సాక్షి, రాజమహేంద్రవరం: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరంలో చేపడుతున్న రివర్‌ఫ్రంట్ పనులతో ప్రమాదం పొంచి ఉందా.. అనుభవం లేని కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టడం.. పరిమితిమి మించి తవ్వకాలు చేపట్టడంతో గోదావరి గట్టు ప్రమాదకరంగా మారిందా.. వరదలు వస్తే గట్టు కుంగిపోతుందా.. అదే జరిగితే నగర రక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదముందా.. 1953, 1986 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశముందా.. గండి పడిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్షణ గోడ వద్ద రివర్‌ఫ్రంట్ పనుల పేరుతో తూట్లు పొడవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రజల నుంచి.
ఏం జరుగుతోందంటే..
అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరం శారదా మఠం ఎదురుగా పద్మావతి ఘాట్‌లో సుమారు రూ.24 కోట్ల వ్యయంతో రివర్‌ఫ్రంట్, ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అక్కడ ఉన్న ఘాట్‌ను తొలగించారు. పక్కనే ఉన్న పార్కును సైతం కలుపుతూ ఒకే రివర్‌ఫ్రంట్ నిర్మించాలన్నది ఉద్దేశం. ఇందులో భాగంగా ఘాట్‌ను పూర్తి స్థాయిలో తవ్వేశారు. అవసరమైన మేరకు కాకుండా పక్కనే ఉన్న రోడ్డు వైపు సైతం లోతుగా తవ్వేయడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అనుభవం లేని కాంట్రాక్టర్‌కు ఈ పనులు అప్పగించడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పద్మావతి ఘాట్ వద్ద రూ.8 కోట్లతో చేపడుతున్న అప్పర్ రివర్‌ఫ్రంట్ పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి మరింత సమయం పట్టనుంది.
ఎందుకంటే..!
గోదావరి వరదల సమయంలో పుష్కర ఘాట్ నుంచి ప్రస్తుత రివర్‌ఫ్రంట్ పనులు చేపడుతున్న ఘాట్ వరకూ ప్రవాహం పోటెత్తుతుంది. గోదావరి నీరు మలుపు తిరిగే ప్రాంతం కావడంతో ఇక్కడ నీటి వడి (ప్రవాహ ఒత్తిడి) ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గోదావరి చరిత్రలో ఇప్పటి వరకూ గరిష్టంగా 32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఇదే స్థాయిలో వరదలు వస్తే ఈ గట్టు పటిష్టత ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటి వరకూ గట్టుకు రక్షణగా నిలిచిన రివిట్‌మెంట్‌ను ఆధునీకరణ పేరుతో తవ్వేయడం మరింత వివాదాస్పదంగా మారింది. లోతుగా తవ్వేయడంతో అక్కడ నీరు చేరితే మట్టి అండలుగా జారిపోతుంది. ఫలితంగా గట్టు బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి వరద ఉధృతికి గట్టు కుంగితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఈ గట్టును ఆనుకుని రహదారి, దాని పక్కనే నివాస గృహాలు ఉన్నాయి. దీంతో, గట్టు తెగితే ఆ ఇళ్లు వరద ముంపులో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది.
నత్తనడకన..
మరోవైపు గోదావరి రివర్‌ఫ్రంట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత రూపుదిద్దుకున్న డిజైన్‌ను మార్చడంతో కాంట్రాక్టర్‌కు మున్సిపల్ అధికారులు బిల్లులు మంజూరును నిలిపివేసినట్లు పమాచారం. దీంతో, పనులకు కొద్ది రోజులు బ్రేక్ పడింది. డిజైన్ మార్చి తిరిగి పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలు శిథిలమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత కొరవడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్, జూలై నెలల్లో గోదావరికి వరదలు వచ్చే అవకాశాలున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఆలోగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ పనులు వేగంగా చేస్తే నాణ్యత కొరవడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో గోదావరి గట్టు భద్రత, రివర్‌ఫ్రంట్ పనుల నాణ్యత ప్రశ్నార్థకమవుతున్నాయి.
భద్రతపై ఆందోళన
వాస్తవానికి గోదావరి రివర్‌ఫ్రంట్ పనులు ప్రారంభమైనప్పటి నుంచీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనుల వల్ల గోదావరి ఘాట్లు ధ్వంసమవుతున్నాయని పురోహిత వర్గాలు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశాయి. తాజాగా ఈ పనులు కొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి. గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజమహేంద్రవరం నగర రక్షణలో ఈ గట్టు కీలకంగా నిలుస్తుంది. గతంలో 1953, 1986 సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో గోదావరి గట్టుకు గండ్లు పడి, నగరాన్ని వరద ముంచెత్తింది. ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. అప్పట్లో గట్టు పటిష్టతకు పై భాగంలో రక్షణ గోడ నిర్మించారు. ఈ గోడను సైతం ప్రస్తుత రివర్‌ఫ్రంట్ పనుల్లో తొలగించారు. దీంతో, గోదావరి గట్టు భద్రతపై స్థానికులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ రివర్‌ఫ్రంట్ పనుల పేరిట గట్టుకు తూట్లు
ఫ ఆధునీకరణ పేరిట రివిట్‌మెంట్ తవ్వకాలు
ఫ వరదలు వస్తే పొంచి ఉన్న ప్రమాదం


