మహిళలపై అవాక్కులు!

Sakshi Editorial Article On Bengal Bjp Chief Dilip Ghosh

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారంటే సాధారణ పౌరులు బెంబేలెత్తే పరిస్థితులొచ్చాయి. ఎన్నికల ప్రచారసభల్లో, మీడియా సమావేశాల్లో, ర్యాలీల్లో, సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకులు ఎలాంటి దుర్భాషలతో విరుచుకుపడతారో, ఏం వినవలసివస్తుందోనన్న భయాందోళనలు కలుగుతున్నాయి. మహిళలనూ, అట్టడుగు కులాలవారినీ కించపరుస్తూ మాట్లాడే నేతల పరువు ఎటూ పోతుంది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆ వ్యాఖ్యలు వైరల్‌ అవుతూ దేశ పరువుప్రతిష్టలు సైతం దెబ్బతింటున్నాయి.

తాజాగా పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ మాదిరే వున్నాయి. తన కాలికి అయిన గాయాన్ని ప్రదర్శించదల్చుకుంటే ఆమె చీరెకు బదులు బెర్ముడా షార్ట్‌లు ధరించాలని ఆయనగారు సలహా ఇచ్చారు. ఈ నెల 10న నందిగ్రామ్‌ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఆమె కాలికి గాయమైంది. రెండు రోజులు ఆసుపత్రిలో వుండి వచ్చారు. అప్పటినుంచీ ఆమె గాయానికి కట్టుతోనే చక్రాల కుర్చీలో కూర్చుని ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. కారు డోరు తీసుకుని వుండగా కొందరు దుండ గులు దాడి చేయటానికి ప్రయత్నిస్తున్న సమయంలో కాలు ఇరుక్కుని గాయమైందని ఆమె వివరణ నిచ్చారు.

ఇదంతా సానుభూతి పొందటానికి ఆడుతున్న డ్రామా అని బీజేపీ కొట్టిపారేసింది. గాయమైందంటే కనీసం సానుభూతి ప్రకటించటానికి కూడా సిద్ధపడలేదన్న విమర్శలొచ్చాయిగానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాతావరణాన్ని ఆశించలేం. అది లేకపోగా హద్దు మీరి వస్త్రధార ణపై సలహా ఇచ్చేవరకూ పోయిందంటే ఎన్నికల ప్రచార సరళి రాను రాను ఎలా దిగజారుతున్నదో అర్థం చేసుకోవచ్చు.మమతా బెనర్జీ ప్రస్తుతం దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి. ప్రత్యర్థులపై నిప్పులు చెరగటం ఆమె నైజం. అలా మాట్లాడటం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ విమర్శ ఆ అంశానికి పరిమితం కావాలి తప్ప కించపరిచేలా మాట్లాడటం సరికాదు. దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్య అసభ్యకరంగా వున్నదని విమర్శలొస్తే ఆయన మరింత హీన స్థాయిలో మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమె బెంగాల్‌ సంస్కృతిని ప్రతిబింబించేలా వ్యవహరించాలట. చీరె ధరించిన మహిళ కాళ్లు చూపటం సభ్యత కాదట. తన మాటల్లో వివాదమేమీ లేదని, వాటిపై వివరణనివ్వాల్సిన అవసరం లేదని దిలీప్‌ ఘోష్‌ అభిప్రాయం. ఆయన అయిదేళ్లక్రితం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదా స్పదుడయ్యారు. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్థినులనుద్దేశించి ‘వారు మగపిల్లల సాహచర్యం కోసం దొరికే ఏ అవకాశాన్ని వదులుకోని సిగ్గుమాలిన వార’ంటూ వ్యాఖ్యానించారు. 2019 ఆగస్టులో ‘నేను చంపటం మొదలెట్టానంటే తృణమూల్‌ కార్యకర్తల కుటుంబాలు తుడిచిపెట్టుకుపోతాయ’ న్నారు. వాస్తవానికి ఇలాంటి ధోరణి ఏ ఒక్క పార్టీకో, నాయకుడికో పరిమితమైంది కాదు.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ నేత ఆజంఖాన్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి జయప్రదనుద్దేశించి 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత గోపాల్‌ షెట్టి తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి ఊర్మిళా మంటోద్కర్‌ విషయంలో ఇదే మాదిరి మాట్లాడారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపైనా ఆ ఎన్నికల్లో మహారాష్ట్ర పీపుల్స్‌ రిపబ్లికన్‌ పార్టీ నేత జయదీప్‌ కవాడే ఇలాగే వ్యాఖ్యానించారు. ఆమె నుదుటన ధరించే సిందూరం పెద్దగా వుండటాన్ని ప్రస్తావిస్తూ ‘భర్తల్ని మార్చినప్పుడల్లా ఆ సిందూరం పరిమాణం పెరుగుతుంటుంద’న్నారు. చిత్రమేమంటే పురుషులు మాత్రమే కాదు... మహిళా నేతలు సైతం తోటి మహిళలపట్ల ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు.

గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగుపడి వుండొచ్చుగానీ... పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మహిళలు భిన్న రంగాల్లో చొరవగా ముందుకు రావటం మన దేశంలో ఇప్పటికీ తక్కువే. అన్నిచోట్లా గూడుకట్టుకున్న పితృస్వామిక భావజాలమే ఇందుకు కారణం. సైన్యంలో పనిచేసే మహిళలకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలన్న పిటిషన్‌పై తీర్పునిస్తూ, మన సమాజంలోని అన్ని రకాల నిర్మాణాలూ పురుషుల కోసం పురుషులే ఏర్పాటుచేసుకున్నవని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. మహిళల వస్త్ర ధారణ ఎలావుండాలో, వారెలా మెలగాలో, ఎలా మాట్లాడాలో చెప్పేవారంతా ఇలాంటి పితృస్వామిక భావజాల ప్రభావంతోనే మాట్లాడుతున్నారు.

అందుకోసం సంస్కృతిని అడ్డం పెట్టుకుంటున్నారు. రాజకీయ రంగంలోవున్నవారిని సమాజం గమనిస్తుంటుంది గనుక వారి ప్రవర్తన, భాష ఇతరులకు ఆదర్శప్రాయంగా వుండాలి. దేశ రాజకీయాల్లో మహిళలు కూడా ఇప్పుడిప్పుడే చురుగ్గా వుంటున్నారు. రాష్ట్రపతి, విదేశాంగమంత్రి, రక్షణమంత్రి వంటి పదవులు చేపట్టి తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి కూడా మహిళే. కానీ కొందరు రాజకీయ నాయకులు చవకబారు వ్యాఖ్యలు చేసి తమను తాము దిగజార్చుకోవటమే కాదు... సమాజానికి కూడా తప్పుడు సంకేతాలు పంపుతున్నారు.

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురువారం ఒక సదస్సులో ప్రసంగిస్తూ ప్రజలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, వారు ఏం తినాలో, వ్యక్తులుగా వారేం చేయాలో చెప్పే ధోరణి రాజకీయ నాయకులకు తగదన్నారు. దిలీప్‌ ఘోష్‌ అయినా, మరొ కరైనా ఈ విషయాన్ని గుర్తెరగాలి. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top