ఫ 20న మెడికల్ షాపుల బంద్
ఫ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూతపడనున్న దుకాణాలు
ఫ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
రాయవరం: మెడికల్ షాపుల యజమానులు పోరుబాట పట్టారు. ఔషధాల విక్రయాల్లో సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత కెమిస్ట్, డ్రగ్గిస్టుల సంఘం (ఏఐఓసీడీ) పిలుపు మేరకు ఈ నెల 20న దేశ వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ పాటిస్తున్నారు. దీంతో బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని సుమారు 2,850, కాకినాడ జిల్లాలో 1,518, కోనసీమలో 950, మెడికల్ షాపులు మూత పడనున్నాయి. అత్యవసర మందులు వినియోగించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సంఘం ప్రతినిధులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రిటైల్, డీలర్ల విక్రయాలపై ప్రభావం పడుతుందని, రోగులకు నకిలీ మందులు అందుతున్నాయని మెడికల్ షాపుల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ
మెడికల్ షాపుల యజమానులు ప్రధానంగా మూడు డిమాండ్ల పరిష్కారానికి బంద్ పాటిస్తున్నారు. వీటితో పాటు స్థానిక సమస్యలను తీర్చాలని ఏఐఓసీడీ డిమాండ్ చేస్తోంది. ఆన్‌లైన్ ద్వారా ఔషధాల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆపాలని, నకిలీ మందులను అరికట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
డిస్కౌంట్ల పేరుతో..
కార్పొరేట్ సంస్థలు డిస్కౌంట్ల పేరుతో అమ్మకాలు చేస్తూ భారీ కుతంత్రానికి పాల్పడుతున్నాయన్నది ఏఐఓసీడీ ప్రతినిధుల ఆరోపణ. డ్రగ్ లైసెన్స్ అథారిటీ లేని బలం, విటమిన్స్ తదితర అన్ బ్రాండెడ్ ఔషధాలపై అధిక ధరలను ముద్రించి డిస్కౌంట్ పేరిట ధరలను కొద్దిమేర మాత్రమే తగ్గిస్తూ కొనుగోలు దారులను కార్పొరేట్ కంపెనీలు మోసగిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అలాగే మెడికల్ షాపుల నిర్వహణలో స్థానిక అధికారుల వేధింపులను నియంత్రించాలని, మెడికల్ షాపుల లైసెన్సు జారీని సులభతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అత్యవసర చర్యలు అవశ్యం
తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 2,820 మెడికల్ షాపులు, డీలర్ ఏజెన్సీలు ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.6 కోట్ల విక్రయాలు జరుగుతాయని అంచనా. దీనికి ఆన్‌లైన్ కొనుగోలు అదనం. అఖిల భారత కెమిస్ట్, డ్రగ్గిస్ట్ సమాఖ్య పిలుపు మేరకు ఈ నెల 20న జిల్లాలోని మెడికల్ షాపులన్నీ మూతపడనున్నాయి. దీంతో అత్యవసర ఔషధాల కోసం ఆ రోజున ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర మందుల కోసం కనీసం ఒక్కో చోటైనా మెడికల్ షాపులు తీసి ఉంచే విధంగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సామాజిక బాధ్యతగా ఒక్కో దుకాణాన్ని తెరిచేందుకు సంఘం అనుమతిస్తుందా? లేక సంపూర్ణ బంద్ పాటిస్తారా? అనేది వేచి చూడాలి. కాగా రోజువారీగా వినియోగించే ఔషధాలతో ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రజలు అర్థం చేసుకోవాలి
రిటైల్ మందుల షాపుల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు డిస్కౌంట్ల పేరుతో అమ్మకాలు చేస్తూ పరోక్షంగా ప్రజలను మోసగిస్తున్నారు. మా బాధలను చెప్పుకొనేందుకే బంద్ పాటిస్తున్నాం.
–పులగం శ్రీనివాసరెడ్డి, మందుల షాపు యజమాని, రాయవరం
మరింత భారంగా నిర్వహణ
ఆన్‌లైన్ కొనుగోళ్ల కారణంగా ప్రజలకు నాసిరకం మందులు అందుతున్నాయి. ఫలితంగా వారి ఆరోగ్యంపై దుష్ఫ్రభావం చూపుతుంది. రిటైల్ విక్రయాలు తగ్గడంతో స్థానికంగా మెడికల్ షాపుల నిర్వహణ భారంగా మారుతుంది. న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి చేపట్టిన బంద్‌కు ప్రజలు సహకరించాలి.
–పిండి గణపతి,
ప్రధాన కార్యదర్శి,
తూర్పు గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్
సమస్యలివీ..
ఫ ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయాల వల్ల రిటైల్ మందుల షాపుల్లో విక్రయాలు తగ్గి కుదేలవుతున్నాయన్నది మెడికల్ షాపుల యజమానుల వాదన. డీలర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఏఐఓసీడీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా నిషేధిత, పరిమితికి మించిన ఔషధాల కొనుగోలు, ఒకే ప్రిస్కిప్షన్‌ను పలుమార్లు రిపీట్ చేస్తూ నిద్రమాత్రలు ఇవ్వడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
ఫ ఆన్‌లైన్ విక్రయాలకు 2018 ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వం ఈ– ఔషధ పేరిట జారీ చేసిన జీఓ 817(ఎఫ్), అలాగే 2020 మార్చి 23న జారీ చేసిన 220 (ఈ) నోటిఫికేషను రద్దు చేయాలి. కరోనా సమయంలో ఇచ్చిన ఈ తాత్కాలిక జీఓను రద్దు చేయకుండా నేటికీ కొనసాగిస్తున్నారని, ఆ జీఓ మేరకు ఆన్‌లైన్‌లో మందులు విక్రయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


