జీ7 మేల్కొనదా?! | Sakshi Editorial On G7 countries | Sakshi
Sakshi News home page

జీ7 మేల్కొనదా?!

Jun 19 2025 12:27 AM | Updated on Jun 19 2025 12:27 AM

Sakshi Editorial On G7 countries

నానాటికీ మసకబారుతున్న ప్రతిష్ఠను కాస్తయినా పునరుద్ధరించుకోవాలన్న స్పృహ కూడా లేకుండా ఎప్పటిలా జీ7 రెండు రోజుల సమావేశాలు కెనడాలోని ఆల్బెర్టాలో పేలవంగా ముగిశాయి. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం అంతూ దరీ లేకుండా కొనసాగుతుండగా, తాజాగా ఇరాన్‌పై అమెరికా అండతో ఇజ్రాయెల్‌ దండెత్తింది. కానీ రెండు విషయాల్లోనూ తన వైఖరి ఎలావుండాలో, ఏం చేయాలో జీ7 తేల్చుకోలేకపోయింది. 

సమావేశాల ముగింపులో లాంఛనంగా విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన కరవైంది. ఏకపక్షంగా ఇరాన్‌పై దాడులకు దిగి పశ్చిమాసియాలో మరో మహాసంగ్రామానికి తెరలేపిన ఇజ్రాయెల్‌ను పల్లెత్తు మాట అనకుండా తప్పంతా ఇరాన్‌దేనని ఈ దేశాలు తేల్చాయి. ఆ యుద్ధం పర్యవసానాలు తమను సైతం చుట్టుముడతాయనీ, అమెరికా ఆ ఊబిలోకి దిగితే అది మరో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉన్నదనీ తెలిసినా కిక్కురుమనలేదు. 

ఇరాన్‌ను ఏదో ఒకటి అనకపోయినా... రష్యాను నిందించే ప్రయత్నం చేసినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆగ్రహం కలుగుతుందన్న భయం జీ7 దేశాలను వెన్నాడింది. సమావేశాలకు ముందు బ్రిటన్, కెనడాలు రష్యాపై మరిన్ని ఆంక్షలుంటాయని ఆర్భాటంగా ప్రకటించాయి. 

కానీ ట్రంప్‌ తీరు చూశాక వాటికి నోరుపెగల్లేదు. గాజా విషయంలో ఇజ్రాయెల్‌ను తప్పుబట్టినట్టు కనబడుతూనే, ఇరాన్‌పై దండయాత్ర విషయంలో ఒక్క మాట అనలేకపోయాయి. అసలే జీ7 ‘నిన్నటి క్లబ్‌’ అని పేరుబడింది. ఆ అపకీర్తిని మరింత పెంచుకోవటానికే సభ్యదేశాలు పాటుపడుతున్నట్టు కనబడుతోంది!

ఒకప్పుడు జీ7 మహా శక్తిమంతమైనది. 1980వ దశకంలో ప్రపంచ జీడీపీలో దాని వాటా ఏకంగా 70 శాతం. నిరుడు ఆ వాటా 30 శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంది. ఆర్థిక కార్యకలా పాలు పశ్చిమం నుంచి తూర్పు దిశకు వలసవచ్చి చాన్నాళ్లవుతోంది. ఈ పారిశ్రామిక దేశాలకు చైనా సవాలుగా నిలిచింది. ఆర్థికంగా బలపడుతోంది. 

ఆ దేశానికి జీ7లో చోటు లేదు. అటు రష్యాకు మధ్యలో కొన్నాళ్లు సభ్యత్వం ఇచ్చినా 2014లో క్రిమియాను దురాక్రమించటంతో వెళ్లగొట్టారు. మన దేశం సైతం ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అయినా పరిశీలక హోదాయే తప్ప సభ్యత్వం లేదు. ట్రంప్‌ ఏలుబడి మొదలయ్యాక ప్రపంచ సంస్థలను అమెరికా చిన్నచూపు చూడటం మొదలైంది. భద్రతామండలికి విలువే లేకుండా పోయింది. 

తానే నిర్మించిన డబ్ల్యూటీవోను అమెరికా బేఖాతరు చేస్తోంది. ప్యారిస్‌ ఒప్పందం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికొచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఖాళీని భర్తీ చేయొచ్చన్న ఆలోచనగానీ, అందుకు తగిన ప్రణాళికలుగానీ జీ7 దగ్గర లేవు. ఎంతసేపూ అమెరికా తోకపట్టుకు పోవాలన్న ధోరణే. ట్రంప్‌ మాటలు గమనిస్తే ఆయనకు ప్రధాన ఎజెండా అయిన వాణిజ్యంపై ధ్యాసలేదన్న సంగతి తెలుస్తుంది. 

సదస్సులో ఎక్కువసేపుంటే ఉక్రెయిన్‌ విషయంలో ఒత్తిడి తప్పదన్న భయం వల్లనో, ఇరాన్‌ సంగతి తేల్చాలన్న ఆవేశంతోనో ఆయన మధ్యలోనే నిష్క్రమించారు. వెళ్లేముందు రష్యా దురాక్రమణకు మీరే కారణమంటూ నిందించారు. తమ మాజీ అధ్యక్షుడు ఒబామా, అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్‌ హార్పర్‌లు 2014లో రష్యాను జీ7నుంచి బయటకు నెట్టకపోతే ఇవాళ ఆయన సమావేశాల్లో ఉండేవారని, యుద్ధం ఆపటానికి ఒత్తిడి తెచ్చేవారమని నిష్ఠూరమాడారు. 

అసలు యుద్ధమే వచ్చి వుండేది కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందుకే, ఇక్కడ న్యాయానికి చోటులేదని గ్రహించారో ఏమో... ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం సమావేశాలకు మధ్యలోనే గుడ్‌బై చెప్పారు. నిరుడు జూన్‌లో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్‌కు 5,000 కోట్ల డాలర్ల రుణమిస్తామని తీర్మానించారు. దాని ప్రకారం నెలకు వంద కోట్లు ఉక్రెయిన్‌కు అందించాలి. కానీ ట్రంప్‌ రాకముందే డిసెంబర్‌లోనే అప్పటి అధ్యక్షుడు బైడెన్‌ దానికి కోత పెట్టారు. ఆయనొచ్చాక ఇక చెప్పేదేముంది? ఈ భారాన్ని ఇతర సభ్య దేశాలు మోస్తున్నాయి.  

నిజానికి, గత వైభవం మళ్లీ దక్కాలంటే జీ7 పరిపూర్తి చేయాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు తమ వంతు కృషి అవసరం. కృత్రిమ మేధ, క్వాంటమ్‌లకు కావాల్సిన అత్యంత కీలకమైన ఖనిజాల సరఫరా ఆటంకం లేకుండా చూసుకోవాలి. పటిష్ఠమైన మౌలిక సదుపాయాల కల్పనకూ, యువతకు భారీయెత్తున ఉద్యోగావకాశాలు వచ్చిపడే రంగాలపై దృష్టి సారించాలి. కానీ ఇవన్నీ సాకారం కావాలంటే యుద్ధాలు లేని ప్రపంచం ఉండాలి. 

మరి దానికోసం జీ7 చేసిందేమిటి? ఈ దేశాలన్నీ అమెరికా సాగించిన యుద్ధాల్లో భాగస్వాములుగా మారి చేజేతులా ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసుకున్నాయి. నిజానికి ఇజ్రాయెల్‌ను పూర్వంలా యూరప్‌ దేశాల్లో జనం వెనకేసుకు రావటం లేదు. ఇరాన్‌ అణ్వస్త్రం తయారు చేయటం అనర్థమన్న అభిప్రాయం ఉన్నా ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని ఒప్పించాలని మెజారిటీ జనం భావిస్తున్నట్టు సర్వేల్లో తేలింది. అయినా జీ7 దేశాలకు పట్టదు. 

మనవరకూ చూస్తే ఈ సదస్సు ఎంతో కొంత తోడ్పడిందని చెప్పాలి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత నేరుగా పారిశ్రామిక దేశాధినేతలందరినీ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్‌ తీరు గురించి, దానిపై చర్య తీసుకోక తప్పని పరిస్థితి గురించి వివరించగలిగారు. ఏదేమైనా ఇలాంటి సదస్సులు మొక్కుబడిగా, బాతాఖానీ క్లబ్‌లుగా మారితే ఫలితం ఉండదు. కనీసం వచ్చే సమావేశాల నాటికైనా జీ7 దేశాలు ఈ సంగతి గ్రహించాలి. 

Advertisement
 
Advertisement
Advertisement