ఏడడుగుల బంధం వీడిపోయింది | - | Sakshi
Sakshi News home page

ఏడడుగుల బంధం వీడిపోయింది

May 18 2026 12:12 AM | Updated on May 18 2026 12:12 AM

రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి

రంగంపేట: ఏడడుగుల బంధం వీడిపోయింది.. ఆ అన్యోన్య జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. శుభకార్యానికి వెళ్తున్న ఆ దంపతుల ఆనందం ఆవిరైపోయింది. రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందడం తీరని విషాదాన్ని నింపింది. దీనిపై స్ధానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేట మండలం వడిశలేరు గ్రామానికి చెందిన పోతుల వీర్రాజు, రామలక్ష్మి (55) దంపతులు. ఆదివారం రంగంపేటలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు మోటార్‌ సైకిల్‌పై తమ ఇంటి నుంచి బయలుదేరారు. సుమారు 11.40 గంటల సమయానికి గ్రామం నుంచి ఏడీబీరోడ్డు వైపు వెళుతూ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన వ్యాన్‌ వీరు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొంది. దీంతో వెనుక కూర్చున్న రామలక్ష్మి రోడ్డుపై పడిపోవడంతో వ్యాన్‌ వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లిపోయాయి. రామలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై భర్త వీర్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివప్రసాద్‌ చెప్పారు. రామలక్ష్మి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement