విప్లవ స్వరూపాలు | Sakshi Editorial On Revolutionary Forms | Sakshi
Sakshi News home page

విప్లవ స్వరూపాలు

Apr 6 2026 1:16 AM | Updated on Apr 6 2026 1:16 AM

Sakshi Editorial On Revolutionary Forms

ఆంధ్ర పంచకావ్యాలలో వసుచరిత్ర ఒకటి. ఇందులో తెలుగు పద్యరచన పరాకాష్ట పొందినదని చెబుతారు. 16వ శతాబ్దానికి చెందిన రామరాజ భూషణుడు ఈ కావ్యకర్త. ఈయనకే భట్టుమూర్తి అని మరోపేరు. ఆ పేరుతో నరస భూపాలీయం రచించాడు. రామరాయల ఆశ్రయంతో రామరాజ భూషణుడయ్యాడు. ఈయన చిత్రకవితా నిపుణుడు కూడా. అష్టావధానానికీ ఈయనే మూల పురుషుడని పెద్దల మాట. పదము, క్రమము, ఘన, జట మొదలైన అష్ట విధాలుగా వేద పండితులు వేదావధానము చేస్తున్నప్పుడు, తానూ ఆ ప్రజ్ఞను చూపాలని ఉత్సాహపడి, ద్విజుడు కానందువల్ల సాహిత్యపరంగా ఆ ప్రక్రియను అవలంబించాడట.

ఇంగ్లీషు చదువుకుంటే ‘స్వధర్మభ్రంశం తటస్థిస్తుందన్న’ భయం ఉన్న ఇంట్లో జన్మించాడు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆ ఇంగ్లీషు నేర్చుకోలేనందుకు ఎంతో బాధపడతాడు కూడా. కానీ ఆ ఇంగ్లీషు ఆహార్యాన్ని ఆనందంగా స్వీకరించాడు. అప్పట్లో చదువుకున్న కొంతమంది అబ్బాయిలు పిలకలు కత్తిరించుకొని క్రాపింగ్‌ చేయించుకోవడం మొదలుపెట్టారు. వారిని చూసి శ్రీపాదకూ అలాంటి కోరిక కలిగింది. ఒకరోజు క్షురకుడి దగ్గరకు వెళ్లి పిలకను పూర్తిగా కత్తిరించి క్రాపింగ్‌ చేయించుకున్నాడు. ఇంటికి రాగానే తండ్రి గమనించాడు. తలపై పిలక కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయి ‘అయ్యో! 

పిలక కత్తిరించేశావా?’ అన్నాడట. కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక సంస్కర్త, సూతపురాణం కర్త త్రిపురనేని రామస్వామి తన పేరు చివరి ‘చౌదరి’ అనే కులచిహ్నాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశాడు. కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో పుచ్చలపల్లి సుందరయ్య తన పేరులో రెడ్డిని తొలగించుకోవడమే కాకుండా, ఉద్యమ జీవితానికి పూర్తిగా అంకితమవ్వాలనే నిర్ణయంతో సంతానం లేకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా వాసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అలా సంతానం లేకుండా ఉండే నిర్ణయాన్ని ఆయన భార్య లీల కూడా అంగీకరించారు. 1942లో భూస్వామ్య సమాజంలోని స్త్రీల జీవితంలోని ఉక్కపోతనూ, వాళ్ల మధ్య ఏర్పడే అనివార్య సాన్నిహిత్యాన్నీ చూపిన ‘లిహాఫ్‌’ కథ రాసిన ఇస్మత్‌ చుగ్తాయి లాహోర్‌ కోర్టు మెట్లు ఎక్కడానికీ వెనుకాడలేదు.

అదంతా పెద్ద మనుషుల కాలం. పెద్ద త్యాగాలకు సమాజాలు సిద్ధపడిన కాలం. పెద్ద పోరాటాలకు తగినంత దృఢ సంకల్పం ఉన్న కాలం. ముందు సమాజం, ఆ తర్వాతే నేను అనుకున్న కాలం. మనుషులు అలాంటి విలువల్ని నెత్తిన పెట్టుకున్న సత్యకాలం. ఇప్పుడు కాలం మారింది. విలువలు అలాగే ఉన్నాయి కానీ వాటి మీద అభిప్రాయాలు మారిపోయినై. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అనే వ్యవహారం సరిగ్గా సరిపోయే కాలం. కానీ ఎంత శుద్ధి చేసినా పోని మురికిలా సంఘంలో సమస్యలు చాలానే ఉన్నాయి. 

ఈ కాలానికి తగినట్టుగా, చిన్న చిన్న విప్లవాలు ఇప్పటి అవసరమని చెబుతాడు ఒక కథలో ఉణుదుర్తి సుధాకర్‌. కాలనీ పార్కులో మూత్రం పోయించే కుక్క యజమానిని నిలదీయడం, పెద్ద శబ్దంతో అపరాత్రి మోగే మైకు మీద ఫిర్యాదు చేయడం, సైలెన్సర్‌ తొలగించిన బైకును అడ్డుకోవడం, పొగ చిమ్మకుంటూ పోతున్న ఆటోను ఫొటో తీయడం, సీట్లో లేని ఉద్యోగిని ప్రశ్నించడం, ఆహార కల్తీ మీద ఉప్పందించడం, నోటీసు ఇవ్వకుండా ఇంటిమీదికొచ్చే బుల్‌డోజర్‌కు ఎదురునిలవడం... అన్నీ చిన్న చిన్న విప్లవాలు. పెద్ద త్యాగాలు చేయకుండానే చిన్న మార్పునైనా సాధ్యం చేసే విప్లవాలు. 

2026 మార్చి వరకు మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా చేస్తామన్న మాటకు గడువు దాటిపోయింది. సాంకేతికంగా అది అంతమైపోయిందా? రూపం మార్చుకుంటుందా? ఆ మనుషులు ఇంకే దారుల్లో వ్యక్తమవుతారు? సిద్ధాంత ఆచరణలు రూపు మార్చు
కుంటాయేమోగానీ సమస్యలు ఉన్నంతవరకూ ప్రజాగ్రహం ఉంటూనే ఉంటుంది. ప్రజాగ్రహం ఉన్నచోట ఏదో ఒక చిరు విప్లవం మొలుస్తూనే ఉంటుంది. తార్కిక హేతువుకు అందినంతవరకూ, వద్దన్నది వదలకుండా చేయడం కూడా విప్లవమే. సంక్షుభిత కల్లోల సమయాల్లో సాటివాడి మీద కరుణ చూపడం కూడా మేలైన విప్లవ చర్యే!  

Advertisement
 
Advertisement
Advertisement