● వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
● ఏడుగురికి తీవ్ర గాయాలు
ఆత్రేయపురం: మండల పరిధిలోని మెర్లపాలెం లొల్ల వైపు వెళుతున్న రెండు మోటార్ బైకులు ఢీకొని ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బుల్లెట్‌పై ముగ్గురు, మరో బైక్‌పై ఇద్దరు లొల్ల వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మోటార్ సైకిల్ ను బుల్లెట్‌పై వెళుతున్న వ్యక్తి మరో వాహనాన్ని తప్పించబోయి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బుల్లెట్‌పై ఉన్న మెర్లపాలేనికి చెందిన ఎలిపే శ్రావణ్ కుమార్ (25) కాలువలో పడి మృతి చెందాడు. కాగా బుల్లెట్‌పై ఉన్న మరో ఇద్దరు ఎలుపే సఫిన్, ఎలిపే హేమంత్ తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా బైక్‌పై గల బాలుడు సురక్షితంగా ఉండగా మరొక వ్యక్తి కొమ్మర జస్వంత్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఎలిపే శ్రవణ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించినట్లు ఎస్‌ఐ ఎస్.రాము తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సీఆర్‌పీఎఫ్ వ్యాన్ ఢీకొని యువకుడు..
ఎటపాక: మండల పరిధిలోని బొజ్జిగుప్ప వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ ఐషర్ వ్యాన్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం కూలి పనులకోసం భద్రాచలం వచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్నారు. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కిష్టారం వద్ద ఉన్న 219 సీఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్లను భద్రాచలం తీసుకొస్తున్న ఐషర్ వ్యాన్ బొజ్జిగుప్ప సమీపంలోని రాయిగూడెం వద్ద వారి ద్విచక్రవాహనాన్ని డీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న కొర్సా రామ్మూర్తి, కొర్సా రవి, కారం వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం జీజీహెచ్‌కు తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో రామ్మూర్తి (38) మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై అప్పలరాజు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గేదెలను తప్పించబోయి ఒకరు..
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి నుంచి అడ్డతీగల వైపు మోటారు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు జడ్డంగి సమీపాన జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అడ్డతీగల మండలం పింజరికొండ గ్రామానికి చెందిన పులగం రామిరెడ్డి (30) ఘటన స్థలంలోనే మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన వెలుగుల లోవరాజు (30) తీవ్ర గాయాల పాలయ్యాడు. వీరు కొయ్యూరు మండలం కాకరపాడులో జరుగుతున్న జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. జడ్డంగి ఎస్సై చినబాబు సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా అనంతరం రామిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లోవరాజును జడ్డంగి పీహెచ్‌సీకు తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. జాతీయ రహదారిపై గేదెలు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఎస్సై చినబాబు తెలిపారు. రామిరెడ్డి మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ట్రాక్టర్ ఢీకొని మరొకరు..
రాజానగరం: మండలంలోని తూర్పుగానుగూడెం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు గండేపల్లికి చెందిన అల్లాటి గోపాలం (28), అతని మిత్రుడు ముంగర శివశంకర్‌తో కలిసి బైకుపై చింతల నామవరం వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తూర్పుగానుగూడెం వచ్చే సరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ వారి బైకును ఢీ కొనడంతో గోపాలం అక్కడికక్కడే మృతి చెందగా, శివశంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. అవివాహితుడైన గోపాలం బ్యాంకు లోన్ రికవరీ ఏజెంటుగా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ బ్రేకులు ఫెయిలై.. క్లీనర్ తలపైకి ఎక్కి..
సామర్లకోట: పెద్దాపురం మండల పరిధిలోని రైస్ మిల్లు ఆవరణలో లారీ ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలం వాలు తిమ్మాపురం రోడ్డులోని పట్టాభి రైస్ మిల్లులో బీహర్‌కు చెందిన అశోక్‌కుమార్ (21), అతని మేనమామ ఇద్దరు ఏడాదిగా లారీపై పని చేస్తున్నారు. అశోక్ కుమార్ లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి రైస్ మిల్లుకు వచ్చిన లారీ కేబిన్‌లో మేనమామ పడుకున్నాడు. అశోక్‌కుమార్ లారీ వెనుక కింద పడుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో దానంతట అదే వెనుకకు రావడంతో అశోక్‌కుమార్ తల మీదుగా లారీ టైర్ ఎక్కి చనిపొయిన్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


