పైసా వసూల్‌... అవుతోందా?

Sakshi Editorial on Gst Collection in April 2022

గత ఏప్రిల్‌లో రూ. 1.39 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చిలో 1.42 లక్షల కోట్లు. ఇక, ఈ ఏప్రిల్‌లో  ఆల్‌టైమ్‌ రికార్డ్‌ 1.68 లక్షల కోట్లు! ఇవన్నీ ఎప్పటికప్పుడు దేశ ఖజానాకు భారీగా చేరుతున్న ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్టీ) రికార్ట్‌ స్థాయి వసూళ్ళ గణాంకాలు! ఇటీవలి విదేశీ పర్యటన సహా ప్రతిచోటా ప్రధాని ఛాతీ విరుచుకొని చెబుతున్న ఈ లెక్కలు కరోనా దెబ్బ నుంచి కోలుకుంటున్న మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబాలు. ఉక్రెయిన్‌ సంక్షోభంతో చిక్కులు తలెత్తినా, ఆర్థిక కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయన్న ఈ సూచన కచ్చితంగా ఆరోగ్యకరమే! జీఎస్టీ అమలు ఆరంభమైన నాటి నుంచి ఎన్నడూ లేనంతటి, ఈ తాజా ఏప్రిల్‌ వసూళ్ళ అద్భుతం రాష్ట్ర ప్రభుత్వాల కృషి, సహకారంతోనే సాధ్యమైందని కేంద్ర ఆర్థిక మంత్రి సైతం బాహాటంగా కొనియాడారు. మంచిదే! మరి పెరుగుతున్న స్థాయికి తగ్గట్టు రాష్ట్రాలకి న్యాయంగా చేరాల్సిన పైసా వంతు చేరుతోందా?  
వ్యాపారాలపై కేంద్రం, రాష్ట్రాలు విధించే బహుళ పన్నులను తప్పించి, సరళీకృత ఒకే పన్ను వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ తెచ్చారు. 2017 జూలై 1 నుంచి అది అమలవుతోంది. దేశమంతటా జీఎస్టీని వర్తింపజేస్తున్నప్పుడు రాష్ట్రాలు అనేక పన్ను అధికారాలను వదులుకొని, ఆదాయాన్ని నష్టపోవాల్సి వచ్చింది. అందుకే, అయిదేళ్ళ పాటు, అంటే ఈ 2022 జూన్‌ ఆఖరు వరకు రాష్ట్రాలకు నష్టం లేకుండా లోటు భర్తీ చేయడానికి కేంద్రం అంగీకరించింది. 2015–16ను ప్రాతిపదిక వత్సరంగా తీసుకొని, ఏటేటా 14 శాతం మేర ఆదాయం పెరుగుతుందనే లెక్కన సురక్షిత పరిహారం అందిస్తామని చెప్పింది. అయితే, జీఎస్టీతో అధిక ఆదాయం సమకూరుతున్నా, కేంద్రం అందుకు తగ్గట్టుగా రాష్ట్రాలకు వాటా పంచుతోందా? పైపెచ్చు, ఆదాయ వనరులు పడిపోతున్న రాష్ట్రాలు పదే పదే అభ్యర్థిస్తున్నా, తాము జీఎస్టీ పరిహారమిచ్చే కాలాన్ని అయిదేళ్ళ తర్వాత పెంచేది లేదని కేంద్రం భీష్మించుకుంది. ఫెడరల్‌ వ్యవస్థలో ఇది ఎంతవరకు సమంజసం? 

చమురు ఉత్పత్తులపై పన్నులను కేంద్రం తగ్గించినా సరే, బీజేపీ పాలనలో లేని పలు రాష్ట్రాలు మాత్రం తగ్గించనే లేదని ప్రధాని మోదీ గత వారం పేర్కొన్నారు. రాష్ట్రాలతో కోవిడ్‌ సమీక్ష పెట్టి, సందర్భం లేని ఈ పన్నుల ప్రస్తావన తేవడాన్ని పలు రాష్ట్రాలు ప్రశ్నించాయి. మరీ ముఖ్యంగా జీఎస్టీని అమలు చేస్తే అయిదేళ్ళ పాటు కేంద్రం ఇస్తానన్న పరిహారంతో సహా అనేక చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నాయి. ఉదాహరణకు ఒక్క పశ్చిమ బెంగాల్‌కే రూ. 97 వేల కోట్లు బాకీ. అందుకే, తాము చమురు పన్నులను తగ్గించలేకపోతున్నామని రాష్ట్రాల వాదన. 2021–22కు గాను గత డిసెంబర్‌ నుంచి 4 నెలలకు రూ. 78,704 కోట్ల మేర రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం పేరుకుపోయిన మాటను కేంద్ర ఆర్థిక శాఖ సైతం అంగీకరించడం గమనార్హం. కానీ, ‘పరిహార సెస్‌ వసూళ్ళ నిధి’లో ‘తగినంత నిల్వ లేకపోవడం’ వల్లనే చెల్లింపులు జరపలేకపోతున్నా మని తప్పు అటు నెట్టేస్తోంది. జీఎస్టీ వసూళ్ళకు తగ్గట్టు పరిహార సెస్‌ వసూళ్ళు వేగంగా పెరగడం లేదన్నది నిజమే. కాగా, ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పోగుపడేవి మరో 60 వేల కోట్లుంటాయని ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా. అంటే, రాష్ట్రాలకు 1.4 లక్షల కోట్లు కేంద్రం చెల్లించాల్సి వస్తుంది. 

జీఎస్టీ మొదలైననాటి నుంచి ఇప్పటి దాకా పరిహారంగా రాష్ట్రాలకు కేంద్రం రూ. 7.35 లక్షల కోట్లు ఇచ్చినట్టు లెక్క. అయితే, సంక్షేమ, అభివృద్ధి ఫలాలను స్థానికంగా ప్రజలకు అందించే బాధ్యత ప్రాథమికంగా రాష్ట్రాలది. ఆ రాష్ట్రాలకు రాబడిలో తగిన వాటా కేంద్రం ఇస్తేనే కదా పురోగతి సాగేది. ఇవ్వకపోతే ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఆదాయం కావాలంటే, జీఎస్టీ పన్నులను పెంచడం వినా జీఎస్టీ కౌన్సిల్‌కు మరో దోవ లేకుండా పోతుంది. గత సెప్టెంబర్‌ తర్వాత సక్రమంగా కలవని కౌన్సిల్‌ సత్వరమే సమావేశమైతే మంచిది. జీఎస్టీలో 5, 12, 18, 28 శాతా లంటూ 4 శ్లాబులున్నాయి. 5 శాతం శ్లాబ్‌లో ప్రధానంగా ప్యాకేజ్డ్‌ ఆహారపదార్థాలున్నాయి. ఈ శ్లాబ్‌లో హెచ్చించే ప్రతి 1 శాతం పన్ను వల్ల ఏటా రూ. 50 వేల కోట్లు అదనపు ఆదాయం వస్తుంది. అందుకని 5 శాతం శ్లాబ్‌ను ఎత్తేసి, ఆ పరిధిలోని అధిక భాగం వస్తువుల్ని కొత్త 8 శాతం శ్లాబ్‌కి తెస్తారట. అలా భారం వేసే కన్నా, భారీ జీఎస్టీ వసూళ్ళ దృష్ట్యా వాటిని మెరుగైన రీతిలో పంచే యోచన, రాష్ట్రాలకు పరిహారమిచ్చే కాలాన్ని పొడిగించే ఆలోచన కేంద్రం ఎందుకు చేయకూడదు? 

జీఎస్టీ లాంటి పరోక్ష పన్నులను ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే రేటున కట్టాలి. అదే ప్రత్యక్షపన్నులైతే వారి ఆదాయం, లాభాల స్థాయిని బట్టి కట్టవచ్చు. పన్ను వసూలు వ్యవస్థలోని ఈ అసమానతలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇప్పటికైనా జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించాలి. ఉన్నత శ్రేణి వినియోగ వస్తువులకే అధిక శాతం పన్ను శ్లాబ్‌ను వర్తింపజేయడం లాంటి చర్యలు అవసరమనేది అందుకే! అలాగే, వేగవంతమైన వృద్ధికి కీలకమైన మూలధన వ్యయాన్ని రాష్ట్రాలు ఈ ఏడాది బాగా పెంచాలి. కేంద్రం నిధులను త్వరగా విడుదల చేస్తేనే అది సాధ్యం. ఆ నిధులు ఇతర పన్నుల్లోని వాటా కానివ్వండి, జీఎస్టీ పరిహారం కానివ్వండి. ఈ మార్చి, ఏప్రిల్‌లలో వచ్చిన రికార్డు జీఎస్టీ వసూళ్ళలో రాష్ట్రాలకు అధిక వాటా దక్కితే మేలు. కోవిడ్‌ ఉత్పత్తి నష్టాల నుంచి కోలుకోవ డానికి 12 ఏళ్ళ పైనే పడుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ చెబుతున్న వేళ, సమయానికి తగ్గట్టు తోడ్పాటు నిస్తేనే రాష్ట్రాలు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రణాళిక వేసుకొని, వేగంగా ఆచరణలోకి తేగలగుతాయి. లేదంటే ‘ఒక దేశం ఒకే పన్ను’ కేంద్రానికే లాభమనే అపప్రథ వస్తుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top