● జోరందుకోని పొగాకు మార్కెట్
● నాణ్యత దెబ్బ తింటుందని
రైతుల ఆందోళన
● ఇప్పటి వరకు 18.12 లక్షల
కిలోల విక్రయాలు
దేవరపల్లి: పొగాకు మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. కొనుగోళ్లు ప్రారంభించి 50 రోజులు కావస్తున్న గిట్టుబాటు ధర రాకపోవడంతో సన్న, చిన్నకారు, కౌలు రైతులు నలిగిపోతున్నారు. సాగు పెట్టుబడికి తెచ్చిన అప్పుల వడ్డీలు పెరుగుతూండటం, బంటాలకు సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆందోళన చెందుతున్నారు. అప్పుల భారం పెరిగిపోవడంతో చిన్న రైతులు అయినకాడికి అమ్మి, సొమ్ము చేసుకుని, ఆకు రెలుపు, క్యూరింగ్ బంటాలకు, గ్రేడింగ్ కూలీలకు సరిపెడుతున్నారు. క్యూరింగ్‌లు పూర్తి కావడంతో రైతులు గ్రేడింగ్ చేసి వర్జీనియా పొగాకును మండెలు వేసి, నిల్వ చేశారు. అయితే, మండెల్లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల పొగాకు రంగు మారి, నాణ్యత దెబ్బ తింటుందని ఆందోళన చెందుతున్నారు. ఈ ఒడ్డున పడటం కష్టమేనని పలువురు పొగాకు రైతులు అంటున్నారు.
రూ.473.03 కోట్ల పొగాకు అమ్మకం
ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు మార్చి 25న ప్రారంభించారు. రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.473.03 కోట్ల విలువైన 18,12,397 కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. వేలం కేంద్రాలకు శనివారం 633 బేళ్లు అమ్మకానికి రాగా, 317 తిరస్కరించి, 316 కొనుగోలు చేశారు. వేలానికి తెస్తున్న బేళ్లలో 50 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 87 బేళ్లకు 65, జంగారెడ్డిగూడెం–1లో 170కి 84, జంగారెడ్డిగూడెం–2లో 123కు 64, కొయ్యలగూడెంలో 135కు 45, గోపాలపురం వేలం కేంద్రంలో 118 బేళ్లకు గాను 58 మాత్రమే కొనుగోలు చేశారు. మొత్తం 25 కంపెనీలకు గాను, 12 కంపెనీలు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వగా, వీటిలో ఆరు కంపెనీలు వేలంలో పాల్గొని మొక్కుబడిగా బేళ్లను కొనుగోలు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేలం కేంద్రాల వారీగా ఇప్పటి వరకు
జరిగిన పొగాకు కొనుగోళ్లు
వేలం కేంద్రం విక్రయాలు గరిష్ట ధర సగటు ధర
(కిలోలు) (రూ.) (రూ.)
దేవరపల్లి 2,78,369 265 262.86
జంగారెడ్డిగూడెం–1 5,00,280 265 261.00
జంగారెడ్డిగూడెం–2 3,70,340 265 261.49
కొయ్యలగూడెం 2,98,364 265 259.69
గోపాలపురం 3,65,041 265 261.44
కొనుగోలు సంస్థలు రాక..
టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లోని పలువురు రైతుల నుంచి బడా కంపెనీలు సుమారు లక్ష కిలోల పొగాకును సేకరించి, నెల రోజుల క్రితం విదేశీ కొనుగోలు సంస్థలకు శాంపిల్స్ పంపించాయి. అయినప్పటికీ ఇంతవరకూ ఎగుమతి ఆర్డర్లు రాలేదు. పంట కొనుగోలుకు కొనుగోలు సంస్థలు ముందుకు రావడం లేదని సమాచారం. ఒకవైపు కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగియకపోవడం, విదేశీ కస్టమర్ల నుంచి ఆర్డర్లు ఖరారు కాకపోవడం వంటి కారణాలతో మన ప్రాంతంలోని పొగాకు కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.


