చేజేతులా... చిక్కుల్లో!

Sakshi Editorial Britain Liz Truss Tax Cuts Mini Budget

బోరిస్‌ జాన్సన్‌ స్థానంలో పగ్గాలు చేపట్టి నిండా నలభై రోజులు కాకుండానే బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ పదవి చిక్కుల్లో పడింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే, అధిక ఆదాయం ఉన్నవారికి పన్నులు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఇది. కన్జర్వేటివ్‌ పార్టీలోనూ, ఆర్థిక విపణుల్లోనూ ఆమె కష్టాల కడలి నుంచి గట్టెక్కడం సులభం కాదనే పరిస్థితి వచ్చింది. చెలరేగిన విమర్శలతో లిజ్‌ గత శుక్రవారం తన ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్తెంగ్‌ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఆయన ప్రవేశపెట్టిన ‘మినీ బడ్జెట్‌’లోని ఆర్థిక ప్యాకేజీ అంశాలను కొత్త ఆర్థికమంత్రి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇది సంచలనమే! పన్నుల్లో కోతలపై లిజ్‌ వెనక్కితగ్గడం తాత్కాలిక ప్రశాంతతను తేవచ్చు. కానీ, పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడానికీ, దేశాన్ని ఆర్థిక పురోగతి పథంలో నడిపించడానికీ ఇది సరిపోతుందా? 

సెప్టెంబర్‌ 23న లిజ్, అప్పటి ఆమె సహచర ఆర్థిక మంత్రి చేపట్టిన మితవాద పక్ష ప్రణాళిక ఎదురుతన్నింది. 1980లలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ స్ఫూర్తితో 4500 కోట్ల పౌండ్ల (5 వేల కోట్ల డాలర్లు) మేర పన్నుల్లో కోతలు విధించారు. దానికి స్పందనగా విపణులు కుప్పకూలాయి. లక్షలాది బ్రిటన్‌ పౌరులకు అప్పుల ఖర్చు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ విజయావకాశాలు పడిపోయాయి. లిజ్‌ పగ్గాలు చేపట్టి కొద్దివారాలైనా గడవక ముందే సొంత పార్టీలో బాహాటంగా అసంతృప్తి అగ్గి రాజుకుంది. చిత్రమేమిటంటే, లిజ్‌ ఆర్థిక అజెండాను సాక్షాత్తూ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సైతం విమర్శించడం! నాటకీయ పరిస్థితుల్లో సొంత స్నేహితుడిని ఆర్థిక మంత్రిగా తప్పించాల్సి రావడం బాధాకరమేనని లిజ్‌ సైతం అంగీకరిస్తున్నారు.

నిజానికి, విమర్శలతో వెనక్కి తీసుకున్న ఆ ఆర్థిక ప్యాకేజీ రూపకర్తల్లో లిజ్‌కూ సమాన భాగం ఉంది. కాకపోతే ఆర్థికమంత్రి బలిపశువయ్యారు. కొత్తగా ఆ శాఖ చేపట్టిన జెరెమీ హంట్‌ పని కత్తి మీద సామే. బ్రిటన్‌ దేశస్థులను వేధిస్తున్న జీవన వ్యయానికి పరిష్కారం చూపడం పెద్ద పనే. ఈ అక్టోబర్‌ 31న కొత్త బడ్జెట్‌ ప్లాన్‌ను దేశానికి ఆయన అందించాల్సి ఉంటుంది. దేశంలో మరింత ఆర్థిక కష్టాలు తప్పవన్న విశ్లేషణల నేపథ్యంలో, గడ్డు పరిస్థితులను ప్రజలతో నిజాయతీగా పంచుకొని, కఠినమైన కార్యాచరణకు దిగక తప్పదు. గతంలో కార్పొరేషన్‌ ట్యాక్స్‌ను 19 శాతం వద్దే స్తంభింప జేస్తామన్న లిజ్‌ వచ్చే ఏడాది దాన్ని 25 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. 

మరోపక్క ఇప్పటికే లిజ్‌ సొంత పార్టీ నుంచే కనీసం నలుగురు ఎంపీలు ఆమెను ప్రధాని పీఠం నుంచి దిగిపోవాల్సిందిగా బాహాటంగా అన్నారు. ఆరు వారాలకే ఆమె పదవీకాలం దాదాపు ముగింపునకు వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆమె తప్పుకొంటే వారసుడు నిర్ణయమయ్యే దాకా పదవిలో కొనసాగుతారు. అదే జరిగితే, రెండు నెలల లోపలే రెండోసారి కన్జర్వేటివ్‌ పార్టీ సారథికి ఎన్నిక తప్పదు. అయితే, ఈసారి సుదీర్ఘ పోటీ లేకుండా ఒకరి వెంటే పార్టీ నిలిచి, పట్టాభిషేకం చేయవచ్చు. బ్రెగ్జిట్‌ రిఫరెండమ్‌ పర్యవసానాల తర్వాత 2016లో డేవిడ్‌ కామెరాన్‌ స్థానంలో థెరెసా మే అలానే వచ్చారు. కానీ, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అనేక వర్గాలుగా చీలి, అంతర్గత విభేదాలున్న పార్టీలో అది సాధ్యమా అన్నది చూడాలి. 

పరిస్థితి చూస్తుంటే, ప్రధాని పదవికి లిజ్‌తో పోటీపడి, తగిన మద్దతు కూడగట్టుకోలేకపోయిన సొంత పార్టీ నేత రిషీ సునాక్‌కు ఉన్నట్టుండి దశ తిరిగేలా కనిపిస్తోంది. లిజ్‌ స్థానంలోకి రేపో, మాపో ఆయన వస్తారనే అంచనాలూ సాగుతున్నాయి. ప్రస్తుతానికి రిషి పెదవి విప్పడం లేదు. అంచనాలెలా ఉన్నా లిజ్‌ అంత తేలిగ్గా రాజీనామా చేయకపోవచ్చు. ప్రస్తుతానికి ఆమె దృష్టి సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోవడం మీదే ఉన్నట్టుంది. ఒకవేళ లిజ్‌ను బలవంతాన సారథ్యం నుంచి తప్పించాలంటే, అవిశ్వాస తీర్మానం పెట్టాలి. కానీ, 12 నెలల కాలంలో ఒకసారే పోటీ జరగాలనే కన్జర్వేటివ్‌ పార్టీ నియమావళి ప్రకారం కొత్తగా ఎన్నికైన నేతపై సహచరులు అవిశ్వాస తీర్మానం పెట్టలేరు. 
వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా, తొందరపాటు మినీ బడ్జెట్‌ ప్రతిపాదనలతో విశ్వసనీయత దెబ్బతిన్న లిజ్‌ ప్రస్తుత గండం నుంచి గట్టెక్కితే ఆశ్చర్యమే. కాకపోతే ఆ ఆర్థిక ప్రతిపాదనల ఉప సంహరణతో ఆర్థిక మార్కెట్లు కొంత తెరిపినపడ్డాయి. కొద్దిపాటి ఆర్థిక స్థిరత్వంతో ఊపిరి పీల్చుకొనే ఖాళీ దొరికింది గనక ఇప్పుడామె ఏవైనా అద్భుతాలు చేయాలి. సోమవారం రాత్రి క్యాబినెట్‌కిస్తున్న విందులో పార్టీలోని అసంతృప్త వర్గాలను కలిసి ఆమె చల్లబరిచే ప్రయత్నం చేస్తారు. మరో ఛాన్స్‌ ఏమిటంటే, 2025 జనవరిలో జరగాల్సిన బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలను ముందే జరపడం. ఎన్నికల సర్వేలలో కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా ప్రధాన ప్రతిపక్షం లేబర్‌ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నవేళ అధికార పార్టీ ఎంపీలు ఆ సాహసానికి దిగుతారనుకోలేం.   

తప్పుడు రాజకీయ నిర్ణయాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయనడానికి బ్రిటన్‌ తాజా ఉదాహరణ. కోవిడ్‌ టీకాలు, కరోనా వేళ విందులతో పార్టీ ప్రతిష్ఠనూ, వచ్చే ఎన్నికల్లో విజయావకా శాలనూ జాన్సన్‌ దిగజారిస్తే, ఆశాకిరణమనుకున్న లిజ్‌ తప్పుడు విధానాలతో అసలే ఆర్థిక సంక్షో భంలో ఉన్న దేశాన్ని ఇంకా కిందకు నెట్టారు. ద్రవ్యోల్బణాన్నీ, యుద్ధంతో పైపైకి ఎగబాకుతున్న చమురు ధరల్ని అడ్డుకొనే చర్యలకు బదులు పన్నుల కోతకు దిగారు. తీరా చివరికి కోతల్ని ఉపసంహ రించుకొని,  ఎన్నడూ లేని ‘యూ’ టర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది. లిజ్‌ పుణ్యమా అని పాత అప్రతిష్ఠకు తోడు అసమర్థ ప్రభుత్వమనే ముద్ర పడింది. కథలో కొత్త మలుపు ఏమిటన్నది ఆసక్తిగా మారింది.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top