● ఉమ్మడి జిల్లాలో కల్తీ పదార్థాల కలకలం
● మద్య విక్రయాలతో ఆరోగ్య సమస్యలు
● సమస్యల వలయంలో వైద్య సేవలు
● ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
కపిలేశ్వరపురం: భారత రాజ్యాంగం 49వ అఽధికరణం ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలో చంద్రబాబు తదితర కూటమి నేతలు ఎన్నికల వేళ ఉచిత వైద్య సేవలంటూ ఓట్లు అభ్యర్థించి, గెలిచాక అవన్నీ గాలికి వదిలేసి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఈ నెల 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు ప్రభుత్వం సుమారు రూ.450 కోట్లు బకాయిలు పెట్టింది. దీంతో క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కల్తీ పాలు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ పేరుతో ప్రతి జంటా ఇద్దరిని తప్పనిసరిగా కనాలని చంద్రబాబు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజల ఆరోగ్యం, తీరుతెన్నులపై ప్రత్యేక కథనం
ఆరోగ్య కేంద్రాలిలా...
ఉమ్మడి జిల్లాలో 140 పీహెచ్‌సీలు, 22 సీహెచ్‌సీలు, 7 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరంలలో సామాన్య ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. జిల్లాల విభజన అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 450, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 165 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. ఆయా సంస్థల్లో వేలాది మంది వైద్యులు, ఫార్మసిస్టులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు.
పోలవరం జిల్లాలో 12 మండలాలు ఉండగా ఒక్కో మండలానికి సుమారుగా పది చొప్పున మొత్తం 120 ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ల క్లినిక్‌లు ఉన్నాయి.
ప్రమాదంలో ప్రజారోగ్యం..
ఉమ్మడి జిల్లాలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. రాజమహేంద్రవరంలో కల్తీ పాల విక్రయం వల్ల 21 మంది కిడ్నీలు పాడయ్యాయి. వారిలో 13 మంది చనిపోయారు. మన్యం, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వసతి గృహాల్లో ఆహారం విషతుల్యమై విద్యార్థులు అస్వస్థతకు గురయ్యాయి. గత నెల 5న తాళ్లరేవు మండలం కోరంగి అంగన్‌వాడీ కేంద్రానికి కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటాడుతున్న సిబ్బంది కొరత..
3.50 లక్షల జనాభా కలిగిన పోలవరం జిల్లాలోని 189 పంచాయతీలకు కేవలం ఏడుగురు ఆప్తాల్మిక్ అధికారులు మాత్రమే ఉన్నారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో 18 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు కేవలం నలుగురు, 8 మంది జీడీ వర్కర్లకు ముగ్గురు మాత్రమే ఉన్నారు. మారేడుమిల్లి పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులకు ఒకరు, గుర్తేడు పీహెచ్‌సీలో ఉన్న రెండు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. డిప్యుటేషన్‌పైనే విధులు సర్దుబాటు చేస్తున్నారు.
ఆహార సరఫరాలో సైతం..
మార్చి 2న కాకినాడలో ఫుడ్ సేఫ్టీ అండ్ లీగల్ మెట్రాలజీ, మున్సిపల్ హెల్త్ విభాగం అధికారులు దాడులు చేసి హొటళ్లలో నిల్వ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. ఈ తరహా ఘటనలు అమలాపురం, రాజమహేంద్రవరం, మండపేట పట్టణాల్లో సైతం జరిగాయి. నాణ్యతా లోపంతో ఆహార పదార్థాలను అందిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ – 2006లోని సెక్షన్ 206 ప్రకారం చర్యలు ఉంటాయి.
పీడిస్తున్న సామాజిక రుగ్మతలు..
మహిళల ఆరోగ్యాన్ని సామాజిక రుగ్మతలు దెబ్బతీస్తున్నాయి. బాల్య వివాహాలు, అవిద్య, కుటుంబ హింస, పోషకాహార లోపం వంటివి ఇందుకు కారణమవుతున్నయి. కూనవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిథిలో 326 మంది గర్భిణుల్లో 24 మంది బాలికలు ఉన్నట్టు తేలింది. రేఖపల్లి ఆసుపత్రిలో పరీక్షించిన గర్భిణుల్లో 17 మంది, ఎటపాక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 12 మంది బాలికలను అధికారులు గుర్తించారు. హైరిస్క్ ఉన్న గర్భిణుల్లో గణాంక వివరాల్లో 8 నుంచి 10 శాతం కలిగిన నాలుగు జిల్లాలు ఉండగా అందులో కాకినాడ ఒక జిల్లాగా ప్రకటించారు.
ట్రామాకేర్ కేంద్రాలు లేక..
2025లో కాకినాడ జిల్లాలో జరిగిన 803 రోడ్డు ప్రమాదాల్లో 330 మంది చనిపోయారు. తూర్పులో 837కి 328 మంది, కోనసీమలో 618 ప్రమాదాల్లో 225 మంది చనిపోయారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం, తునిలలో మాత్రమే ట్రామాకేర్ కేంద్రాలున్నాయి. తుని కేంద్రంలో కేవలం 8 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు.
మద్యం విక్రయాలతో ముప్పు..
కాకినాడలో 155, ప్రైవేటు షాపులు, 20 బార్లు, తూర్పుగోదావరిలో 154 షాపులు, 19 బార్లు, అంబేడ్కర్ కోనసీమలో 169 షాపులు, 10 బార్లకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనధికారికంగా వేల సంఖ్యలో బెల్ట్ షాపులున్నాయి. రూ.కోట్లు ఆర్జిస్తూ సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం నాశనం చేస్తోంది.
నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు
ఈ నెల 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో రూ.250 కోట్లు, కాకినాడ జిల్లాలో సుమారు రూ.100 కోట్లు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రూ.100 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. పోలవరం జిల్లా మొత్తానికి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవలందుతున్నాయి. 12 మండలాల పరిధిలో 189 గ్రామాల్లోని 3,49,799 మంది రాజమహేంద్రవరం, కాకినాడ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఆస్పత్రులకు అస్వస్థత
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పేరుకు వంద పడకలే కానీ ఉన్నవి 40 మాత్రమే. మండపేటలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తి కాలేదు. మలికిపురంలో మండలానికి రెండో పీహెచ్‌సీ మంజూరైనా అందుబాటులోకి తీసుకురాలేదు. కాకినాడ జీజీహెచ్ దుస్థితిపై విసిగి వేసారిన బాధిత రోగి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. వార్డు మార్చేందుకు డబ్బులు అడుగుతున్నారంటూ తన బాధ చెప్పుకున్నారు.


