన్ని గ్రహాలనూ తనలో కలిపేసుకుని ఓ తెల్లని మరుగుజ్జు నక్షత్రంగానూ, ఆ తర్వాత నల్లని నక్షత్రంగానూ మారిపోతాడట.

ఆ లోపల తన కేంద్రంలో నిరంతరాయంగా జరిగే కోట్ల టన్నుల హైడ్రోజన్, హీలియవ్‌ుల కలయిక నుంచి లక్షల టన్నుల పదార్థం శక్తిగా మారిపోయే క్రమంలోనే మన మనుగడకు అవసరమైన వెలుగు, వేడి లభిస్తున్నాయి. శీతోష్ణాల నిర్విరామ ఘర్షణ నుంచే జీవి పుట్టి మనతో సహా అనేక ప్రాణుల రూపంలో పరిణామం చెందడం వేరే కథ.

మన ఊహకు అతీతమే కాక, మన నిత్యజీవన సంతోషాలకు ఏమాత్రమూ అడ్డురాని సూర్యుని వైశ్విక మూలాలను ఈ పండుగ వేళ మరీ లోతుగా తడమడమెందుకు? ప్రకృతితో మమేకమై వెలుగూ వేడిలో స్నానిస్తూ ఈ క్షణాలను మధురమధురం చేసుకుందాం. పొన్న,ఉల్లి, జాజి, సంపంగి, మల్లె, మంకెన, ములగ, ఆవ, వంగ, గుమ్మడి పూచాయలు ధరించే ఆ సూర్యనారాయణుడికి నోరారా మేలుకొలుపు పాడుకుందాం.

కవయిత్రి కుప్పిలి పద్మ అన్నట్టు, ఒక్కుమ్మడిగా పండుగను పిలిచేందుకు ఈ చేతులతో చుక్కల ముగ్గుల్ని, రంగుల చామంతుల్ని పూయిద్దాం. ఎక్కడెక్కడి చుట్టాలనో ఏడాదికొకచోట కలిపే సారంగధర మెట్ట మీది తనివితీరని తిరునాళ్ళ పుట్టినిల్లు జ్ఞాపకాల నెగడు దగ్గర చలి కాగుదాం. చెట్టుకొకరుగా పుట్టకొకరుగా తుప్పల వెంటా పుంతల వెంటా పడి తిరుగుతూ, ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్క మొగ్గనీ తెంపకుండా, ఒక్క పువ్వునూ వదలకుండా మృదువైన పూల వేట సాగిద్దాం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top