కడియం: ముంబై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ సునీల్ శుక్రే కుటుంబ సమేతంగా కడియం నర్సరీలను సందర్శించారు. అక్కడి వైవిధ్యభరితమైన మొక్కలను ఆసక్తిగా తిలకించారు. తొలుత నర్సరీకి చేరుకున్న జస్టిస్ శుక్రేకు రైతులు పి.వెంకటేష్, వినయ్ బోన్సాయ్ మొక్కను అందించి స్వాగతం పలికారు. ప్రకృతి పరిరక్షణలో నర్సరీల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా జస్టిస్ శుక్రే చెప్పారు.
పుట్టినప్పుడేనా..
ఏటా డబ్బులిస్తారా?
● జనాభా పెంచాలనడం
చంద్రబాబు పిచ్చి సూత్రం
● ఎమ్మెల్యే పండుల రవీంద్రబాబు
కాకినాడ రూరల్: మూడో, నాలుగో సంతానాన్ని కంటే డబ్బులిస్తామని ప్రకటించిన చంద్రబాబు.. వాటిని బిడ్డ పుట్టినప్పుడు మాత్రమే ఇస్తా రా లేక ప్రతి ఏటా ఇస్తారా అని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు నిలదీశారు. కాకినాడలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పేద కుటుంబంలో మూడు నాలుగుసార్లు గర్భం ధరించే తల్లుల బాధలు చంద్రబాబుకు పట్టవా అని ప్రశ్నించారు. ఇద్దరు పిల్లల్ని కనడమే కష్టమైన పేదలకు.. అదనంగా పిల్లలను కనడం ఇంకెంత కష్టమో తెలియదా అని నిలదీశారు. పేదరికంలో ఉన్న తల్లుల్లో 40 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారని, పిల్లల్ని కంటే వారి ఆరోగ్య పరిస్థితి మాటేమిటని ప్రశ్నించారు. రూ.30 వేలు, రూ.40 వేల కోసం పిల్లల్ని కంటే తరువాత వారిని ప్రభుత్వం చూస్తుందా అని మండిపడ్డారు. జనాభా పెంచాలనడం చంద్రబాబు పిచ్చి సూత్రమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా పిల్లల్ని కనండనడంలో శాసీ్త్రయత లేదన్నారు. అశాసీ్త్రయమైన సిద్ధాంతాలను వ్యాప్తి చేసి ప్రజలను అయోమయానికి గురి చేయొద్దని కోరారు. ‘మూడో, నాలుగో సంతానం సూత్రాన్ని మీ కుటుంబంలో లోకేష్‌కు ఎందుకు చెప్పరు’ అని ప్రశ్నించారు. అలా కంటే లోకేష్ అందరికీ ఆదర్శంగా ఉంటారని రవీంద్రబాబు చెప్పారు.
సీతారాములకు ప్రత్యేక సింహాసనం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణానికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించే క్షేత్ర పాలకులు సీతారాములకు ఎట్టకేలకు ప్రత్యేక సింహాసనం సమకూరింది. ఆలయ అర్చకుడు కంచిభట్ల రామ్‌కుమార్ సీతారాముల కోసం రూ.50 వేలతో టేకు సింహాసనాన్ని తయారు చేయించి, ఈఓ నల్లం సూర్యచక్రధరరావుకు ఆదివారం అప్పగించారు. సత్యదేవుని నిత్యకల్యాణం సమయంలో ఒకే సింహాసనంపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను, వారి దిగువన సీతారాముల విగ్రహాలను ఉంచి కల్యాణం నిర్వహించేవారు. దీంతో, సత్యదేవుడు, అమ్మవారికి పోసే తలంబ్రాలు దిగువన ఉన్న సీతారాముల విగ్రహాల మీద పడేవి. పెళ్లిపెద్దలను ప్రత్యేకంగా గౌరవించాలే తప్ప ఇలా చేయడం అపచారమని భక్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని 2024 జూన్‌లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు అప్పటి ఈఓ, ప్రసుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సత్యదేవుని నిత్యకల్యాణంలో సీతారాములను మరో ఆసనంపై విడిగా ప్రతిష్ఠించాలని ఆదేశించారు. అప్పటి నుంచీ అదేవిధంగా చేస్తున్నారు. సీతారాముల ఉత్సవమూర్తుల వెనుక అలంకరించేందుకు వ్రత పురోహిత సంఘం వెండి మకరతోరణం తయారు చేయించి 2025లో సమర్పించింది. ఇప్పుడు అర్చకుడు రామ్‌కుమార్ దాతృత్వంతో సీతారాములకు టేకు సింహాసనం కూడా సమకూరింది.
గణపయ్యకు గణనీయ సేవలు
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామి వారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన స్వామి వారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. లఘున్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల్లో 24 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. 11 మంది భక్తులు గరిక పూజ నిర్వహించారు. 10 మంది భక్తులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. ఎనిమిది మంది వాహన పూజలు చేయించుకున్నారు. వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా స్వామివారికి రూ.2,90,554 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


