బ్రేక్‌ ఇన్‌ ఇండియా

Sakshi Editorial On Exit Of Ford Motor Company From India

వినాయక చవితి అందరిలో ఉత్సాహం నింపి, తీపిని పంచితే, ఆ కార్ల తయారీ కర్మాగార కార్మికులకు మాత్రం చేదువార్త తెచ్చింది. చెన్నై శివార్లలో కళకళలాడుతూ కనిపించే ‘ఫోర్డ్‌’ కార్ల తయారీ కర్మాగారం ఇప్పుడిక మూగబోనుంది. వందల మంది వీధినపడనున్నారు. గుజరాత్‌లో అహ్మదాబాద్‌ సమీపంలోని ఫోర్డ్‌ కర్మాగారంలోనూ అదే పరిస్థితి. పాతికేళ్ళ పాటు భారత్‌లో కార్యకలాపాలు సాగించి, కార్ల తయారీ కర్మాగారాలు రెండు నెలకొల్పి, వందల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టిన అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘ఫోర్డ్‌ మోటార్స్‌’ నష్టాలే తప్ప లాభాలు వచ్చే పరిస్థితి లేదని గ్రహించి, భారత్‌లో కార్ల తయారీకి స్వస్తి పలుకుతోంది. కొన్నేళ్ళ క్రితం జనరల్‌ మోటార్స్‌ (జీఎం), ఇటీవల హార్లే డేవిడ్సన్, ఇప్పుడు ఫోర్డ్‌ మోటార్స్‌ నష్టాల కారణంగా భారత్‌ నుంచి నిష్క్రమణ బాట పట్టడం గమనార్హం. ప్రపంచంలోకెల్లా అయిదో అతి పెద్ద ఆటోమొబైల్‌ మార్కెటైన భారత్‌లో ఇలా ప్రసిద్ధ అమెరికన్‌ కంపెనీలు రాణించలేక చతికిలబడడం ఒక రకంగా విచిత్రం. అనేక విధాలుగా విషాదం. ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదానికి అనూహ్యంగా పడుతున్న బ్రేకులకు నిదర్శనం. దేశంలో నెలకొన్న వ్యాపార వాతావరణానికి నిలువుటద్దం. 

గత పదేళ్ళలో భారత్‌లో దాదాపు 200 కోట్ల డాలర్ల మేర ఫోర్డ్‌ నష్టపోయింది. నిర్వహణ కారణాల వల్లనే ఆ సంస్థ నిష్క్రమిస్తోందనీ, దేశంలో ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌కు ఇదేమీ దెబ్బ కాదనీ సర్కారు ఉవాచ. కానీ, దీని వెనుక గమనించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 తరువాత భారత్‌కు వచ్చిన తొలి అంతర్జాతీయ సంస్థల్లో ఫోర్డ్‌ ఒకటి. వందల కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్టి, ఇక్కడే కార్ల తయారీ సాగించినా, ఫోర్డ్‌ మన మార్కెట్‌లో 2 శాతం కన్నా తక్కువ వాటానే సాధించగలిగింది. మదుపు పెట్టిన ప్రపంచ శ్రేణి సంస్థలకు దేశంలోని అతి షరతులు, అధిక పన్నులతో నమ్మకమే పోతోంది. అవి విసిగిపోతున్నాయనడానికి తాజా ఉదాహరణ ఫోర్డ్‌ నిష్క్రమణ. ఇది ఒక వర్గం విశ్లేషకుల మాట. మరో వర్గం మాత్రం భారత్‌లో సరైన కార్లను తీసుకురాలేని ఫోర్డ్‌ అప్రయోజకత్వం వల్లే ఈ దుఃస్థితి దాపురించిందని వాదిస్తోంది. 

ఈ రెండు వాదనల్లోనూ ఎంతో కొంత నిజం ఉంది. భారత్‌లో కార్ల తయారీ, విక్రయంలోకి దిగిన ఫోర్డ్‌ సంస్థ అనేక పొరపాట్లు చేసింది. భారత వినియోగదారుల నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయింది. భారత మార్కెట్‌లో ప్రధానభాగం చిన్న కార్లదే. ఆ విభాగాల్లో ఫోర్డ్‌ అందిస్తున్న కార్లు పరిమితమే. మారుతి, హ్యుండయ్‌ల వైవిధ్యంతో ఫోర్డ్‌ పోటీపడలేకపోయింది. అయితే, భారతీయ మార్కెట్‌ను వదిలిపెట్టకుండా, మహీంద్రా సంస్థతో సంయుక్త భాగస్వామ్యం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకోవాలనీ ఆ మధ్య ప్రయత్నించింది. అది ఆచరణ సాధ్యం కాలేదు. మరోపక్క అనేక ఇతర ప్రపంచ స్థాయి ఆటోమొబైల్‌ సంస్థల లానే ఫోర్డ్‌ సైతం చిక్కుల్లో పడింది. తగినంత సరఫరాలు లేక అమెరికాలోనే గిరాకీకి తగినంత ఉత్పత్తి చేయలేని పరిస్థితి. మూడేళ్ళుగా భారత ఆర్థికవ్యవస్థ మందకొడిగా ఉంది. ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మునుపటి జోరూ తగ్గింది. 2020 నాటికి దేశంలో 50 లక్షల మేర ప్రయాణికుల కార్ల అమ్మకాలుంటాయని అంచనా వేస్తే, 30 లక్షలలోపునకే పరిమితమైంది.  ఇంకా చేతులు కాల్చుకోవడం అర్థం లేదని బ్రెజిల్‌లో లాగానే ఇక్కడా ఫోర్డ్‌ ఇంటిదారి పడుతోంది.

దేశంలో పెట్టుబడి పెట్టిన అంతర్జాతీయ సంస్థల మనుగడకు అవసరమైన కనీస ప్రయోజనాలను గద్దెనెక్కిన ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. వేసే పన్నుల్లో తేడాలతో సహా మార్కెట్‌ మొత్తం చిన్నకార్లకే అనుకూలంగా మార్చేశాయి. కార్ల వినియోగదారుల, ఉత్పత్తిదారుల సంగతి మన విధాననిర్ణేతలు ఎందుకనో పట్టించుకోనే లేదు. దాంతో, మార్కెట్‌లో 70 శాతం రెండే రెండు సంస్థల చేతిలో ఉంటే, మిగిలిన వాటా కోసం పదికి పైగా సంస్థలు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారంగా మారిన పెట్రోల్‌ ధరలు, ఉద్గారాలపై ప్రభుత్వ విధాన నిర్ణయాలలో పదే పదే మార్పులు, కరోనాతో మూలిగే నక్కపై తాటిపండు పడింది. భారత్‌లో కార్ల తయారీని ఫోర్డ్‌ ఆపేయడం వల్ల దాని కర్మాగారాల్లో పని చేసే నాలుగన్నర వేల మంది దాకా ఉద్యోగులే కాక, ఆ తయారీపై ఆధారపడ్డ అనేక అనుబంధ వ్యాపార వర్గాలు, శ్రామిక వర్గం వీధిన పడక తప్పదు. ఆర్థికవ్యవస్థ అస్తుబిస్తుగా ఉన్న వేళ ఈ ఉద్యోగ, ఉపాధి అవకాశాల నష్టంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరూ తప్పదు. 

గ్యాసోలిన్‌ వాహనాలపై సర్కారు వారి అధిక పన్నుభారం సైతం విదేశీ సంస్థల భాగస్వామ్యానికి పెను సమస్య. ఇప్పుడిక, టెలికామ్‌ లానే, ఆటోమొబైల్‌ రంగంలో కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌ తగినది కాదనే ముద్ర పడిపోతుంది. ప్రభుత్వ విధానలోపాలతో ఈ రెండు రంగాలూ ఏవో రెండు సంస్థలకే పట్టం కట్టే ‘ద్విధాధిపత్యా’నికి చోటిచ్చాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) లేకపోవడం, క్షేత్రస్థాయి పరిస్థితులు – ఇలా అనేక కారణాల వల్ల కనీసం ఆటో, ఆటో అనుబంధ తయారీ కేంద్రంగానైనా భారత్‌ అవతరించ లేకపోయింది. ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మారిపొమ్మంటున్న కేంద్ర వైఖరి వల్ల కార్ల తయారీ సంస్థలకు మరింత సంక్షోభం తప్పదు. అయితే, రేపు ఎలక్ట్రిక్‌ వాహనాల శకం వచ్చినా ఇటు బ్యాటరీలు, అటు చిప్‌ల తయారీదార్లను దేశంలోకి ఆకర్షించలేకపోతే, దేశ ఆర్థికానికి ఒరిగేదేమీ లేదు. నిజానికి, 1990లు, 2000ల కాలంలో మన దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగాల కల్పనకు తోడ్పడ్డ కొద్ది రంగాల్లో ఆటోమొబైల్‌ రంగం ఒకటి. అందులోనే ఇప్పుడు ఆకర్షణను పోగొట్టుకుంటే, లోపం మన విధానాల్లోనూ ఉన్నట్టేగా! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top