లే నాన్నా..ఇంటికెళ్దాం! | - | Sakshi
Sakshi News home page

లే నాన్నా..ఇంటికెళ్దాం!

May 18 2026 12:12 AM | Updated on May 18 2026 12:12 AM

కొడుకు మృతదేహం వద్ద తల్లి రోదన

ట్రాక్టర్‌ పైనుంచి పడి

యువకుడి దుర్మరణం

అడ్డతీగల: లే నాన్నా.. ఇంటికెళ్దాం.. నీవు తెచ్చిన చేపల కూర వండాను తిందువు..! అంటూ విగతజీవిగా పడి ఉన్న కుమారుడి వద్ద ఓ తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. అడ్డతీగల మండలం భీముడుపాకలు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బందంవారిపాకలకు చెందిన బందం వీరమ్మకు ముగ్గురు కుమారులు. ఇందులో చిన్నవాడైన బందం గంగరాజు (20) ఆదివారం ఉదయం ఇంట్లో వంటకు చేపలు తెచ్చి తల్లి వీరమ్మకు ఇచ్చి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వచ్చాడు. అతను భీముడుపాకలు వెళ్లి తిరిగి బందంవారిపాకలులోని తన ఇంటికి వస్తూ ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ఎక్కాడు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్‌ పైనుంచి గంగరాజు ప్రమాదవశాత్తూ కిందపడి పోయాడు. ట్రాక్టర్‌ అతని పైనుంచి వెళ్లిపోవడంతో తల, ముఖం భాగాల వద్ద తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తల్లి వీరమ్మ అక్కడకు వచ్చి రోడ్డుపై రక్తపు గాయాలతో ఉన్న కొడుకును చూసి తల్లడిల్లిపోయింది. చిన్నవాడైన గంగరాజును అల్లారుముద్దుగా పెంచుకున్నానని, ఇలా జరుగుతుందని అనుకోలేదని రోదించింది. లే నాన్నా కూర వండాను ఇంటికి రా.. అంటూ ఆమె అనడం చూసిన తీరు అక్కడి వారిని కంటనీరు పెట్టించింది. 108 అంబులెన్స్‌తో సిబ్బంది వచ్చి గంగరాజు మరణించినట్లు ధ్రువీకరించి, పోలీసులకు సమాచారమిచ్చారు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అడ్డతీగల సీహెచ్‌సీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement