యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

May 18 2026 12:12 AM | Updated on May 18 2026 12:12 AM

తాళ్లపూడి: శ్మశాన వాటిక వద్ద ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ కథనం ప్రకారం.. ప్రక్కిలంకలోని గోదావరి ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక వద్ద చెట్టుకు సీతానగరం మండలం మునికూడలికి చెందిన రాయుడు దొరబాబు (25) ఉరివేసుకుని మృతి చెందాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తండ్రి రాయుడు నూకరాజుకు సమాచారం ఇచ్చి, కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.

రైలు నుంచి జారిపడి

వ్యక్తి మృతి

తుని: గొల్లప్రోలు సమీపంలో రైలు నుంచి జారిపడి ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యామ్‌ త్రినాథరావు తెలిపారు. ఈ మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. విజయవాడ వైపు వెళ్లిన రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి (40) మృతి చెందాడన్నారు. మృతుడి వివరాలు తెలియలేదని, నల్లగడుల, ఎరుపు రంగు ఫుల్‌ చేతుల చొక్కా, నీలం రంగు జీన్‌ ఫ్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

‘ఎవరిదీ చూపు’ పుస్తకావిష్కరణ

బోట్‌క్లబ్‌: కాకినాడ గాంధీభవన్‌లో ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యాన కోగంటి విజయ్‌ రాసిన ‘ఎవరిదీ చూపు’ కవితా సంపుటి ఆవిష్కరణ, సమీక్ష సభ జరిగింది. ఈ పుస్తకాన్ని కవిసంధ్య పత్రిక సంపాదకులు శిఖామణి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన జోస్యుల కృష్ణబాబు మాట్లాడుతూ గ్రంథకర్త కోగంటి విజయ్‌ కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ, సాహిత్యంపై మక్కువతో అనేక గ్రంథాలు వెలువరించారని అన్నారు. ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి మాట్లాడుతూ స్ఫూర్తిదాయకమైన కవిత్వం విజయ్‌ కవిత్వం అన్నారు. వక్త కాళ్లకూరి శైలజ మాట్లాడుతూ కోగంటి విజయ్‌ కవిత్వం ఎటువంటి సంక్లిష్టతకు తావులేకుండా అర్థమయ్యేలా ఉందన్నారు. శిఖామణి మాట్లాడుతూ సుమారు 70 కవితలు కలిగిన ఈ కవితా సంపుటిని ఆవిష్కరించే అవకాశం కల్పించిన సాహితీ స్రవంతికి ధన్యవాదాలు తెలిపారు. గ్రంథకర్త కోగంటి విజయ్‌ మాట్లాడుతూ అత్యంత వైభవంగా పుస్తకావిష్కరణ జరిపిన సాహితీ స్రవంతి నిర్వాహకులకు, అధ్యక్షులు మార్ని జానకీరామచౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో ఉయ్యపు హనుమంతరావు, మధునాపంతుల సత్యనారాయణ, అవధానుల మణిబాబు, కె.గౌరినాయుడు, దుర్గాప్రసాద్‌, శ్రీవత్స, సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి, మిరప మహేష్‌, సోమయాజులు, మన్మథరావు, పి.సుబ్బరాజు, చింతపల్లి సుబ్బారావు, మేడిశెట్టి శ్రీరాములు, సాయి సత్యనారాయణ, శిరీష, అద్దేపల్లి జ్యోతి, ఇందిర, ఉషారాణి, సీఎస్‌, ఆకెళ్ల శ్రీరామమూర్తి తదితర సాహితీవేత్తలు పాల్గొని స్వీయ కవితలను వినిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement