కిర్గిజిస్తాన్‌ భద్రమేనా! | Sakshi
Sakshi News home page

కిర్గిజిస్తాన్‌ భద్రమేనా!

Published Sat, May 25 2024 4:36 AM

Sakshi Editorial On Kyrgyzstan

ఉపాధి కోసమో, విద్యార్జన కోసమో మనదికాని చోటుకు పిల్లలను పంపినప్పుడు కన్నవాళ్ల హృదయం వారి కోసం నిత్యం ఆరాటపడుతుంది. సక్రమంగా ఉన్నారా, తిన్నారా అన్న ఆలోచనలే అనుక్షణమూ వారిని వేధిస్తుంటాయి. ప్రపంచం మునపట్లా లేదు గనుక ఇటువంటి భయాందోళనలు ఇప్పుడు మరింత పెరిగాయి. దేశంలో ఉన్నత విద్యారంగం, మరీ ముఖ్యంగా వైద్య విద్య బాగా విస్తరిస్తే అందరికీ అందుబాటులోకొస్తే మన విద్యార్థులు దూరతీరాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలా లేకపోబట్టే విద్యార్థులు అనుకోకుండా జరిగే పరిణామాల్లో చిక్కుకుని అవస్థలు పడాల్సివస్తోంది. 

రెండున్నరేళ్లక్రితం ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి తెగబడినప్పుడు అక్కడి మన వైద్య విద్యార్థులు ప్రాణాపాయంలో చిక్కుకోవటం, ఇబ్బందులు పడటం చూశాం. మన దేశంతోపాటు అన్ని దేశాలూ తమ తమ విద్యార్థులను సురక్షితంగా వెనక్కు తీసుకెళ్లగలిగాయి. సరిగ్గా వారం క్రితం కిర్గిజిస్తాన్‌లోనూ విద్యార్థులకు సమస్య ఎదురైంది. ఈనెల 13న పాకిస్తాన్, ఈజిప్టు విద్యార్థులతో ఏర్పడిన తగవు ఆసరా చేసుకుని వందలాదిమంది స్థానికులు విద్యార్థుల హాస్టళ్లపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. అనేకమంది విద్యార్థులను గాయపరిచారు. 

విద్యార్థినులను సైతం వేధించటం, దౌర్జన్యం చేయటంతో ఎప్పుడేమవుతుందో తెలియక విద్యార్థులంతా ఏడెనిమిది గంటలపాటు చీకటి గదుల్లో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులు రంగంలోకి దిగినా దుండగులను అదుపు చేయలేకపోయారు. ఆ తర్వాత అరెస్టులు జరిగాయి. అది వేరే సంగతి. హాస్టళ్లకూ, విదేశీ విద్యార్థులుండే అపార్ట్‌మెంట్లకూ రక్షణ కల్పిస్తున్నారు. 

కానీ ఘటన జరిగివారం కావస్తున్నా ఎక్కడా భయాందోళనలు చల్లారలేదు. దాంతో స్వస్థలాలకు పోవటమే ఉత్తమమని శుక్రవారం కూడా వందలాదిమంది పాకిస్తానీ విద్యార్థులు ఇంటి బాట పట్టారు. వారి ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. మన విదేశాంగశాఖ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బిషెక్‌లోని మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. 

వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడి భాష, సంస్కృతీ సంప్రదాయాలు, పద్ధతులపై అవగాహన పెంచుకుని వాటిని గౌరవించటం అలవాటు చేసుకోవాలి. తమ దేశానికి చెందినవారితోనే సన్నిహితంగా మెలగటం, స్థానికులను చిన్నచూపు చూసే స్వభావం అనవసరమైన అపార్థాలకు దారితీస్తుంది. తమ సంస్కృతే ఘనమైనదని, ఇతరులు అల్పులన్న భావన స్వదేశంలో ఎంతోకొంత చెల్లుబాటవుతుంది. వేరేచోట మాత్రం సమస్యలు తెస్తుంది. దీన్ని గుర్తించబట్టే విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్థానికులతో కలిసిమెలిసివుండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. కిర్గిజిస్తాన్‌లో మూడేళ్లక్రితం కూడా గొడవలు జరిగాయి. 

అప్పుడూ ఇప్పుడూ కూడా పాకిస్తాన్‌ విద్యార్థులే గొడవలకు కారకులయ్యారు. రౌడీయిజం, స్థానిక సంప్రదాయాలను కించపరచటం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనటం వంటివి సమస్యలు తెచ్చిపెడుతున్నాయన్నది స్థానికుల ఆరోపణ. సాధారణంగా ఒకరిద్దరి ప్రవర్తన వల్ల గొడవ జరిగితే అది వారికే పరిమిత మవుతుంది. ఎవరో ఒకరి జోక్యంతో అంతా సద్దుమణుగుతుంది. కానీ సామాజిక మాధ్యమాల హవా పెరగటం, ఆ గొడవ తాలూకు వీడియో క్షణాల్లో అందరికీ చేరటం భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. ఉద్రిక్తతలు రేపుతోంది. దీనికితోడు విదేశీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తమకు లేకపోవటం, వారి జీవన ప్రమాణాలు మెరుగ్గా కనబడటం ఆర్థికంగా అంతంతమాత్రంగా బతుకీడ్చే స్థానికులకు సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది. 

తమను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తూ విదేశీ విద్యార్థులను అందలం ఎక్కించటం అసంతృప్తికి దారితీస్తుంది. పుండు మీద కారం జల్లినట్టు వారిని కించపరచటం లాంటి చేష్టలకు పాల్పడితే ఇక చెప్పేదేముంది? ఇలాంటి సమయాల్లో కారకులెవరన్న విచక్షణ ఉండదు. విదేశీయులందరినీ ఒకే గాటనకడతారు. కనుక ఎవరికి వారు పద్ధతిగా ఉంటే సరిపోదు. తోటి విద్యార్థులపై ఓ కన్నేసివుంచాలి. సమస్య తలెత్తవచ్చన్న సందేహం కలిగితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నిజానికి మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్‌ వేరే దేశాలతో పోలిస్తే ఎంతో ప్రశాంతమైనది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానికులు ప్రధానంగా సంచార జీవనానికి అలవాటుపడినవారు. విదేశీ అతిథులను ఆదరించటం, గౌరవించటంలో వారు ఎవరికీ తీసిపోరు. 

కిర్గిజిస్తాన్‌ విద్యాలయాల్లో మన విద్యార్థులు 15,000 మంది ఉంటారని అంచనా. పాకిస్తాన్‌ నుంచి వచ్చినవారి సంఖ్య 11,000. వీరుగాక ఇంకా బంగ్లాదేశ్, కొన్ని అరబ్, ఆఫ్రికన్‌ దేశాల నుంచి కూడా చదువుకోవటానికి వస్తారు. తమ దేశాల్లో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారడమే ఇందుకు కారణం. పూర్వపు సోవియెట్‌ యూనియన్‌లో భాగం కావటం వల్ల పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కిర్గిజిస్తాన్‌ వైద్య విద్య ఎంతో ప్రామాణికమైనది. 

అంతర్జాతీయంగా అనేక దేశాలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కూడా దానికివుంది. వేరే దేశాల్లో చదవాలని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని తహతహలాడే పిల్లలు దూరాభారాలు లెక్కచేయక విదేశాలకు వెళ్తారు. కానీ ఇక్కడ చదువుకోవాలనుకునేవారికి మన వైద్యవిద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవటం ప్రభుత్వాల బాధ్యత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ పెట్టాయి. వేరే రాష్ట్రాలు కూడా ఆ పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం అందుకు సహాయసహకారాలు అందించాలి.  

Advertisement
 
Advertisement
 
Advertisement