సమస్త మానవాళి రక్షణ కోసం కరుణామయుడైన ఏసుక్రీస్తు సిలువపై ప్రాణత్యాగం చేసి.. మరణంపై విజయం సాధించి.. మూడో రోజున పునరుత్థానుడైన మహత్తర ఘట్టాన్ని స్మరించుకుంటూ క్రైస్తవులు జిల్లావ్యాప్తంగా ఈస్టర్ పర్వదినాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. పరలోకగతులైన ఆత్మీయ బంధుమిత్రుల సమాధులను వారి కుటుంబ సభ్యులు శనివారమే శుభ్రపరిచారు. పువ్వులు, రంగులతో ముస్తాబు చేశారు. తెల్లవారుజామునే కొవ్వొత్తులు వెలిగించి, ప్రార్థనలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో బైపాస్ రోడ్డులోని లూథరన్ సమాధుల తోట, క్వారీ మార్కెట్ వద్ద గల సమాధుల వద్ద గతించిన తమ పూర్వీకుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పేదలకు వస్త్రాలు, వివిధ కానుకలు దానం చేశారు. అనంతరం, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రేమ, కరుణ, శాంతి, సహనం, క్షమ, ఐక్యత వంటి మానవీయ విలువలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా పాస్టర్లు ఉద్బోధించారు. దేవుని వాక్యాన్ని వినిపించారు.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)


