ఎమ్మెల్యే ఒత్తిడితోనే అక్రమ అరెస్టులు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఒత్తిడితోనే అక్రమ అరెస్టులు

May 18 2026 12:12 AM | Updated on May 18 2026 12:12 AM

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

కుట్ర రాజకీయాలపై న్యాయపోరాటం చేస్తాం

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి వెల్లడి

రంగంపేట: దొడ్డిగుంట, వెంకటాపురం, ముకుందవరం, సుభద్రంపేట గ్రామాలకు సంబంధించి గత నెల 29న జరిగిన ఫిషర్‌మెన్‌ సొసైటీ ఎన్నికలకు ముందు రోజున ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒత్తిడితోనే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. అక్రమంగా అరెస్టయిన బాధితుల కుటుంబ సభ్యులను శనివారం రాత్రి ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పారు. దొడ్డిగుంట గ్రామానికి చెందిన మడికి వెంకట్రావు భార్య, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మడికి లక్ష్మిని, చెల్లుబోయిన వీరబాబు భార్యను, అడబాల వీరబాబు భార్య గంగాబేబీని, చెల్లుబోయిన సత్తిబాబు కుటుంబ సభ్యులను, అడబాల సత్యనారాయణ తండ్రి అడబాల దుర్గారావును పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, ఎమ్మెల్యే ఒత్తిడితో అక్రమ కేసుకు గురైన వెంకటాపురం తాజా మాజీ సర్పంచ్‌ ముంగి గంగరాజు కుటుంబ సభ్యులను కూడా డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిషర్‌మెన్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతోనే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. తమ వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు. పోలీసులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా మారి, ఉద్దేశపూర్వకంగా కఠిన సెక్షన్లు పెట్టి, వారిని రిమాండ్‌కు పంపడం చాలా అన్యాయమని పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, బాధితులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకూ పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్‌పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, మాగాపు వెంకటరమణ, మాగాపు కాశి, ముంగి లక్ష్మీనారాయణ, అంచురి ఏసుబాబు, మాజీ ఉప సర్పంచ్‌ అంచురి శ్రీను, ఎంపీటీసీ సభ్యుడు నురుకుర్తి సత్తిబాబు, మాజీ సర్పంచ్‌ కారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement