స్వయంకృతాపరాధం!

Bengaluru Is Struggling With Floods And Heavy Rainfall - Sakshi

చేసిన పాపం... శాపంగా మారడమంటే ఇదే! పట్టణాభివృద్ధి పేరిట కొన్నేళ్ళ విశృంఖలత్వానికి ఫలితం ఇప్పుడు భారత సాఫ్ట్‌వేర్‌ రాజధాని బెంగళూరులో కనిపిస్తోంది. వరుసగా రెండురోజులు రాత్రివేళ కురిసిన వర్షాలతో ప్రాథమిక పౌర వసతుల వ్యవస్థ కుప్పకూలి, అతలాకుతలమైన మహానగరం అంతర్జాతీయ వార్తగా మారింది. సంపన్నులు నివసించే ఖరీదైన ప్రాంతాలు సైతం నీట మునిగిపోయాయి. చుట్టూ నీళ్ళున్నా, అనేకచోట్ల రెండు రోజులుగా తాగునీరు రాని దుఃస్థితి. కరెంట్‌ కోత సరేసరి. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కోటీశ్వరులు సైతం పడవల్లో విలాస వంతమైన విల్లాలు వదిలి పోయిన పరిస్థితి. ప్రపంచ శ్రేణి సంస్థలు, వ్యాపారాలకు నెలవైన నగరంలో కనీస పౌర వసతులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే, వర్షాలు ఆగి, గంటలు గడిచినా పలు ప్రాంతాలు ఇప్పటికీ నడుము లోతు నీళ్ళలో నిస్సహాయంగా నిరీక్షిస్తున్నాయి. పట్టణ ప్రణాళిక లోపభూయిష్ఠమై, రియల్‌ ఎస్టేట్‌ దురాశ పెరిగితే, వాతావరణ మార్పుల వేళ మన నగరాలకు సంక్షోభం తప్పదని మరోసారి గుర్తుచేస్తున్న ప్రమాద ఘంటిక ఇది. 
వరుస వర్షాలతో బెంగళూరులోని కీలక ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)లో ప్రయాణ, వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ‘భారత సిలికాన్‌ వ్యాలీ’లోని ఆ రోడ్డులోనే మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మోర్గాన్‌ స్టాన్లీ లాంటి బడా అంతర్జాతీయ సంస్థల ఆఫీసులన్నీ ఉన్నాయి. వాన నీటితో అంతా స్తంభించి, స్థానికంగా కోట్ల రూపాయల మేర ఉత్పత్తి పడిపోయింది. రోడ్లపై నీళ్ళు నిలిచిపోవడంతో బడా బడా సీఈఓలు సైతం చివరకు ట్రాక్టర్లు ఎక్కి వచ్చిన పరిస్థితి. ఆధునిక టెక్నాలజీ కారిడార్‌లోనే ప్రాథమిక వసతులు ఇలా పేకమేడలా ఉన్నాయంటే, మిగతా నగరంలో ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఆదివారం నాటి వర్షపాతం బెంగళూరు చరిత్రలోనే సెప్టెం బర్‌లోకెల్లా మూడో అతి భారీ వర్షపాతమని నిపుణుల మాట. అందుకు తగ్గట్టుగా పౌర వసతులను తీర్చిదిద్దుకోకపోవడమే పెను సమస్య.

బెంగళూరులోని మొత్తం 164 చెరువులూ నిండిపోయాయి. ఇంత భారీ వర్షాల తర్వాతా పాత బెంగళూరు నిలకడగా ఉన్నా, వైట్‌ఫీల్డ్, సాఫ్ట్‌వేర్‌ ఆఫీసులకు నెలవైన ఖరీదైన కొత్త బెంగళూరు ప్రాంతం చిక్కుల్లో పడడం తప్పు ఎక్కడ జరిగిందో చెబుతోంది. ప్రస్తుత దుఃస్థితికి పాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణమని బీజేపీ, ప్రస్తుత కాషాయ ప్రభుత్వ అసమర్థత – అవినీతి మూలమని కాంగ్రెస్‌ పార్టీ పరస్పర నిందారోపణల్లో పడ్డాయి. నిజానికి, ఈ తిలాపాపంలో తలా పిడికెడు భాగం ఉంది. రెండు నదుల మధ్య లోయలా, అనేక చెరువులు, నీటి పారుదల వ్యవస్థలు, ఉద్యానాలు నిండిన నగరం బెంగళూరు. ఐటీ విజృంభణతో పట్టణాభివృద్ధి పేరిట ఇష్టారాజ్యంగా చేసిన భవన నిర్మాణాలు చెరువులను ఆక్రమించాయి. నీటి పారుదలను అడ్డగించేశాయి. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన నగర పాలక సంస్థ, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు కళ్ళు మూసుకొని, భవన నిర్మాతల అత్యాశను అనుమతించారు. చివరకు పకడ్బందీ ప్రణాళిక లేని మైసూరు – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం సైతం పౌర వసతులపై ఒత్తిడి పెంచేస్తుండడం విషాదం. 

నిజానికి, ఇది ఒక్క బెంగళూరు పరిస్థితే కాదు. పట్టణ ప్రణాళికలోని లోపాలు, నియమ నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం, అధికారుల అలసత్వం, పెను వాతావరణ మార్పులతో తలెత్తిన సంక్షోభం – ఇవన్నీ మన దేశంలోని అనేక నగరాలను పట్టి పీడిస్తున్నాయి. వాటి ఫలితం 2005లో ముంబయ్, 2015లో చెన్నై, 2016లో గురుగ్రామ్, 2020లో హైదరాబాద్, 2021లో కోల్‌కతా, ఢిల్లీ – ఇలా అనేకచోట్ల చూశాం. కొండలు గుట్టల్ని మింగేసి, చెరువుల్ని కబ్జా చేస్తే భారీ వర్షం కురిసినప్పుడల్లా ‘ఆకస్మిక వరదలు’ తప్పవని హైదరాబాద్, చెన్నై సహా అన్నీ పదే పదే గుర్తుచేస్తున్నాయి. ఇప్పటికీ శరవేగంతో సాగుతున్న పట్టణీకరణ వల్ల నగరాలపై భారం పెరుగు తోంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలైన మన నగరాలు మరో దశాబ్దంలో ప్రతి 10 మంది భారతీయుల్లో నలుగురికి ఆవాసమవుతాయని అంచనా. ఈ పరిస్థితుల్లో పదే పదే ముంచెత్తుతున్న వరదలు, వాతావరణ మార్పుల రీత్యా ఇటు అభివృద్ధితో పాటు, అటు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని తీరాలి. పటిష్ఠమైన అభివృద్ధి, పర్యావరణ రక్షణ ప్రణాళిక లేకపోతే, కొన్నేళ్ళుగా వివిధ నగరాల్లో చూస్తున్న వరదలు, ఉష్ణతాపాలు అన్నిచోట్లా నిత్యకృత్యమవుతాయి.

ఇకనైనా పరిస్థితులు మారాలంటే, పట్టణాలలో కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి. చెరువులు, నదీతీరాల్లో ఆక్రమణలను అడ్డగించాలి. పంటలు పండే మాగాణి నేలల్నీ, పర్యావరణానికి కీలకమైన మడ అడవుల్నీ రియల్‌ ఎస్టేట్‌ మూర్ఖత్వానికి బలి చేస్తే, దాని దుష్ఫలితం అనుభవిస్తామని గ్రహిం చాలి. ఇవాళ్టికీ అనేక నగరాల్లో బ్రిటీషు కాలం నాటి ఏర్పాట్లే ఉన్న మనం వర్షపు నీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులనూ, వాటి నుంచి నీళ్ళు పోయే మార్గాలనూ కాపాడుకోవాలి. అంతులేని ఆశతో, అజ్ఞానంతో వాటిని ధ్వంసం చేస్తే, మన చెత్తతో వాటిని నింపేస్తే ఆనక తాజా బెంగళూరు లాంటి అనుభవాలతో చింతించాల్సి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే, పాలకుల్లో నిజాయతీ, చిత్తశుద్ధి ముఖ్యం. అన్నీ సవ్యంగా ఉంటేనే అప్పుడది సుపరిపాలన. ప్రభుత్వాలు అది గుర్తించాలి. చైతన్యవంతమైన పౌర సమాజం సైతం తన వంతుగా బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రయోజనం. ‘నమ్మ బెంగళూరు’ చెబుతున్న పాఠం ఇదే!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top