అమలాపురం రూరల్: అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్, జూనియర్ మెన్ అండ్ ఉమెన్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌న్‌షిప్ పోటీలు కొనసాగుతున్నారయి. మూడో రోజు ఆదివారం ఉమెన్స్ విభాగంలో 52– 57 కిలోలు, మెన్ విభాగంలో 59 – 66 కిలోల కేటగిరీల్లో సబ్ జూనియర్, జూనియర్స్‌కు పోటీలు జరిగాయి. 52 కిలోల సబ్ జూనియర్స్ విభాగంలో నహాదియా ఫాతిమా జాతీయ స్థాయి రికార్డు సాధించారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో సత్తాచాటడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం విజేతలకు ఎమ్మెల్సీతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్న నాయుడు, జెడ్పీటీపీ పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.సతీష్ కుమార్, గంధం పల్లంరాజు బహుమతులు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, నాయకులు మోకా సు బ్బారావు, గనిశెట్టి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
నేరేళ్లమ్మ గుడిలో చోరీ
కాకినాడ రూరల్: సర్పవరంలోని నేరేళ్లమ్మ వారి గుడిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆ గుడి తాళాలు పగులగొట్టి నాలుగు కిలోల వెండి, రెండు కాసుల బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని అంచనా.
కోడలిపై లైంగిక వేధింపులు
అయినవిల్లి: కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వై.జ్యోతి తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. ఎస్.మూలపాలేనికి చెందిన ఓ యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. నెల రోజుల కిందట ఆమె అత్తారింటికి వచ్చింది. ఈ నెల 3న రాత్రి ఆమె స్నానాల గదికి వెళ్లింది. ఆ సమయంలో తన మామయ్య లైంగిక వేధింపులకు పాల్పడగా, ఆమె గట్టిగా కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
గోదావరిలో యువకుడి మృతి
దేవీపట్నం: పూడిపల్లి పంచాయతీ పోశమ్మగండి వద్ద గోదావరిలో ఓ యువకుడు మృతి చెందాడు. గండేపల్లి మండలం కె.గోపాలపురం గ్రామానికి చెందిన గోపాల సతీష్ (25) ఇద్దరు స్నేహితులతో కలసి గండిపోశమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఉదయం స్నేహితులతో కలసి గోదావరి స్నానం చేస్తుండగా, సతీష్ కాలుజారి గోదావరిలో గల్లంతయ్యాడు. దేవీపట్నం ఎస్సై షరీఫ్ స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చేపట్టారు. ఈ మేరకు ఆ యువకుడి మృతదేహం లభ్యం అయ్యింది.
పురుగు మందు తాగి ..
మలికిపురం: ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. గుడిమెళ్లంకలో టెంట్ సామాన్ల వ్యాపారం చేసే తోట మాణిక్యం (60) ఇంటి వద్ద వంతెన నిర్మాణ విషయమై తోట వీరవెంకట సత్యనారాయణ తదితరులకు వివాదం నడుస్తుంది. ఈ నెల 6న వీరవెంకట సత్యనారాయణ తదితరులు బలవంతంగా వంతెన నిర్మించడంతో మాణిక్యం మనస్తాపానికి గురై 13న పురుగు మందు తాగాడు. మాణిక్యాన్ని అమలాపురం కిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ 16న మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
డ్రైవర్ దుర్మరణం
దేవరపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన ఆరుగొల్లు వెంకటేశులు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రామచంద్రపురానికి చెందిన నారాయణమూర్తితో కలసి బొలెరో వాహనంపై వెంకటేశులు డ్రైవర్‌గా హైదరాబాద్ వెళ్లాడు. ఆ వాహనంపై ఏసీల లోడ్ తీసుకుని వస్తుండగా, గోపాలపురం శివారున జీడిగింజల ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి లారీ ఢీకొంది. బొలెరో వాహనం నడుపుతున్న వెంకటేశులు అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణమూర్తికి గాయాలయ్యాయి.


