రాజమహేంద్రవరం రూరల్: భారత తొలి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, జీవితాంతం దళిత, బహుజనుల హక్కుల కోసం, సమసమాజ నిర్మాణం కోసం పాటు పడిన సమతామూర్తి జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. ఆయన గొప్ప పరిపాలనాదక్షుడన్నారు. సంఘ సంస్కర్తగా, స్వాతంత్య్ర సమర యోధుడిగా, 27 సంవత్సరాలకే శాసన సభ్యుడిగా, అనంతరం 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించిన మహానాయకుడని అన్నారు. 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ పునరంకితమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ, రూరల్ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు చింతపర్తి రాంబాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా స్థానిక జాంపేట చర్చి గేటు వద్ద ఆ మహనీయుని విగ్రహానికి ఆమె ఆదివారం పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో అసమానతలను ఎదుర్కొంటూ ఎదిగిన జగ్జీవన్‌రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని ఆదర్శంగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.సందీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, బహుజన సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


