ఈ నిర్లక్ష్యం సహించరానిది

Sakshi Editorial On Recent Indigo Plane Avert Mid-Air Collision And Safety Of Air Passengers

నిరంతర అప్రమత్తత ఎంతటి ప్రమాదాన్నయినా నివారిస్తుంది. తెలిసో, తెలియకో చేసే చిన్న పొర పాటు ఒక్కొక్కప్పుడు అపారమైన నష్టానికి దారితీస్తుంది. ఈ నెల 7న బెంగళూరు గగనతలంలో రెండు విమానాలు ఒకదానికొకటి చేరువగా రాబోయి, రెప్పపాటులో ప్రమాదంనుంచి బయట పడ్డాయని వెలువడిన కథనాలు దిగ్భ్రాంతి కలిగించాయి. ఇండిగో సంస్థకు చెందిన ఈ రెండు విమానాల్లో ఒకటి బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లడానికి టేకాఫ్‌ కాగా, మరొకటి భువనేశ్వర్‌ వెళ్లడా నికి గాల్లోకి లేచింది. అయిదు నిమిషాల తేడాతో టేకాఫ్‌ అయిన ఈ రెండు విమానాల పైలట్‌లనూ రాడార్‌ కంట్రోలర్‌ ఒకరు అప్రమత్తం చేసి ప్రమాదాన్ని నివారించారు. పెను ముప్పు తప్పినందుకు సంతోషించాలో, ఈ ఉదంతాన్ని గుట్టు చప్పుడు కాకుండా కప్పెట్టేందుకు ప్రయత్నించిన అధికారుల తీరును చూసి ఆందోళనపడాలో తెలియని స్థితి. ఈ నెల 9న దుబాయ్‌లో కూడా ఇదే తరహాలో పెను ప్రమాదాన్ని నివారించారు. దుబాయ్‌నుంచి హైదరాబాద్‌ రావాల్సిన ఈకే–524 విమానం, దుబాయ్‌ నుంచి బెంగళూరు వెళ్లే ఈకే–568 విమానం టేకాఫ్‌ సమయంలో ఢీకొట్టుకోబోయాయి. దుబాయ్‌–హైదరాబాద్‌ పైలట్‌ టేకాఫ్‌ కోసం విమానాన్ని పరుగెత్తిస్తుండగా తనకెదురుగా శర వేగంతో వస్తున్న దుబాయ్‌–బెంగళూరు విమానాన్ని గమనించాడు. ఈలోగా హైదరాబాద్‌ విమా నాన్ని వెంటనే టాక్సీ బే వైపు వెళ్లి, రన్‌వేను ఖాళీ చేయాలని ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) ఆదేశా లిచ్చారు. దాంతో ముప్పు తప్పింది. హైదరాబాద్‌ విమానం పైలట్‌ ఏటీసీ అనుమతి ఇవ్వకుండానే బయల్దేరేందుకు ప్రయత్నించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటున్నారు. 

ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త సాంకేతికతల పుణ్యమా అని ప్రస్తుతం విమానాలే అత్యంత సురక్షిత ప్రయాణ సాధనాలని నిపుణులు చెబుతున్న మాట. ప్రతి వందకోట్ల కిలోమీటర్ల ప్రయా ణానికీ విమానాలద్వారా సంభవించే సగటు మరణాల రేటు రైళ్లు, కార్ల కారణంగా జరిగే మరణా లతో పోలిస్తే అత్యంత తక్కువని గణాంకాలు వివరిస్తున్నాయి. 1950 నుంచి జరిగిన విమానయాన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి దశాబ్దానికీ వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అప్ప టితో పోలిస్తే విమానాల సంఖ్య, ప్రయాణాల సంఖ్య లక్షల్లో పెరిగినా ప్రమాదాలు పెద్దగా లేక పోవడం ఆ రంగంలో వచ్చిన సాంకేతికతల పర్యవసానమే. 70వ దశకంలో వచ్చిన డిజిటల్‌ పరికరాలతో విమానాల పోకడే మారింది. ఆ తర్వాత కాలంలో సెన్సర్ల మెరుగుదల, ఆధునిక సాంకే తికతలతో వచ్చిన నావిగేషన్‌ పరికరాలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ తదితరాలు విమానయానాన్ని మరింత సురక్షితంగా మార్చాయి. అయితే సాంకేతికత ఎంతగా విస్తరించినా ఎప్పటికప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. చాలా ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని, సాంకేతిక వైఫల్యం శాతం అతి తక్కువగా ఉంటున్నదని తేలింది. అయితే ఇందులోనూ సమస్య పొంచివుంది. అత్యాధునిక సాంకేతికత తనంత తానే అవసరానికి తగ్గట్టు సర్దుబాటు చేసుకుని ప్రయాణం సాఫీగా పూర్తయ్యేందుకు దోహదపడుతున్నమాట వాస్త వమేగానీ... అది పైలట్‌లలో అలసత్వాన్ని పెంచుతున్నదని, అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్నీ, చొరవనూ వారు కోల్పోతున్నారని నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఇందుకు 2013లో దక్షిణకొరియా విమానానికి శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ప్రమాదాన్ని ఉదహరిస్తున్నారు. అందులో 304 మంది ప్రయాణిస్తుండగా విమానం కిందకు దిగుతున్న సమ యంలో సాంకేతికత మొరాయించడం, పైలట్‌ అయోమయంలో పడటం కారణంగా ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు మరణించారు. అలాగే 2019లో కేవలం అయిదు నెలల వ్యవధిలో బోయింగ్‌కు చెందిన రెండు విమానాలు వైఫల్యం చెంది, ప్రమాదాల్లో 350 మంది మరణించారు. ఆ రెండు విమానాలూ ఒకే మోడల్‌వి కావడంతో 180 దేశాలు వాటి వాడకాన్ని నిలిపేశాయి. ఆ విమా నాల సాంకేతికతల్లో తగిన మార్పులు చేశారని నిర్ధారించుకున్నాకే ఇటీవల వాటి వినియోగం మొదలైంది.

సాంకేతికత అద్భుతమైనదైనా, చాకచక్యంతో వ్యవహరించగల నేర్పు పైలట్‌కు ఉన్నా ఏటీసీ పరంగా లోపాలుంటే సమస్యలు ఏర్పడతాయి. బెంగళూరులోనూ, దుబాయ్‌లోనూ జరిగింది అదే. దుబాయ్‌లో అయితే కనీసం ఆ ఉదంతం ఉన్నతస్థాయి అధికారుల దృష్టికొచ్చింది. అక్కడ ఏ మాదిరి తప్పు జరిగిందో నిర్ధారించి, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో పనిచేస్తున్న వారందరినీ అప్రమత్తం చేయడానికి... మరెక్కడా అలాంటి సమస్య తలెత్తకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. కానీ బెంగళూరు ఏటీసీలో జరిగింది వేరు. దక్షిణంవైపున్న రన్‌వేను మరమ్మ తుల కోసం మూసివేశారు. కేవలం ఉత్తరంవైపున్న రన్‌వేను మాత్రమే వినియోగించాలని నిర్ణయిం చారు. ఆ వర్తమానం దక్షిణంలో ఉన్న కంట్రోలర్‌కి చేరలేదు. దాంతో హైదరాబాద్‌ విమానం కదలడానికి అనుమతించారు. ఉత్తరంవైపున్న కంట్రోలర్‌ సకాలంలో ఈ పొరపాటును గుర్తించక పోతే 430 మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఆ సంగతిని తగిన రికార్డుల్లో నమోదు చేసి, పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ)కు సమాచారం అందించాల్సి ఉండగా, తొక్కిపెట్టేం దుకు ప్రయత్నించారు. ఈ తప్పిదాన్ని తీవ్రంగా పరిగణించడంతోపాటు, సమాచార లోపం ఎవరి వల్ల చోటుచేసుకున్నదో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top