జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరిక
అమలాపురం టౌన్: క్రికెట్ బెట్టింగ్‌లు వేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హితవు పలికారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన క్రమంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపామని, పట్టుబడితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం క్రికెట్ బెట్టింగ్‌లపై అమలాపురంలో ఎస్పీ మీనా ఓ ప్రకటన విడుదల చేశారు. బెట్టింగ్ నిర్వాహకులపై, ఆన్‌లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించినా, ప్రోత్సహించినా, ఆ బెట్టింగ్‌ల్లో పాల్గొన్నా ఏపీ జూద చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్‌ల యాప్‌ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో మీ పిల్లలు ఏఏ యాప్స్ వాడుతున్నారనే వాటిపై దృష్టి పెట్టాలన్నారు. క్రికెట్‌ను వినోదంగానే స్వీకరించాలని, దానిని జూదంగా మార్చి మీ బంగారు భవష్యత్‌ను, తల్లిదండ్రుల కలలను చిన్నాభిన్నం చేసుకోవద్దని యువకులకు హితవు పలికారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిసే ఆ సమాచారాన్ని 100 లేదా 112కు కాల్ చేసి తెలపాలన్నారు. అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.


