ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ వసుంధర | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ వసుంధర

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లా ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌వోగా జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌ మరియు టీబీ నివారణ అధికారి, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ఎన్‌.వసుంధరను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు గురువారం పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వసుంధర శుక్రవారం బొమ్మూరులోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆమెను పలువురు ఉద్యోగులు పూలబొకేలతో అభినందించారు.

డీఏఓగా బొడ్డపాటి

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లా వ్యవసాయ అధికారిగా బొడ్డపాటి వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో సహాయ వ్యవసాయ సంచాలకునిగా పనిచేస్తూ పదోన్నతిపై జిల్లా వ్యవసాయ అధికారిగా ఈ జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు ఇన్‌చార్జిగా పనిచేసిన రాబర్ట్‌ పాల్‌ రెగ్యులర్‌ పోస్టింగ్‌ అయిన ఉమ్మడి జిల్లా ఆత్మ పీడీగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి కృషిచేస్తానని వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షుడు డీవీ కృష్ణ, కార్యదర్శి కమల్‌ రాజ్‌, రాష్ట్ర ఏఈఓ సంఘ అధ్యక్షుడు డి.వేణుమాధవ్‌ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

4, 5 తేదీలలో ప్రత్యేక రైళ్లు

రాజమహేంద్రవరం సిటీ: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4, 5 తేదీలలో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ టౌన్‌– లింగంపల్లి (07703)మధ్య, 5వ తేదీన లింగంపల్లి– కాకినాడ టౌన్‌ (07704) మధ్య రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయని పేర్కొన్నారు.

పేదల సొంతింటి కలను

చిదిమేసిన చంద్రబాబు

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం

రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి

కాకినాడ రూరల్‌: పేదవాడి సొంతింటి కలను చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా చిదిమేసిందని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షలకు మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి స్థలాలను కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలోని ఆర్‌ 5 జోన్‌లో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను సీఆర్డీఏ పరిధిలోకి విలీనం చేయడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను బలవంతంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలుసేనని పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది పేదలు వారికి కేటాయించిన ఇంటి స్థలాలు కోల్పోతున్నారని తెలిపారు. మెడికల్‌ కాలేజీల నిర్వహణకు, ఆరోగ్య నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నిధులు ఇవ్వని ప్రభుత్వం అమరావతి రాజధానిపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అమరావతిలో పలు కట్టడాలకు గ్లాస్‌ ఫినిషింగ్‌ చేసేందుకు రూ.2,540 కోట్లు మంజూరు చేయడాన్ని ఆక్షేపించారు.

Advertisement
 
Advertisement
Advertisement