కూటమి కట్టి..
చెరువును చెరబట్టి..
● కోరుమామిడి ఆవ చెరువులో
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
● 7 రోజులు.. 2 వేల క్యూబిక్
మీటర్ల తవ్వకాలకే అనుమతి
● రోజూ వందల లారీలు,
ట్రాక్టర్లలో తరలింపు
● రూ.లక్షలు కొల్లగొడుతున్న అక్రమార్కులు
నిడదవోలు రూరల్: ‘కూటమి’ కట్టిన అక్రమార్కులు చెరువును చెరబట్టారు.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా యంత్రభూతాలతో తూట్లు పొడుస్తూ దొరికినంతా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను అడ్డం పెట్టుకుని.. ఇష్టానుసారం గోతులు పెట్టేస్తున్నారు. అనుమతికి మించి మట్టిని తవ్వి, తరలించేసి, రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. వివరాలివీ..
నిబంధనలను చెరువులో తొక్కి..
నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన మట్టపర్తి రవిచంద్రం భార్య సుజాత తన పొలాన్ని మెరక చేసేందుకు మట్టి కావాలంటూ ఇరిగేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గ్రామ శివారున ఉన్న ఆవ చెరువులో రెండు వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఏడు రోజుల పాటు మాత్రమే తవ్వుకోడానికి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ఇరిగేషన్ డీఈ ఈ నెల పదకొండో తేదీన ఆదేశాలిచ్చారు. ఇదే అదునుగా కూటమి నేతలు మట్టి మాఫియా అవతారమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్లతో చెరువును విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ఆ మట్టిని భారీ వాహనాల్లో తరలిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. వాస్తవానికి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి మాత్రమే చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపట్టాలి. ఆ మట్టిని గట్లను పటిష్టపరచడానికి, గ్రామంలోని అభివృద్ధి పనులకు, లోతట్టు ప్రాంతాలను చదును చేసేందుకు మాత్రమే వినియోగించాలి. కానీ, కూటమి నేతలు నిబంధనలను తుంగలో తొక్కి, చెరువులోని మట్టిని ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత కుమారుడి కనుసన్నల్లో 5 పొక్లెయిన్లతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. సుమారు 50 లారీలు, ట్రాక్టర్లతో వందలాది ట్రిప్పులు వేస్తూ నరసాపురం, భీమడోలు, ఏలూరు పరిసర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు. లారీకి రూ.3 వేల నుంచి రూ.4 వేలు, ట్రాక్టర్ మట్టికి రూ.800 నుంచి రూ.1,000 వరకూ ఇటుక బట్టీలకు, ఇతర ప్రాంతాల్లోని లే అవుట్లకు విక్రయిస్తున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలుండటంతో అడ్డూ అదుపూ లేకుండా మట్టి కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మట్టి దోపిడీ మళ్లీ మొదలు
గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పథకం కింద చెరువుల అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లకు టెండర్ల పద్ధతిలో కట్టబెట్టగా.. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ నేతలే ఈ పనులు చేపట్టి మట్టి దోపిడీకి పాల్పడేవారు. మళ్లీ రెండేళ్లుగా అధికారంలో ఉండటంతో ఇప్పుడు కూటమిగా ఏర్పడి టీడీపీతో పాటు జనసేన నాయకులు మట్టి దోపిడీ మొదలు పెట్టేశారు.
కన్నెత్తి చూడని అధికారులు
ఆవ చెరువు అభివృద్ధి పనులను ఎర్రకాలువ ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. రైతుల పొలాలను మెరక చేసేందుకు మాత్రమే అనుమతులిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ, ఆ ముసుగులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు, అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కళ్లెదుటే అక్రమంగా మట్టిని తరలిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. కూటమి నేతల ఒత్తిళ్లతో ఈ వ్యవహారం తమ పరిధిలోనిది కాదని, ఇరిగేషన్ అధికారులదేనని చెబుతూ స్థానిక రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికైనా మట్టి అక్రమ తవ్వకాలకు, తరలింపునకు అడ్డుకట్ట వేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మట్టి తవ్వకాలకు నిబంధనలివీ..
మట్టి తవ్వుతున్న ప్రాంతం నుంచి తరలించే వరకూ ఎక్కడా ఎవరి నుంచీ ఎలాంటి అభ్యంతరాలూ ఉండకూడదు.
వ్యవసాయ భూముల్లోని మట్టిని తవ్వి, తరలించాలంటే రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి.
మెరక భూముల నుంచి మట్టిని తవ్వి, తరలించాలంటే గనుల శాఖ అధికారుల నుంచి అనుమతి ఉండాలి.
మోటారు వాహన చట్టం ప్రకారం మట్టి తరలించే వాహనానికి అన్ని అనుమతులూ ఉండాలి. డ్రైవర్‌కు లైసెన్స్ తప్పనిసరి.
మట్టి గడ్డలు బయటకు కనిపించకుండా బరకాలు కప్పి తరలించాలి. మట్టి రవాణా వల్ల రహదారులు దెబ్బ తింటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవచ్చు.
భూమి మార్పిడికి రైతులు తప్పనిసరిగా రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి.


